| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
నహిమాంశునందనుం డంత రాఘవుల గుహలోపలికిఁదోడుకొని పోయి ప్రీతి భూమిజ మును వైచిపోయిన తొడవు లా మెయిఁగొనివచ్చి యపుడిట్టులనియె: “దనుజుండు నీదేవి ధరణీతనూజ వనసీమలోపల వంచన మిమ్ముఁ గనుఁబ్రామి గగనమార్గంబున నెత్తి కొనిపోవఁబోవ నీ కొండపై మమ్ముఁ గనుఁగొని మిముఁబెక్కుగతులఁజీఱుచును జినుఁగుఁబయ్యెదకొంగు సించి బంధించి తన తొడవులువైచి తరళాక్షి వోయె.” ననిచెప్పి యిచ్చిన నధిపతి సూచి మున్నుగా వగలను మున్నీట మునిఁగి కన్నీట నా సొమ్ము కసటెల్లఁగడిగి యందంద యురమున నా భూషణములు పొందించి పొందించి భూమిజఁదలఁచి పెలుకుఱి లక్ష్మణుఁబేర్కొని పిలిచి పలికెఁబల్కులఁ దొట్రుపాటు రెట్టింపఁ: “గంటె లక్ష్మణ! సీత కైసేఁతలెల్ల మంటిపాలయ్యె నీ మాడ్కి నేమందు? నీ తొడవులు వైవ నేమి కారణమొ? యీ తొడవు35లతోడ నేమైనయదియొ? అదిగాక, ప్రాణనాయకియైన సీత కుదురునిండిన గబ్బిగుబ్బలమీదఁ బాయని యీ జిల్గుపయ్యెద 36చీర కీ యవస్థలు వచ్చె నేమనవచ్చుఁ? బన్నీట నా పాదపద్మముల్ గడిగి యున్నతిఁదడియొత్తు లొత్తును దీన; సురటి గావించి భాసురలీల దీన భరితశ్రమాంబువుల్ పలుచగాఁజేయు; 37వెఱవును నొఱవును వీడ్వడ దీన మఱి యడుగుల38కును మడుఁగులు39పఱచు.” ననియని శోకించి యశ్రువుల్ నించి యనయంబు మూర్ఛిల్లి యంతలోఁదెలిసి ప్రియభక్తి వినమితగ్రీవు సుగ్రీవు నయసనాథుఁడు రఘునాథుఁడీక్షించి: “నా దేవిఁగొనిచన్న నాకేశవైరి యే దేశముననుండు? నెద్ది పురంబు? చెప్పుమా సుగ్రీవ! సీత సాధింతు. నిప్పుడే నా దైత్యు నేపడఁగింతు.” నా విని యా రవినందనుండనియె: “దేవ! యా ద్రోహిమందిర మేనెఱుంగ.[వా.రా. సర్గ 7, 8] నెఱుఁగకుండిన నేమి? యిటమీఁదవాని నెఱుఁగు తెఱంగెల్ల నేను గావింతు. నీవు శోకము మాని నిశ్చలధైర్య భావపౌరుషగుణాస్పదుఁడవు గమ్ము. అతిపరాక్రమశాలియగు వాలిచేత హృతకళత్రుఁడనయ్యు నే నింత వగవ. నాపద యనువార్ధి కాత్మధైర్యంబుఁ దేప సేయునతండు తెలివిమై నుండు. మావంటి ప్రాకృతమతులచందమున నీవును శోకింప నీతియే? దేవ!” యనఁగ నా సుగ్రీవునాప్తవాక్యములు విని ధీరుఁడై రఘువీరుఁడెంతయును ఇంతివోయినజాడ యెఱిఁగినపిదప నంతరంగంబున నడలుచు నునికి మగపాఁ40డి కాదని మది నిశ్చయించి జగదీశుఁడంతట సంతాప ముడిగి: “సరసిజాననఁబూని సాధించుపనికిఁ బరికించి మును వీని పగఁదీర్తు.”ననుచు మీనాక్షితొడవు సౌమిత్రి 41కందిచ్చి భూనాథుఁడపుడర్కపుత్త్రునిఁజూచి: “యాపదకును సఖుఁడైనట్లు చుట్ట మాపాటి గానేరఁడారసి చూడ. గుణవంతుఁడైనను గుణహీనుఁడైన గణియింప సఖుఁడు సద్గతియండ్రు బుధులు కావున నీ చెల్మిగల నాకు సౌఖ్య మేవెంటఁగొదవలే; దిది నిశ్చయంబు. నీ పత్నిఁగైకొని నినుఁజంపఁగోరు పాపాత్ముఁడగువాలిఁబరిమార్తునిపుడె. యన్నదమ్ములమైత్రి నలరుటకన్న నున్న దా సౌఖ్య; మా యొరిమిక మాని యగచరాధిపుఁడ! మీ యన్నకు నీకుఁ బగయైనవిధము దప్పక చెప్పు.”మనిన: |