ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
హనుమదాదులు స్వయంప్రభచే సత్కృతులగుట
లనిన నక్కోమలి హనుమంతుఁజూచి
తన పూర్వకథయెల్లఁ దాఁజెప్పఁదొడఁగె:
“దగఁదొల్లి మయుఁడను దానవేశ్వరుఁడు
తగిలి పద్మజునకుఁదపమాచరించి
167పసనొప్పునిర్మాణ168పటుశక్తి వడసి
169పసిఁడి నీ పురమిట్లు పరగ నిర్మించి
యవిరళ 170గతి హేమయనుదివ్యవనితఁ
గవిసి యాతఁడు పెద్దకాలమిందుండ
నాతని వజ్రధారాహతుఁ జేసి
యా తన్విఁగొనిపోయె నమరవల్లభుఁడు
ఆ తరళాక్షి నెయ్యపుఁ జెలి నేను.
మా తండ్రి సౌవర్ణి మహితమానసుఁడు.
ఆ యింతిపనుపున నతితపోనిష్ఠఁ
బాయకుండుదు స్వయంప్రభ యనుదాన.”
నని చెప్పి కందమూలాదు లందఱకుఁ
దనివిదీర నొసగి 171దాహంబు దీర్చి:
“యనఘ! మీ రెవ్వరిందరుగు దేనేల?
యనిమిషు172లకునైన నరుగుదే రాదు.
వినుఁడిందు మీరలెవ్విధిని వచ్చితిరి?”
యన విని హనుమంతుఁడతివకిట్లనియె.
“దన తండ్రిపనుపున దండకాటవికి
మునివృత్తి రాముఁడిమ్ముల వచ్చియుండ
వనజాక్షి నా రామువరపత్నిఁగొనుచుఁ
జనిన రామునివెంటఁజనిచని యేము
జనకజ వెదకుచు జలశూన్యమగుట
ఘనమైన డప్పిచేఁగడు డస్సి173యొక్క
బిలములోపలఁజొచ్చి పెద్దచీకటికిఁ
దలఁకక యొక్కట దైవయత్నమున
నీ యాశ్రమంబున కేతెంచి వెడలి
పోయెడిమార్గంబు పొడగానలేక
తిరుగుచున్నారము; ధృతిఁబెక్కుదినము
లురిఁబడియున్నార మొకదిక్కు లేక.”
యనిన:“రామునికార్యమై వచ్చినార
లనఘులు పుణ్యాత్ము.”లని భక్తిఁజూచి:
“మీ కెద్దియిష్టమిమ్మెయి వేఁడుఁ.”డనిన
“మా కీ బిలద్వారమార్గంబు వెడలఁ
జేయుము; వేవేగ సీతను వెదకఁ
బోయెద.”మనిన నుప్పొంగి యా మగువ:
“మొగి మీరు కన్నులు మూసికొం.”డనుచుఁ
దగఁబల్కి వారలఁదన తపశ్శక్తి
నెలఁతుక యవలీల నిమిషమాత్రమున
బిలము వెల్వడఁదెచ్చిపెట్టి తాఁబోయెఁ
బోయినఁగపివీరపుంగవులెల్ల
నాయింతిఁబొగడుచు నటపోయి పోయి
యాయతోన్నతబలులందొక్కనరసిఁ
బాయక జలములు 174పానంబు సేసి
యంత నందఱు మహేంద్రాద్రికిఁబోయి
రంత నంగదుఁడిట్టులనుచు శోకించె.

  1. కడు
  2. కౌశలంబడిగి
  3. పడసి యీ
  4. మతి
  5. తాపంబు
  6. లైననిందరుగు
  7. యిట్టి
  8. బలువిడిఁద్రావి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )