ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
లక్ష్మణుఁడు కిష్కింధకుఁ బోవుట
కనుఁగవఁబ్రళయాగ్నికణములు దొరుగ
ఘనశరచాపముల్‌ గైకొని వెడలి
నేల యల్లలనాడ నిడుజంగ లిడుచు
గాలివేగమున వృక్షములెల్లఁగూలఁ
గృతమతి నటవోయి కిష్కింధఁజేర
నతిభీతులై కపు లందంద పర్వ
నా పురద్వారస్థులగుకపు లప్పు
డే పఱతెంచి ‘వీఁడెవ్వఁడో?యనుచుఁ
గోటవాకిళ్లు గ్రక్కున వేసి ప్లవగ
కోటిఁగావలి వెట్టి కోరి యత్తెఱఁగు
వడి రాజు కెఱిఁగింపవలె నంచు వారు
గడుభీతులై పాఱి కరములు మొగిచి:
వడిఁదారపరిచారవనితలతోడఁ
దడయ కా చందమంతయుఁదెల్ప వారు
“నిది వేళగా.”దన్న నెలమి నంగదునిఁ
గదిసి చాగిలి మ్రొక్కి కరములు మొగిచి
“వినవయ్య యువరాజ! విఖ్యాతతేజ!
మనవీటివాకిట మౌనివేషంబు
గనుపడ జడలు వల్కలములుఁదాల్చి
తన కేల బాణకోదండముల్‌ పూని
యొకఁడంతకుఁడుఁబోలె నున్నాఁడువచ్చి
యకలంకసత్త్వుఁడై.”యనిన,నంగదుఁడు
ఆ రాముననుజన్ముఁడని నిశ్చయించి
తారాతనూజుండు దడయక వచ్చి
సౌమిత్రిఁబొడగనఁజండకోపమునఁ,
“దామరసాప్తనందనున కంగదుఁడ!
నారాక చెపు.”మన్న నతఁడును బోయి
మార వికారాబ్ధిమగ్నుఁడై మిగుల
గారవంబునఁజేరి కరపల్లవముల
నా రుమాసతి యంఘ్రులల్లనఁబిసుకఁ
దారామృదూరులు తలగడ గాఁగ
నూరక సుఖియించుచున్న సుగ్రీవుఁ[వా.రా. సర్గ 32-37]
గనుఁగొని:“వాఁడె లక్ష్మణుఁడున్నవాఁడు
మనవీటివాకిట మండుచు.”ననిన
మది సంశయించుచు మంత్రులఁబిలిచి:
“యిదియేమి సౌమిత్రి! హితమైత్రిఁదప్పి
యీ రీతి వచ్చుట కేమికారణము?
నేరమి నావల్ల నెమకిన లేదు.”
అని వితర్కింపఁగా నాంజనేయుండు
దిననాథసుతునితోఁదెలియ నిట్లనియె:
“నా మహేంద్రకుమారు ననిఁగూల్చి నీకు
నీ మాడ్కిఁగపిరాజ్య మిచ్చినయట్టి
రామునికార్య మారడిపుచ్చి యిట్లు
కామోపభోగసౌఖ్యంబులఁబొదలి
యుందురే? యిందుకై యుగ్రభావమున,
సందేహమేటికి సౌమిత్రి యిటకు
వచ్చినాఁ; డమ్మేటి వాకిట నుండ
వచ్చునే? లోకైకవంద్యుఁడాఘనుని
రావింపు; సేవింపు; రాముకార్యంబు
భావింపు; గావింపు పరగ నీ ప్రతిన.”
నా విని యా రవినందనుండట్ల
రావింపఁబంచిన రామానుజుండు
భర్మగోపురహర్మ్యపటలంబు విశ్వ
కర్మనిర్మితచిత్రకరకౌశలంబు
కైలాసశైలసంకాశసౌధంబు
కేళీసరోవరాంకితవనాంతరము
దేవగంధర్వావతీర్ణ ప్లవంగ
133మావాసతత్పరంబగు తత్పురంబు
చొచ్చి యచ్చోటి నిస్తులవస్తుమహిమ
కచ్చెరువందుచు నట వచ్చివచ్చి
యింద్రుగేహముతోడ నీడైనవాన
రేంద్రుగేహము సొచ్చి హెచ్చినకినుక
నచ్చర లేమలయందచందములు
మెచ్చనిమెలఁతల మిసిమిపాటలును,
వారి వీణావేణువాద్యమృదంగ
భూరిభూషణరవస్ఫూర్తియు వినుచు
నంతకాకారుఁడై యతికోపుఁడగుచు
నంతఃపురద్వార మటు చేరి నిలువ
నా రాక విని యొంటి నపుడు దా రాక
తారాసమేతుఁడై తడయక వచ్చి
యతనికోపంబును నతని రూపంబు
నతిభీతిఁగనుఁగొంచు నర్కనందనుఁడు
134అలరెడు భక్తిమై నడుగుల కెఱఁగి
వలయు నర్చనము లీ వచ్చినఁజూచి:
“యోరి! రామద్రోహి! యోరి! కృతఘ్న
యోరి! నీ యర్చన లుచితమే నాకు?
జానకీపతితోడ సత్యాత్ముతోడ
“వానకాలము వుచ్చివచ్చెద.”నంటి.
రావైతి; తప్పితి; రఘురామునాజ్ఞ,
భావింపలేవైతి; పశుబుద్ధి వైతి.
వాలిఁజంపిన రామవసుధేశుశరము
కాలాగ్నికణములఁగ్రక్కుచున్నదియు;
నిను నీఱుసేయక నిలుచునే యింక?
వనచరాధమ! వెఱ్ఱివాఁడవై చెడితి.”
వనినఁదారాదేవి యతిభీతి నొంది:
“యనఘ! మీ దాసుఁడీ యర్కనందనుఁడు;
ఈ రాజ్యసంపద లీ భోగకోటు
లారయ మీ రిచ్చినవియ యీతనికి.
మీరు వెట్టినచెట్టు మిహిరనందనుఁడు;
వైరంబునకు నెంతవాఁడు మీ కితఁడు?
రణవిశారదుఁడైన రామునియాజ్ఞ
గణుతింపకున్నాఁడుగా 135ఁడర్కసుతుఁడు;
136పొలుచు నీ కార్తికపూర్ణిమనాఁటి
కిలమీఁదఁగపిసేనలెల్లను గూర్పఁ
బడవాలు నీలునిఁబంచి 137తాఁబోదు
నడరెడుకడఁకతో నని యున్నవాఁడు.
కాఁడు రామద్రోహి, కాఁడసత్యుండు,
కాఁడు కృతఘ్నుండు, గాన నీ వితనిఁ
గరుణింపు.”మనవుడుఁగలుషంబు దక్కి
నరనాథసుతుఁడర్చనములు గైకొనియెఁ.
గైకొన్నపిమ్మటఁగనకపీఠమున
రాకొమరుని నుంచి రవితనూభవుఁడు
తదనుజ్ఞగైకొని తానుఁగూర్చుండి
మృదుమధురోక్తులు మేకొనఁబలికె:
“సౌమిత్రి! రాఘవస్వామికార్యంబు
నేమఱతునె? యిప్పుడెల్లవానరులఁ
దెచ్చెద; వైదేహి దిక్కుల వెదకఁ
బుచ్చెద; వచ్చెదఁబొదఁడు మీ వెనుక;
నే శరమ్మున వాలి యిలమీఁద వ్రాలె;
నే శరమ్మునఁగూలె నేడు తాళములు;
నా శరమ్మే చాలు నఖిలదానవుల
నాశమ్ము నొందింప; నాతి సాధింప;
నైనను రఘురాము నతిభక్తిఁగొలిచి
యేను గీర్తులకెల్ల నెల్లయై పొలుతు.”

  1. సేవితాగ్రంబు కిష్కింధపురంబు
  2. అలమెడు
  3. పొలుపొంద
  4. మిమ్గొల్వ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )