ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
వాలిసుగ్రీవుల కలహ కథ
“నోరామ! వాలికి నొగి నాకు నైన
వైరానుకథనంబు వర్ణింతు వినుము:
మా తండ్రితరువాత మంత్రులు వెద్ద
యీతఁడంచును వానరేంద్రపట్టంబు[వా.రా. సర్గ 9, 10]
వాలికిఁగట్టి; రా వాలియు నన్నుఁ
జాల మన్నన సేసి సంప్రీతి నడపు.
నతనికి బంటనై యహరహంబేనుఁ
బితృసమానుఁడుగాఁగఁబేర్మి సేవింతు.
నీ రీతి నన్యోన్యహితులమై మెలఁగ
శ్రీరామ! యొకనాఁడు చిరవైర మూని
తొడరినకడఁకతో దుందుభి కన్న
కొడుకు మాయావి యన్ఘోరరాక్షసుఁడు
నడురేయి కిష్కింధనగరంబు బెదర
వడి నార్చి గర్వదుర్వారుఁడై పేర్చి
యని సేయఁబిలిచిన నలుక దీపింప
ననుపమబలశాలియగు వాలి వెడలి
ననుఁగూడి యుద్ధసన్నద్ధుఁడై వేగ
తన మీఁద నడవ నిద్దఱఁజూచి వాఁడు
ననిసేయ కతిభీతుఁడై పాఱిపోయి
తన గుహఁజొచ్చిన దర్పించి వాలి
గుహవాత నన్నుంచి గుహతానుఁజొచ్చి
గుహలోన నొకయేఁడు ఘోరయుద్ధంబు
42కడుకొని సేయ రక్తము వెల్లి విరిసి
యుడుగక గుహవాత నుబ్బినఁజూచి
కనుకని నార్చురాక్షసుని43 యార్పులును
విని”వాలి రాక్షసవిభునిచేఁజచ్చె.
నిచ్చోట నేనుండు టెఱిఁగిన వెడలి
వచ్చి దైత్యుఁడు పట్టి వధియించు నన్ను.”
నని నిశ్చయము సేసి యప్పుడే పోయి
కొనివచ్చి యొకకొండ గుహవాత44నునిచి
యచ్చట వాలికి నట తిలోదకము
లిచ్చి కిష్కింధకు నేను వచ్చుటయు
“వాలి వోయినతరువాత నీ రాజ్య
పాలనంబున కీవె ప్రాప్తుండ.”వనుచు
వదలక మంత్రులు వానరరాజ్య
పదమున ననుఁదెచ్చి పట్టంబు గట్ట
వానరకులచక్రవర్తినై యేను
నూని రాజ్యము సేయుచుండితి. నంత-
మనుజేశ! మఱి వాలి మాయావిఁజంపి
ననుఁజీఱిచీఱి యంతట గుహవాత
పెనచివైచినకొండఁబిండిగాఁదన్ని
చనుదెంచి ననుఁజూచి చాలఁగోపించి
తన కేనుజేయువందనముఁగైకొనక
యెనసినకినుకతో నిట్లనిపలికె:
“నోరి! తమ్ముఁడవని యూరడి నమ్మి
పోరాడఁబగతుపైఁబోయిన చోట
ననుడించి చనుదెంచి నా రాజ్యపదముఁ
గొని ప్రీతినిట్లుండఁగూడునే నీకుఁ?
గడుఁబాపబుద్ధివి గావున నిన్నుఁ
దొడరి చంపిన నాకు దోషంబు లేదు.”
అనవుడు నే వాలియడుగుల కెఱఁగి
వినయంబు భయమును వెలయ నిట్లంటి:
“నొకయేఁడు మాయావియును మీరుఁబోరఁ
బ్రకటింప రక్తపూరము గుహవాత
వెడలిన భయమంది విపరీతబుద్ధి
వడిఁబారి యిచటి కే వచ్చినఁజూచి
రట్టడిమంత్రు లీ రాజ్యంబు నాకుఁ
గట్టి; రింతియకాని కపట మే నెఱుఁగ.
నాకు నీ యాగమనంబె శోభనము.
నీ కపిరాజ్యంబు నీవె కైకొనుము.
వావిఁదమ్ముఁడఁగాని వాలి, నీ కేను
సేవకుండ, సుతుండఁ,జెప్ప నేమిటికి?
గరుణాఢ్య! నాయెడఁగల్ల గల్గినను
గరుణింపు;”మని పెక్కుగతులఁబ్రార్థింప
నంతకంతకు మండి“యనుజునిపట్ల
నింతేల?”యని మంత్రులెంత సెప్పినను
అనయుఁడై నా పత్నియగు రుమఁబుచ్చి
కొని రాజ్యమును బుచ్చికొని చంపఁగడఁగ
వెఱచి యేకాకినై వెనుకొని వాలి
తఱుమ భూలోకమంతయు నేను దిరిగి
యేపఱ పఱతెంచి యిందున్నవాఁడ
నీ పర్వతము వాలికెక్కరాకునికి.”
ననిన రాముఁడు వెఱఁగంది:“యీ కొండ
యినతనూభవ! వాలికెట్లెక్కరాదు?[వా.రా. సర్గ 11]
వినుపింపు.” మనవుడు వినతుఁడై నిలిచి
యినతనూజుఁడు ప్రీతి నిట్లని పలికెఁ:
“దొల్లి దుందుభియను దుష్టరాక్షసుఁడు
బల్లిదుఁడై వరబలము రంజిల్ల
ముల్లోకములు దనమొనకు భీతిల్ల
మల్లడిగొని పెనుమహిషమై పోయి
తఱిమి సముద్రునిఁ దనతోడ ననికి
నఱిమి పిల్చుటయు నయ్యంభోధి గలఁగి
ఘనరత్నకోటులు కానుకలిచ్చి
“తునియనిబలిమి నీతోడఁబోరాడ
ఘనమైనతుహినాద్రిగాని యేఁబూని
యని సేయఁజాలఁబొ.”మ్మనిన నేతెంచి
జంభారి దోస్త్సంభసంభావితోగ్ర
దంభోళినైశిత్యదర్పభంగముల
నతులశృంగముల హిమాద్రిఁగోరాడ
నతిభీతుఁడై పర్వతాధీశుఁ డనియె:
“నీ సరివాడఁనా నిలిచి పోరాడ?
నో సరింపక 45నిల్వనోర్తునే యేను?
ఈ లోకమున నిన్ను నెదిరి పోరాడ
వాలినభుజశక్తి వాలికిఁ గలదు.
బలియుఁడై కిష్కింధఁబాలించునతఁడు
కలహంబుపై వాంఛ గలదేని నీకు
నలఘువిక్రమ! యింక నట కేఁగు”మనిన
జెలఁగి రాక్షసుఁడు కిష్కింధకేతెంచి
విలయకాలాభీలవేళ గర్జిల్లు
జలదంబుగతి నార్చి:“సరిఁదనతోడ
నాలంబు సేయ ర.”మ్మని వాలిఁబిల్వ
వాలి కోపించి వెల్వడివచ్చి యార్చి
దుందుభిగతి మ్రోయుదుందుభిఁదాఁకి
“యెందుఁబోవఁగవచ్చు నింక నీ.”కనుచు
శిలలు పాదపములు చెచ్చెఱ రువ్వి
తల ముష్టిహతులఁగొందలమందఁజేయ
వాఁడును వానరేశ్వరుని వక్షంబు
వాఁడికొమ్ములఁగ్రుమ్మ వానిఁ గోపించి
46తి ఘోరుఁడై పేర్చి యచలంబు వైవ
గతితప్ప నుఱికి రక్కసుఁడెదిరింప
గండశైలము వుచ్చి కపిరాజువైవ
నొండొండ కొమ్ముల నోసరిల్లుచును
అఱుగ్రమ్మికొని వాలి నదరంట వ్రేయఁ
దఱిమి వృక్షంబునఁదరుచరుండడువ
మాటున నసురఁగ్రమ్మఱ వచ్చి తాఁకి
మోటతా డెత్తుక మోఁద నా వాలి
గదిసి కొమ్ములఁజిమ్మఁగపిరాజు నిలిచి
కదలనిముష్టి వక్త్రంబునఁబొడువ
రక్కసుఁడొడువ మర్కటరాజు పొడువ
దక్కక యిరువురు దర్పించి పేర్చి
గొనకొని నూఱేండ్లు ఘోరయుద్ధంబు
మనువంశవల్లభ! మఱిచేసి వాలి)
బలిమిఁగొమ్ములు వట్టి పడవైచి చంపి
తలకొన్న లావుమైఁదన్నెఁ;దన్నుటయు
ముక్కునఁజెవుల మోమున నెత్తురొలుక
నక్కులిశాహతి నద్రియుఁబోలె
నా యుగ్రదైత్యుమహాకళేబరము
పోయి యోజనమాత్రమునఁదూలి పడియె.
గైరికనిర్ఘరాకారంబు లగుచు
నా రక్తకణము లీ యద్రిపైఁబడిన
నారసి యిచట నిత్యము తపంబున్న
దారుణశక్తి మతంగుండు గినిసి
యీ పర్వతము వాలికెక్క రాకుండ
శాపంబు గావించె జగదేకనాథ!
కాన, యీ ఋశ్యమూకమునందు వెఱవ
కేను గాఁపురముందు నెల్లకాలంబు.
కడఁగి యా దుందుభికాయంబు వుచ్చి,
పుడమి యోజనదూరమునఁబాఱవైవ
వలనైనభుజశక్తి వాలికిఁగాక
తలపోయ నొరులకుఁదరముగాదధిప!
కైకొని నీ వంతకంటెను దూర
మీ కళేబర మిపుడిట మీటకున్న
నినవంశ! మీ సత్త్వమే నాత్మ నమ్మ.”
ననవుడు విని రాముఁడల్లన నవ్వి:
“యా దుందుభిశరీర మల్లన మీటి
నీదు సందేహంబు నేఁడు వాపెదను;
ఇనతనూభవ! దాని నేర్పడఁజూపు.”
మనవుడు సుగ్రీవుఁడర్థితోఁజూప
ఘనమేరుమందరాకారమైయున్నఁ
గని కళేబరముడగ్గఱకు నేతెంచి
గొనకొని దానిఁగైకొనక యంగుష్ఠ
మునఁబదియోజనంబులు పాఱమీటి
వైచిన రఘురామువరశక్తి పేర్మిఁ
జూచియు నమ్మక సుగ్రీవుఁడనియె:
“మెలపుమై నిది వాలి మీటెడునాఁడు
దలమైన రక్తమాంసములతో నుండు;
మనుజేశ! నేఁడస్థిమాత్రమై యుండఁ
గని నీవు మీటితిగాక యొక్కింత
వడిఁబేర్చి, నీ లావు వాలిలావునకుఁ
గడు నెక్కుడని నమ్మఁగారాదు దేవ!
(అతఁడదియునుఁగాక యలవోక మీటు
క్షితిధరంబులఁబుట్టచెండ్లకైవడిని;
జతురంబుధులయందు సంధ్యలు వార్చు;
సితికంఠుపదములు శిరమర్థిఁజేర్చు;
వాయువుకన్న జవంబు47 హెచ్చుగను
దోయధులన్ని దోడ్తో దాటివచ్చు.
వాలికి నిర్జరేశ్వరదత్తహేమ
మాలి కెవ్వరుసాటి? మఱియొండు వినుము:)
ధరణీశ! యీ యేడుతాళ్లును దొల్లి
వరశక్తియుక్తిమై వాలి బిట్టేచి
కరముల నొక్కటిగాఁగూడఁబట్టి
తరమిడి వానిపత్రములెల్లఁద్రుంచు;
నడరి యీ తాళంబులందొక్కటైన
వడిఁగదల్పగ లేరు వాసవాదులును;
దలకొని యొకకోలఁదాళంబు లేడు
నిలువక కాఁడిపో నెఱిఁదెగనేయ
వసుధేశ! నీ లావు వాలిలావునకు
నసమానగతి నెక్కుడని నమ్మవచ్చు.
ధరణీశ! యీ సప్తతాళంబులొక్క
శరమునఁదెగవ్రేయుశౌర్యంబు గలుగు
పురుషునిచే వాలి వొలియు నటంచు
నరసి నాకు మతంగుఁడనుముని సెప్పె.”
ననవుడు విని రాముఁడల్లన నవ్వి:
“వనచరాధిప! తాళ్లు వదలక చూపు.”
మనవుడు సుగ్రీవుఁ డా రాము వేగ
గొనిపోయి యా తాళ్లు గుఱు తెఱిఁగింప
నశనిసంకాశంబు నసదృశంబైన
నిశితాస్త్ర మరిఁబోసి నిపుణుఁడై నృపుఁడు[వా.రా. సర్గ 12]
ముంచి యొక్కటఁబంక్తిముఖు నాండ్రతాళ్లు
ద్రెంచినగతిఁ ద్రాళ్లు దెగనేయుటయును
అవనిపై వక్రంబులైయున్న తాళ్ల
నవిరళంబుగ వడి నటు గాఁడిపాఱి
చేరువగిరి దాటి చెచ్చెఱఁబోయి
ధారుణి దూరి పాతాళంబుఁజేరి
యలయక తీవ్రత నమ్మహాశరము
తొలఁగక రఘురాముదొన వచ్చి చొచ్చెఁ
జొచ్చినఁగనుఁగొని సుగ్రీవుఁడప్పు
డచ్చెరువునఁబొంది యానందమంది
“సప్తపాతాళసంసక్తమూలములు
సప్తాశ్వమండలాచ్ఛాదిపత్రములు
నగుసప్తతాళంబు లస్త్రమొక్కటనె
తెగనేసె; నాదు సందేహంబు వాసె;
వాలి రాఘవునిచే వడిఁజచ్చు నింక;
నేలితిఁగపిరాజ్యమే.”నంచుఁబొంగి
కమలాప్తకులనాథుఁగాకుత్స్థుఁజూచి
కమలాప్తసుతుఁడంతఁగరములు మొగిచి:
“దేవ! దేవరమూర్తి దృష్టించి లావు
భావింపనేరక పశుబుద్ధి నైతి.
నినజుండ నేను; నీ వినవంశభవుఁడ;
వని సమబుద్ధిమై నపరాధినైతి.
నీ లోకములకెల్ల నేలిక వీవు.
బాలిశు నన్ను నీ బంటుగా నేలి
నా శత్రుఁదెగటార్చి నా రాజ్యమిచ్చి
నా శోక ముడుపవే నరనాథచంద్ర!”
యనవుడు సుగ్రీవు నతికృపాదృష్టిఁ
గనుఁగొని మన్నించి కాకుత్స్థుఁడనియెఁ

  1. కడఁకతోఁజే
  2. బొబ్బలును
  3. నడఁచి
  4. పోర
  5. యుగ్రుఁడై
  6. నమించు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )