| ఇతిహాసములు | రంగనాథరామాయణము | అయోధ్యాకాండము |
|
యాదట నినుఁగొల్చునట్ల నీదైన పాదుకాయుగళంబు భరతుండు గొల్చి నెమ్మది నుండెడు; నీ పాదుకమ్ము లి.”మ్మన్నఁదల్లులు హితులు నాశ్రితులు బౌరులు మంత్రులు బాంధవులప్పు “డోరామ!యిటుసేయు;589ముచిత.”మటంచుఁ బలుకంగ వేవేగ భరతుండు హేమ విలసితపాదుకాద్వితయంబు రాము ముందట నిడిన సంఫుల్లారుణార విందపల్లవ 590గర్వవిభవ భేదములు, యతి వధూతిలకశాపాపనోదములు, శ్రుతిశిరోభవనవిశ్రుత వినోదములు; తనదుపాదములు సంతత సనకాది మునివివాదములు రాముఁడు మోపి యొసగఁ జేకొని యవిరెండు శిరమునఁదాల్చి కైకేయి కొడుకు రాఘవునకిట్లనియె: “నీవేషమున నేను నృపవేషముడిగి తావకపాదుకా ద్వంద్వంబునందుఁ బదిలంబుగా రాజ్యభారంబు నిలిపి పదునాల్గువర్షముల్ పాలించువాఁడ. నా మీఁద మీరయోధ్యకు రాకయున్న స్వామిపాదములాన వహ్నియేఁజొత్తు.” ననిపల్కి యన్నకు నతిభక్తి మ్రొక్క ననుజుని దీవించి యక్కునఁజేర్చి తల్లుల నూరార్చి ధన్యులౌ మౌని వల్లభులను మంత్రివరుల బాంధవుల నెల్లవారలఁ బ్రియం బెసగ వీడ్కొలుప నుల్లంబులో శోకముప్పొంగుచుండ 591భరతుఁడప్పుడు రాముపాదుకంబులకు సరి ప్రదక్షిణ నమస్కారముల్ సేసి పట్టంపుటేనుంగుపై నొప్పఁ దెచ్చి పెట్టి లోకంబులు ప్రీతిఁ గీర్తింప ఛత్రచామరములు సరిఁదాల్చి పొల్చి శత్రుఘ్నుఁడును దాను 592సంగడిఁగొల్చి చెలఁగి నల్దిక్కుల సేనలు గొలువఁ గులపవిత్రుఁడు చిత్రకూటంబుడిగ్గి 593యబ్భంగి భరతేశుఁడడలుచు నరిగి యబ్భరద్వాజు 594ని యడుగులకెఱఁగి యతనితోఁదనదు వృత్తాంతంబు దెలిపి యతఁ595డర్థిఁ బనుప సైన్యంబులుఁదాను నటపోయి గంగామహానది దాటి, యట శృంగిబేరంబు 596నందు నా గుహునిఁ బటుయశో597ధనుని సంభావించి నిలిపి, యట పోయి మఱి యయోధ్యాపురిఁజొచ్చి తడయక నగరిలోఁ దల్లుల598నిలిపి కడు మూలబలములఁగావలి వెట్టి మణిలేని పెట్టియమాడ్కి నాకాశ మణిలేని పగలింటిమాడ్కిఁ జూడ్కికిని జతురపుణ్యుఁడు రామచంద్రుండు లేని యతిశూన్యమగు నయోధ్యాపురిఁజూచి యాయతశుభశీలుఁ డందుండరోసి పోయి నందిగ్రామమున వసియించి 599పనివడి రఘురాముపాదుకాయుగళ మున రాజ్యభారమిమ్ముల నావహించి శ్రీరామునకుఁబోలె సేవసేయుచును నారచీరలు జడల్ నవయుచుఁదాల్చి యా రాఘవునిపునరాగమనంబుఁ గోరుచు నతనిసద్గుణము లెన్నుచును సరససజ్జనమంత్రి సమ్మతితోడ భరతుండు మహియెల్లఁబాలించుచుండె. 600 నిది యయోధ్యాకాండ మెల్లలోకముల విదితమై బుధలోక వినుతమౌఁగాక! నారూఢి నార్షేయమై యాదికావ్య మై రసికానందమై యెల్లనాఁడు నివ్వసుమతి నొప్పు నీ పుణ్యచరిత మెవ్వరు సదివిన నెవ్వరు వినిన సామాదిబహువేదచయధామరామ నామ చింతామణి నవ్యభోగములు పరహితాచారముల్ ప్రభువిచారములు పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు ధర్మైక్యనిష్ఠలు దానాభిరతులు. నాయురారోగ్యంబు లధికసంపదలుఁ బాయక పాటిల్లుఁ; బాపక్షయంబు వరపుత్త్రలాభంబు వైరినాశనము సరినొప్పు; ధనధాన్యచయసమృద్ధియును, నే విఘ్నములు లేక యిండ్లలో నధిక లావణ్యవతులైన లలనలపొందు, నన్నలుఁదమ్ములు నభివృద్ధిఁబొంది మన్ననతోఁగూడి మలసియుండుటయు, సతతంబు దేవతాసంతర్పణంబుఁ బితృగణతృప్తియుఁ బెంపొందుచుండు; నిది మోక్షసాధనం,బిది పాపహరము, నిది దివ్య,మిది భవ్య, మిదియు శ్రీకరము; రమణీయలీల నీ రామాయణంబుఁ గ్రమమొప్పఁబూజింపఁగల్గుఁబుణ్యములు; వ్రాసినవారికి వరశుభోన్నతులు వాసవలోకనివాసంబుఁగలుగు. నెందాఁకఁగులగిరు లెందాఁక జలధు లెందాఁక రవిచంద్రు లెందాఁకఁదార లెందాఁక వేదంబు లెందాఁక దిశలు నెందాఁక భువనంబు లేపు దీపించు నందాఁక నీ కథ యక్షరానంద సందోహదోహళాచారమై పరగు. |