ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
రాముఁడు సుగ్రీవునిఁ గిష్కింధకుఁ బట్టముగట్టుట
“మీరింక నా పంపు మేకొని పోయి
శ్రీరమ్యముగను గిష్కింధఁగైసేసి
106చిరమైన కపిరాజ్యసింహాసనమునఁ
బరగ సుగ్రీవునిఁబట్టంబు గట్టి
యొంద నీ యంగదు యువరాజ్యపదము
నందుఁబట్టముగట్టుఁ.”డని యొప్పఁబలుకఁ
దడయక వానరదండనాయకులు
గెడగూడి యంతఁగిష్కింధ కేతెంచి
నూత్నశృంగారమనోహరాగార
రత్న వితర్దికారమణీయహీర
రంగ 107వల్లీ 108వారరంజితద్వార
రంగద్ధ్వజోదార రమ్యపటీర
నీరపూరితమార్గనిరుపమాకార
పౌరసంచారసంభరితంబు గాఁగఁ
జెలఁగి యా పురము గైసేయించి నగరు
కొలువుకూటంబు మిక్కుటమైన సిరికిఁ
గారణంబుగ నలంకారంబొనర్చి
వారిధి నదనదీ వారియు మఱియుఁ
దగుమంగళద్రవ్యతతులుఁదెప్పించి
మొగినొప్ప శుభతూర్యములు మ్రోయుచుండఁ
109బుణ్యాంగ110నలు రత్నముల సేసఁజల్ల
బుణ్యాహవాచనపూర్వకంబుగను
సింహచర్మంబునఁజిహ్నితమైన
సింహపీఠిని గపిసింహంబు నునిచి
సుర లింద్రుఁబోలె భాసురలీలఁబ్లవగ
వరు లభిషేకపూర్వకముగాఁగదిసి
లలితపుణ్యోదయలగ్నంబునందు నిలుపఁ
బలియు సుగ్రీవునిఁబట్టంబు గట్టి
యురుసత్త్వు నంగదు యువరాజ్యమునకుఁ
గరమొప్పఁబట్టంబు గట్టిరి ప్రీతి.
నంగదు యౌవరాజ్యమునందు నిలుపఁ
బొంగె వేడుక నంతిపురముఁబురంబు.
నల నీల తారాంజనాతనూభవులుఁ
గలబంధువులుఁబొడగనిరి సుగ్రీవు;
నితరవానరనాథులెల్లఁగేల్మొగిచి
యతిమోదమునఁగొనియాడిరి ప్రీతి.
నంత సుగ్రీవుఁడుదాత్త సంపదల
నెంతయుఁబెంపొంది యింపు సొంపొంది
వనచరబలముతో వడి నేఁగుదెంచి
ఘనరత్నకోటులు కానుక లిచ్చి
యాదటఁబెంపొంద నా రామచంద్రు
పాదపద్మములకు భక్తితో మ్రొక్కి
కరములు ముకుళించి కడుఁబ్రేమ నిలిచి
పరమసమ్మదమున భానునందనుఁడు:
“ఇచ్చోట నేటికి? నింక నా పురికి
విచ్చేయుదురుగాక విశ్వలోకేశ!”

  1. స్థిర
  2. వల్లికవాట
  3. హార
  4. పణ్యాంగనామణుల్‌ పాత్రంబులాడ
  5. నా మణుల్‌ పొలుపొందఁజాల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )