ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
కుబేరుండు రావణునకు బుద్ధి చెప్పుట
నతిరోషుఁడగు నీకు నతిమదాంధునకు
హితబుద్ధి బుద్ధుల నెన్నిచెప్పినను
నాపల్కు వినవైతి నాన పోవిడిచి
యీపాపఫలము నీవెఱిఁగెదుగాక
తగ దనకెవ్వఁడు తల్లిదండ్రులను
మిగుల నాచార్యుల మేదినీసురుల
నవమానితులఁ జేయు నాదురాత్మకుఁడు
వివిధోగ్రనరకముల్‌ విడువక పొందు
నొడలు నెమ్మదినుండ నొడిగూడియుండఁ
జెడని ధర్మముసేయఁ జిత్తంబు చొరక
కానమి నెవ్వఁడు గర్వించి పలుకు
వానికి నరక మవశ్యంబుఁ గలుగు
మహితధర్మముసేయ మహనీయరాజ్య
సహితసంపదలతో సౌఖ్యంబు గల్గుఁ
గడఁగి యధర్మంబుఁ గావింప మీఁదఁ
గడలేని దుఃఖంబు గల్గు గావునను
బరమసుఖార్థివై పాపంబు విడచి
కరమర్థి ధర్మంబు గావింపవలయు
గుఱిలేని పాపంబు ఘోరదుఃఖంబు
కొఱకుఁ జేయుదువీవు క్రూరుండవగుటఁ
గడిమిఁ బాపము సేయఁగా వచ్చుఁ గాని
కడిమిమై వలసిన గతికిఁ బోరాదు
గైకొని యెవ్వఁడు కర్మంబుఁ జేసె
నాకర్మఫలము వాఁడందకపోఁడు
దురితంబు గావించి దుస్సహంబైన
నరకంబుఁ బొందునున్నాఁడవు గానఁ
బాపాత్ముఁడవు నీవు పాపభీరులకుఁ
బాపకర్ములతోడ భాషింపఁ దగదు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )