| ఇతిహాసములు | రంగనాథరామాయణము | కిష్కింధాకాండము |
|
“తన తనూభవుఁడు దుర్దమపరాక్రముఁడు ఘనుఁడు సుపార్శ్వుండు కడుభక్తియుక్తి రెక్కలు గాలి యీ క్రియనున్ననాకు నక్కఱతోఁదెచ్చి యాహార మొసగు. నతఁడొక్కనాఁడు నాకశనంబు దేక తతివచ్చుటయు,“నేల తడసితి?”వనిన: “నో తండ్రి! నీకు నే నుపహారమరయ నాతతగతి మహేంద్రాద్రి సముద్ర తీరమార్గమున నెంతేఁ188బొంచియుండ నా రవిప్రభవంటియంగనఁగొనుచుఁ గాటుక నడగొండకైవడి నొకఁడు ధాటిమైఁజనుదెంచి తనకుఁబ్రియంబు చెప్పి యేఁ దెరువీయఁజెచ్చెరఁజనియె. నప్పుడచ్చటి మౌనులందఱు నన్ను సంతసించుచు:“నేఁడు సావుకుఁదప్పి; తంతకుండగు రావణాసురుఁడతఁడు; చెఱఁగొని లంకకు శ్రీరాముదేవి నుఱక కైకొనిపోవుచున్నవాఁ?”డనిరి. అందు189కై తడసితి.”నని వాఁడు వలికె. సందేహ మేటికి? జనకతనూజ బలసి రాక్షసవధూపరివృత యగుచు జలదమాలికలోనిచంద్రికవోలె నున్నది లంకలో. నొగి శతయోజ నోన్నతి నా దృష్టి యుర్విఁజరించుఁ; దెల్లంబు గమనంబు దృష్టియు నాకు నెల్ల పక్షులకంటె నెక్కుడై పరగు.” నని పల్కి మఱియు నిట్లనియె సంపాతి: “తన పక్షయుగళంబు దగ్ధమై నప్పు డే వచ్చి మూర్ఛిల్లి యిచ్చోటఁద్రెళ్లి చావుకుఁదప్పి యెంచఁగరానిడప్పిఁ గుట్టూర్పు లెసగంగఁగొన్నేండ్లు గడపి గట్టిగా నా భాగ్యగతి నొక్కనాఁడు ఘననిష్ఠఁదపమిందుఁ గావించు సకల జనతాపహరణ సాక్షాన్నిశాకరుని నా నిశాకరుని నొయ్యనఁగాంచి మ్రొక్కి భానుదీప్తులచేతఁబక్షముల్ గాలి తనయున్నచందమంతయు విన్నవింప మునిశిఖామణియును మున్ను నన్నెఱుఁగుఁ గావున నెంతయుఁగరుణించి మీఁదు భావించి “యా 190శ్రియఃపతి పరాత్పరుఁడు విష్ణుండు దశరథవిభునకుఁబుట్టి యుష్ణాంశుకులుఁడంత నుగ్రాటవులకుఁ జనుదేర నాతనిసతిని రావణుఁడు గొనిపోయి చెఱనుంచుకొని 191యున్నయప్పు డమృతాన్న మా యింతిక192మృతాంశుఁడిడిన దెమలక యాహారతృష్ణలు వాసి యుండు; నంతట రాముఁడొయ్యన వచ్చి చండాంశజునిఁగాచి శక్రజుఁద్రుంచి యాలోలగతి సీత నరయ వానరుల నాలుగుదెసల కున్నతిఁబంపఁగలఁడు. ఆ రాము నిజదూతలగు వారితోడఁ జేరి నీ వీ కథ సెప్పిననాఁడు ఘనపక్షయుగళంబు గలుగు నీ.”కనుచు మును నిశాకరుఁడనుముని సెప్పె నాకు నతఁడానతిచ్చినయట్ల మీ తోడ హితమతి నీ కథ యెఱిఁగింపఁగంటి. నివె పక్షములు వచ్చె నిదె చూడుఁ.”డనుచు దివిఱి కుప్పించి యద్దివికి లంఘించి: “వడి లంకచేరువ వనములో సీతఁ బొడఁగంటి నదె సీతఁబొడఁగంటి నేను. అదె శతయోజనంబైన దూరమున నదె లంకలోపల నదె పుణ్యసాధ్వి. చాలుఁబ్రాయోపవేశన; మింక లెండు; పౌలస్త్యపతిలంకఁబరికింపఁబొండు.” అని లంకకై పోవ నట త్రోవ సూపి చనియె హేమాద్రికి సంపాతి ప్రీతి. నంత వానరవీరులందఱుఁగూడి సంతోషచిత్తులై జవమొప్పఁబోయి[వా.రా. సర్గ 64] చండవాతాఘాతజాతడిండీర గండూషి తాశావకాశ 193వాచాల వీచీసమీచీనవిహరమాణాతి వైచిత్ర్యకరవాలవరవాలములను ఘోరనక్రగ్రాహకోటు లుప్పొంగి పోరాడుచున్న యంభోరాశి డాసి యందఱు నిశ్చేష్ఠులై కొంతదడవు గుందుడెందములతోఁగూర్చుండి యప్పు “డీ సముద్రము దాట నెవ్వఁడు చాలు? నీ సత్త్వమెవ్వరి కిందులోఁగలదు? |