ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
వైశాలికుల వృత్తాంతము
దేవేంద్రుఁడతి భక్తి దితికి శుశ్రూష
గావించె నీ పుణ్యగణ్యదేశమున.
నీ పుణ్యభూమి మున్నిక్ష్వాకుఁడనెడు
భూపవర్యుం డలంబుసయందుఁగన్న
కొడుకు విశాలుఁడన్‌ కువలయాధిపుఁడు
పుడమినేలి విశాలపురి యిందొనర్చె.
453నా విశాలునిపుత్త్రుఁడై హేమచంద్రుఁ
డావిర్భవించెను; నతఁడు సుచంద్రు,
నతఁడు ధూమ్రాశ్వుని,నతఁడు సృంజయుని,
నతఁడంత సహదేవు, నతఁడుకుశాశ్వు,
నాతండు సోమదత్తాఖ్యుఁ, గకుత్స్థు
నాతఁడు, సుమతిని నతఁడును గనిరి;
తావుగాఁగాకుత్స్థతనయుఁ డాసుమతి
యీ విశాలాపురం బేలెడి నిపుడు;
అనఘ! వైశాలికులన వీరు జగతి
వినుతికెక్కిరి ధర్మవిభవసంపదల;
454నిచ్చమై రఘు455రామ! యిచట నీ రాత్రిఁ
బుచ్చి వేగినఁజూడఁబోదము జనకు.”
456ననునంత గాధేయుఁడటవచ్చు టెఱిఁగి
మనమున సంతోషమగ్నుఁడై సుమతి
తన పురోహితులును దన457బంధుజనులుఁ
దనతోడఁ 458జనుదేరఁ దన పట్టణంబు
వెలువడి చనుదెంచి విహితమార్గమున
నెలమితో నా సంయమీంద్రుఁబూజించి
కరములు 459ముకుళించి460కడుభక్తిఁబలికె:
“ధరణిలో నేఁడు నే ధన్యుఁడ నైతిఁ;
జరితార్థమయ్యె నా జన్మం.” బటంచుఁ
బరమ461ప్రియంబులు పలికి యొండొరులు
నమరంగఁగుశలంబు లడిగినమీఁద
సుమతి విశ్వామిత్రుఁజూచి తా ననియె:[వా.రా. సర్గ 48]
“మునినాథ! యసమానమూర్తు లీ ఘనులు
ఘనభుజు, లనిమిషక్రమపరాక్రములు,
కరిరాజ462గమనముల్‌,కంఠీరవములఁ
బురుడింపఁజాలెడు463భూరి 464సత్త్వములు,
465లలితయౌవనము,లుల్లసితారవింద
దళములఁదెగడు నేత్రములఁజెన్నొందఁ
గరవాలములుఁగార్ముకంబు దొనలు
ధరియించి తమదుపదన్యాసములను
జగతి నా రవిచంద్రసంచార కలిత
మగు 466నాకసంబు నా నలరించువారు;
నిరువురుఁదమలోన నెల్లచందముల
సరియగుచున్నారు జనులచూడ్కులకు;
నీ కుమారకు లెవ్వ?రెవ్వరి సుతులు?
నాకు నేర్పడ గాధినందన! చెపుమ.”
యనిన విశ్వామిత్రుఁడంతయుఁదెలుప
విని విస్మయంబంది వేడ్క నా సుమతి
యా రాఘవుల నప్పుడర్థిఁ బూజింప
వారు నా పూజలు వరుసఁగైకొనుచు
నా రాత్రియందుండి యా ప్రభాతమున
నా రాజు దముఁబంప నర్థితోఁజనిరి.

  1. అనుపమసిత (స్థిర) కీర్తి యా విశాలునకు -జనియించెఁదగ హేమచంద్రుఁడన్‌ రాజు, ఇంపారఁ బుట్టె నా హేమచంద్రునకు - సంపూర్ణ(బలు) యశుఁడైనసౌభద్రుఁ డెలమి, నా సుభద్రునకు ధూమ్రాక్షుఁడన్‌ రాజు (వాఁడు) - భాసురస్థితిఁబుట్టెఁబటుబాహుబలుఁడు, అతనికి సృంజయుండను వాఁడు వుట్టె- నతులవిక్రముఁడైన యా సృంజయునకు, సహదేవుఁడనువాఁడు జనియించె నీతి - సహితుఁడై పరగు నా సహదేవునకును, సుతుఁడు కుశాశ్వుఁడన్‌ శూరుఁడు వుట్టె - నతి బలుండగుచున్న యా కుశాశ్వునకు, సోమదత్తుండను సుతుఁడుద్భవించె - సోమప్రకాశుఁడు సోమదత్తునకు, జనమేజయుండన జనియించె గొడుకు - జనలోకవినుతుఁ డా జనమేజయునకు, సుమతినా నుదయించె సూనుఁడింపారఁ - నమర నీ పురమిప్పుడతఁ డేలుచుండు, నెలమి నీ పురవరం బేలెడిరాజు - లలఘు విక్రములును నధికధార్మికులు, ఘనమైన యాయువుల్‌ గలవారు నగుచు- వినుతికెక్కినవారి విభవంబుఁజెప్పి (వారు వెలయ నందఱును)
  2. నిచ్చట రఘురామ, యీ రాత్రి మనము
  3. రఘువీర యెలమి నీ రాత్రిఁ
  4. ననఁగ విశ్వామిత్రుఁడట
  5. మంత్రివరులు
  6. నేతేర
  7. మొగుడించి
  8. కరమర్థిఁ
  9. ప్రియంబునఁబ
  10. గమనులు
  11. భుజసత్త్వములును
  12. విక్రములు
  13. లలితంబులైన ఫుల్లసితారవింద
  14. నాకసమునట్టులలరించు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )