ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
పులస్త్యుఁడు మాహిష్మతీపురికి వచ్చి రావణుని విడిపించుట
దౌవారికుఁడు డాసి ధరణీశుతోడ
దేవ పులస్త్యుఁ డేతెంచినాఁడనిన
నాతతభక్తితో నయ్యర్జునుండు
చేతులు శిరముపైఁ జేర్చి మ్రొక్కుచును
అమరంగ ముందట నర్ఘ్యపాద్యములుఁ
గొమరార ధేనువుఁ గొని పురోహితుఁడు
తనతోడ రాఁ బులస్త్యబ్రహ్మ కెదురు
సనదెంచి చరణాంబుజంబుల కెరఁగి
యనుపమనిష్ఠతో నర్ఘ్యపాద్యములు
ననఘుఁడై యొనరింగి యాగోవునిచ్చి
యతులతేజోమూర్తి నాబ్రహ్మఁ జూచి
మతిలోన సంతోషమగ్నుఁడై పలికె
నెలకొన్న పెంపుతో నేఁడు నా పురము
పొలుపారె నమరేంద్రుపురము చందమున
నేనింద్రుఁ బోలితి నెల్లందు నాకు
మానుగాఁ గుశలంబు మది విచారింప
నేఁడు నా కులమొప్పె నిఖిలదేవతలు
పోఁడిగాఁ గొల్చు నిన్బూజింపఁ గంటి
నేను ధన్యుఁడనైతి నిదె రాజ్యలక్ష్మి
నా నందనుల్‌ వీరె నా సతుల్వీరు
యేనిదె మీ కార్య మేమైనఁ గాని
యానతి యిమ్మన నాపులస్త్యుండు
ధరణీశ కుశలమె ధర్మంబులందుఁ
బరికింపఁగా నన్ని పరిచర్యలందుఁ
బలములందును నీకుఁ బన్నుగాననుచు
నెలమితో సంతోష మేర్పడ నడిగి
నిరుపమంబగుచున్న నీవిక్రమంబు
నురబాహుబలమును నొప్పు బేర్కొనఁగ
వ్రాలిన కడిమి నెవ్వానిఁ బేర్కొన్న
గాలియు జలధులుఁ గదలంగ వెఱచు
నట్టి నా మనుమని నాదశగ్రీవు
పట్టి కట్టితివీవు బవరంబులోన
మూఁడులోకంబులు మొగిఁ గీర్తి గంటి
పోఁడిమి నను నీదు బుద్ధి మన్నించి
రావణు విడువుము రాజేంద్ర నీవు
గావించు పూజలు గైకొందుననిన
నగుఁ గాక నాకు నీ యానతికంటె
తగ నొండుకార్యంబు దలపోయఁ గలదె
యనుచును బౌలస్త్యు నప్పుడు విడిచి
తన గౌరవంబొప్పఁ తగఁ గట్టనిచ్చి
యురుమదోద్ధతుల నొండొరుఁ జంపకుండ
సరి నగ్నిసన్నిధి శపథములు సేసి
వినయంబుతో బ్రహ్మ వీడ్కొని యెలమిఁ
దన గృహంబునకు నాధరణీశుఁ డరిగెఁ
దనలోన సిగ్గునఁ దల లోలి వాంచి
తన వెన్క వచ్చు నాదశకంఠుఁ జూచి
చనుమని యాబ్రహ్మ సంతోషమొప్పఁ
దన లోకమున కేగెఁ దదనంతరంబ
మనమున నిట్లౌట మఱచి యంతయునుఁ
దన సేనఁ గూడక తగ దశాననుఁడు
నట పుష్పకారూఢుఁడై విజృంభించి
యిటునిటుగా భూమియెల్లఁ గ్రుమ్మరుచు
రాజితఁ డీతఁడు రాక్షసుం డనక
నాజికి నతిబలులగు వారినెల్ల
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )