| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
నాయెడ సంపాతియను పక్షినాథుఁ డాయత దేహుఁ డత్యంతవృద్ధుండు[వా.రా. సర్గ 56-63] ప్రాయంబు ఱెక్కలు బలిమియు లేమి నా యద్రిగుహనుండి యల్లన వెడలి మెల్లనఁజనుదెంచి మృతి గోరి ధరణిఁ ద్రెళ్లినవనచరాధిపుల వీక్షించి: “దైవంబు కృపసేసెఁదనకు నాహార మీవేళ.”నని చేర నేతేరఁ గపులు చపలులై మరణనిశ్చయబుద్ధి వగవ నపుడాంజనేయుతో నంగదుఁడనియె: “నిది పక్షిగాదు; మమ్మిందఱఁజంప నదయుఁడై యముఁడిట్టులరుదెంచినాడు నాఁ డాజటాయువు నరనాథుదేవిఁ బోడిమిఁజెఱగొనిపోవు రావణునిఁ దాఁకి యాతనిఖడ్గధారచేఁజచ్చి తేఁకువఁబడయఁడే దివ్యపదంబు? రాముకార్యార్థమై ప్రాణముల్ మనము నీ మహాపక్షికి నిచ్చుట లెస్స.” యనుచోట నామాట లాలించి యరుణ తనయుండు శోకగద్గదకంఠుఁడగుచు నా కపివీరుల నట చేరఁబోయి: “యో కపులార! యెందుండి వచ్చితిరి? యా జటాయువు నాకు నర్మిలి తమ్ముఁ డా జటాయువు నేను నరుణపుత్త్రులము; నిశితోగ్రనఖుఁడు మానితగుహాముఖుఁడు దశరథసఖుఁడు సంతత 182సుఖుఁడాతఁ; డతఁడేమిటికిఁజచ్చె?”ననవుడు వాలి సుతుఁడంతయునుఁ జెప్పఁజొప్పడఁదెలిసి యెంతయు శోకించి యిచ్చలోఁజాల వంత నొందుచునున్న వనచరు లెత్తి చెంతనున్నపయోధిఁజేర్చిన నందు సంతాప183మునఁగృతస్నానుఁడై వచ్చి విపులశోకముతోడ విహగవల్లభుఁడు కపులతోఁదనపూర్వకథ చెప్పఁదొడఁగె: “నాలోలగతుల జటాయువు నేనుఁ గైలాసగిరిఁదొల్లి కవగూడి యుండ, ఘన జవసత్త్వముల్ కడిమిమై మెఱసి మొనసి మేమిద్దఱమును మచ్చరించి యుడువీథి కిద్దఱ ముదయకాలమునఁ గడఁకతో నెగసి సంగడిఁబోయి పోయి పరువడి నట పట్టపగలింటికొలఁది నిరువురు గదిసితి మినమండలంబు. నుగ్రాంశుకిరణంబు లొండొంటఁదాఁకి యుగ్రమై వడి జటాయువు 184మండుటయును బదిలమై వాని నా పక్షంబులందుఁ బొదివిన నా పక్షములు గాలిపోయె. నెఱకలు గాలిన నేపెల్లఁబొలిసి మఱి వచ్చి యీ యాశ్రమంబునఁబడితి. నా పక్షినాథుఁడెందరిగెనో యెఱుఁగ. నీ పల్కు మీచేత నిట వింటి నేఁడు. వీనుల నీ వార్త విని యున్నవాఁడ హీనబలుండవై యెఱకలు లేమిఁ. బక్షముల్ దొల్లిటపగిది నాకున్న దక్షత నింతకుఁదనసహోదరుని పగ దీర్చి శ్రీరామభద్రునిఁజేరి మగఁటిమిఁదేనేర్తు; 185మాటలకేమి? నా విని భల్లూకనాథుఁడిట్లనియె. నా వాయుజుఁడు నంగదాదు లుప్పొంగ “నా జటాయువు తమ్ముఁడగు నీకు186మిగుల నీ జగంబులలోన నెదురెందుఁగల187దు? నీవు చూడనియట్టి నెలవులు లేవు; రావణుఁడిప్పుడు రఘురాముదేవి నెందు దాఁచినవాఁడొ యెఱిఁగింపు.”మనుడు సందేహ మెడఁబాయ సంపాతివలికెఁ: |