ఇతిహాసములు రంగనాథరామాయణము బాలకాండము
అయోధ్యాప్రవేశము
పరమసమ్మదమున బలములుఁదాను
నరిగె నయోధ్యకు నవనివల్లభుఁడు.
పుణ్యచిహ్నములతోఁబుణ్యులతోడఁ
బుణ్యమంగళ వాద్యములతోడ వచ్చి
తానును గొడుకులు దశరథాధీశుఁ
డానందమున నయోధ్యాపురిఁజొచ్చి
రాజితాలంకారరచనఁ జూపట్టు
రాజమార్గంబున రా రాజముఖులు
సఖులు దారును 713వేడ్క సౌధంబు లెక్కి
సుఖతరాకృతుల రాసుతులఁగన్గొనుచు
సేసలు సల్ల నాశీర్వాదమెల్ల
భూసురు లొసగ విస్ఫురణ వెంపెసగ
నగణితశృంగారమై యొప్పు తనదు
నగరుఁబ్రవేశించె నరనాథుఁడంత,
గౌసల్య కేకయ క్ష్మా714నాథపుత్త్రి
యా సుమిత్రాదేవి యాదిగాఁగలుగు
నంతఃపురాంగన లందఱు 715నప్పు
డెంతయుఁబ్రియమున నెదురుగా వచ్చి
చేరి వారలమీఁద సేసలు సల్లి
నీరాజనంబులు నెఱి నిచ్చి. రంతఁ,
గొడుకులందఱు మ్రొక్కఁగోడండ్రు మ్రొక్కఁ
గడుఁబ్రీతి దీవించి కౌఁగిళ్లఁజేర్చి
సీతాదికాంతలచెలువంబు బుద్ధి
చాతురిఁగన్నులు సల్లఁగాఁజూచి
తనరారుచుండిరి. దశరథుఁ716డంతఁ
దనయులు 717నలువురుఁదను భజియింప
నాల్గుచేతుల నొప్పు నలినాక్షుఁడనఁగ
నాల్గుకొమ్ముల నొప్పు నాకేభమనఁగ
సకలజనానంద చరితుఁడై రాజ్య
మకలంక రక్షకుఁడై యేలుచుండె.
నొకనాఁడు దశరథుండుచిత 718మెఱింగి
719ప్రకటితశుభరతు భరతునీక్షించి:
“ఘనుఁడు మీ మామ కేకయ720రాజసుతుఁడు
గొనిపోదు నిన్నని కోరియున్నాఁడు
గాన శత్రుఘ్నుతోఁగదలి మీ మామ
తో నేఁగి యతనిసంతోషంబు నెఱపు”
మనవుడుఁదల్లుల కవనినాథునకు
వినతుఁడై రఘురామవిభునకు మ్రొక్కి
తాను శత్రుఘ్నుండుఁదన మేనమామ
తో నేఁగె నా భరతుఁడు పుణ్యరతుఁడు.
అంత శ్రీరాముండు యౌవరాజ్యమున
నెంతయుఁజతురుఁడై యేకాగ్రబుద్ధిఁ
దమతండ్రిఁగొలుచుచు ధారుణిప్రజకు
సమచిత్తుఁడై ధర్మచరితంబుఁబూని
సీతయుఁదానును జెలువొప్పఁగూడి
నూతనరతి సుఖార్ణోరాశిఁ దేలి
చంద్రశాలలఁగేళిసౌధ వీథికలఁ
జంద్రకాంతమణి విశాలవేదికల
గాజుటోవరుల బంగరుపడుకిండ్ల
జాజిపూఁబాన్పులఁజంపక క్రముక
నారికేళ రసాల నారంగ రంగ
దారామములఁగృతకాద్రిసానువులఁ
గొలఁకులకెలఁకులఁగుంజపుంజములఁ
జలువచప్పరముల సైకతస్థలులఁ
జాతురి మెలఁగుచు సకలభోగములు
నాతతసుఖములు నందుచునుండె.
నని యంధ్రభాష భాషాధీశనిభుఁడు
వినుత 721కావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁడపార ధీశరథి
భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమ తండ్రి విట్ఠలధరణీశుపేరఁ
గమనీయ722తరధైర్యకనకాద్రిపేరఁ
723బనుగొన నరిగండభైరవుపేర
ఘనుపేర మీసరగండనిపేర
నలఘునిశ్చలదయాయతబుద్ధిపేర
లలిత724సద్గుణగణాలంకారుపేర
నా చంద్రతారార్కమై యొప్పుమిగిలి
భూచక్రమున నతిపూజ్యమై వెలయ
నసమానలలితశబ్దార్థసంగతుల
రసికమై చెలువొంద రామాయణమునఁ
బరగ నలంకారభావనల్‌ నిండఁ
గరమొప్పు నీ బాలకాండంబుఁజెప్పె.725
నారూఢి నార్షేయమై యాదికావ్య
మై రసికానందమై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీ పుణ్యచరిత.
మెవ్వరు సదివిన నెవ్వరు వినిన
సామాదిబహువేదచయధామరామ
నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్‌ ప్రభువిచారములు
పరిపూర్ణశక్తులు ప్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు
ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లధికసంపదలుఁ
బాయక పాటిల్లుఁ; బాపక్షయంబు
వరపుత్త్రలాభంబు వైరినాశనము
సరినొప్పు; ధనధాన్యచయసమృద్ధియును
నే విఘ్నములు లేక యిండ్లలో నధిక
లావణ్యవతులైన లలనలపొందు,
నన్నలుఁదమ్ములు నభివృద్ధిఁబొంది
మన్ననతోఁగూడి మలసియుండుటయు,
సతతంబు దేవతాసంతర్పణంబుఁ
బితృగణతృప్తియుఁబెంపొందుచుండు;
నిది మోక్షసాధనం,బిది పాపహరము
నిది దివ్య, మిది భవ్య, మిదియు శ్రీకరము;
రమణీయలీల నీ రామాయణంబుఁ
గ్రమమొప్పఁబూజింపఁగల్గుఁబుణ్యములు;
వ్రాసినవారికి వరశుభోన్నతులు
వాసవలోకనివాసంబుఁగలుగు.
నెందాఁకఁగులగిరు లెందాఁక జలధు
లెందాఁక రవిచంద్రు లెందాఁకఁ దార
లెందాఁక వేదంబు లెందాఁక దిశలు
నెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీకథ యక్షరానంద
సందోహదోహళాచారమై పరగు.
  1. గేళి
  2. రాజ
  3. గూడియె
  4. డట్లు
  5. దాను నుత్సవమునఁబొంది
  6. తంబుమెఱసి
  7. ప్రకటపుణ్యోదయు
  8. రాజునిన్ను- గొనిపోదునని వచ్చికోరి
  9. వాక్యా
  10. గుణ
  11. వనజోదరుని పేర వనమాలిపేర
  12. నిర్మల
  13. ఇటమీఁది ద్విపదలు గ్రంథాంతమందుండఁదగినవి. కాని వ్రాఁతప్రతులలోఁబ్రతికాండాంతము నను గూడఁ గానవచ్చుచున్నవి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )