ఇతిహాసములు రంగనాథరామాయణము కిష్కింధాకాండము
వానరులు తమతమ పరాక్రమముల నంగదున కెఱిఁగించుట
అని యిట్లు చింతింప నంత నంగదుఁడు
వనచరుల్‌ తాను నవ్వనధితీరమున
నా రాత్రి వేగించి యమ్మఱునాఁడు
వీరవానరుల వేర్వేఱ యీక్షించి:
“యీ రీతి మీయంతలేసి వానరులు
పౌరుషంబును నేలపాలుగాఁజేసి
జలరాశిలోపల శతయోజనముల
కొలఁది దాటుట కిట్లు గుందెదరేని
యపకీర్తియనుపేరియగణితాంభోధిఁ
గపివర్యులార! యే కరణి దాటెదరు?
మీ మీ జవంబులు మీ దాటుకొలఁదు
లీ మాత్ర మని నాకు నిందఱుఁగూడి:
ఘనులార! యొక్కఁడొక్కఁడు చెప్పు.”డనుచు
గినిసిన నందఱుఁగృతమతులగుచుఁ[వా.రా. సర్గ 65]
దమతమ సత్త్వముల్‌ దలపోసిచూచి
యమితసత్త్వోన్నతులందఱుఁగూడి:
“నలిమీఱఁబదియోజనంబులు దాటఁ
గలవాఁడ నే.”నని గజుఁడర్థిఁబలికె.
“నెలసినలావుమై నిరువది దాట
సొలయ నే.”నని గవాక్షుఁడు వేర్చిపలికె.
“మొనసినకడిమిమై ముప్పది దాట
ఘనశక్తి గల.” దని గవయుండు వలికె.
“నాలావు పెంపున నలువది దాటఁ
జాలుదు నే.”నని శరభుండు వలికెఁ..
“బనిగొని జలధి నేఁబది దాటువాఁడ”
నని గంధమాదనుఁడలవుమైఁ బలికె.
“నస మింత డింపక యఱువది దాట
మసల కోపుదు.” నని మైందుండు వలికె.
194డిగువనికడిమిమై డెబ్బది దాటఁ
దెగువ నోపుదు.” నని ద్వివిదుండు వలికె.
“నెనుబది దాటుదు నేపు 195దీపింపఁ
దనియక నే.” నని తారుండు వలికె.
నోపిన తమలావు నొకఁడును దాఁప
కేపుమై నందఱు నిటు వల్కుచుండ
భల్లూకనాథుండు బహుకాలవృద్ధుఁ
డుల్లోకవిక్రముఁడొకమాట వలికెఁ.
“జిన్ననాఁటిబలంబు సెప్పవచ్చినను
గ్రన్నన హాస్యకారణము196లై యుండు;
నైనను వినుఁడు: మున్నమృతంబుకొఱకు
దానవుల్‌ సురలు యుద్ధంబు గావింప
నమరులకై సహాయంబుగా వచ్చి
యమృతంబు ద్రావితి నర్థి వారొసగ.
నుదధు లేడును దాటనోపు; దస్తాద్రి
నుదయాద్రిపైనుండి యొకజంగ యిడుదు.
నెల్లలోకముల నా కెదు రెందులేదు.
బల్లిదుండగు బలి 197బంధించునాఁడు
198ఇరువదియొక్కమాఱిలఁ బ్రదక్షిణము
199దిరిగి త్రివిక్రమదేవునిఁగొల్చు
తఱిఁ200గాలువిఱిగె; నాదర్పంబు జవము
పఱిఁబోయె; మఱిజరాభారంబు 201వొదివె;
నరయంగఁగడువృద్ధ నైతి నిప్పటికిఁ;
బరికింప నేనుఁదొంబదిగాని చాలఁ;
బొలుపొంద నీ త్రోవఁబోయెడు పనికి
వలఁతిగా.”నని జాంబవంతుండు వలికెఁ.
“దొంబదియేడు దోడ్తోదాటువాఁడ
నంబుధి.”నని నీలుఁడత్తఱిఁబలికె.
నా మారుతాత్ముజుఁ202డాత్మపౌరుషము
లేమియుఁబలుక కయ్యెడ నూరకుండె.
“వాలిన కడిమిమై వడి నూఱు దాటఁ
జాలుదు; మగుడి రాఁజాలనొ203కాని.”
యని యంగదుఁడు వల్క నా జాంబవంతుఁ:
“డనఘ! మాకందఱ కధిపతి వీవు;
వాలితనూజ! యీ వారిధి దాటఁ
జాలుదు మగుడిరాఁజాలుదు వీవు.
యువరాజ వీ కపియూధంబులకును;
రవితనూజునియట్ల రాజవుగాన
దగ మమ్ముఁబనిగొనఁదగుఁగాక,యిట్లు
తగునయ్య? నీ కింతదైన్య మేమిటికి?
రామకార్యవరుండు రవిజునిమంత్రి
యీ మర్కటావళికెల్లఁబ్రాణంబు
తక్కక పవమానతనయుండు గలుగ
నక్కటా! నీ కసాధ్యము లెందుఁగలవు?
వల.”దని వారించి వాయునందనునిఁ
బిలిచి యాతనితోడఁబ్రియమునఁబలికె:

  1. దిగువని, తెగువని
  2. దీపించి
  3. లిప్పటికి
  4. బంధంబు
  5. ఇర్వది
  6. దివిరి
  7. గొండ కాలిలోఁ (మోఁకాల) దనరార (ళముగ) విఱిగి
  8. నొదవె
  9. డాపౌరుషంబు
  10. ను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )