| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నలుకతో గెలుచుచు నధికదర్పమున గెలుపుఁ గైకొంచుఁ గిష్కింధకు నరిగి వ్రాలిన కడిమిమై వచ్చినవాఁడఁ వాలితోఁ గయ్యంబు వలయు నాకనిన దరుచరేంద్రుని మంత్రి తారుఁడన్వాఁడు సురవైరిఁ జూచి యాశూరపుంగవుఁడు వాలి యిక్కడలేఁడు వ్రాలి దర్పించి యాలంబునకుఁ జాల రన్యులెవ్వరును నాలుగంబుధుల నానగచరాధీశుఁ డోలి సంధ్యావిధు లొనరించ వచ్చు నొక్కింత నిలువు నీ యుద్ధతులెల్ల చక్కనయ్యెడుఁ గాక సంభ్రమంబేల సమరోర్వి నతనితోఁ జచ్చినవారి యెముకల పెనుప్రోవులివియె కన్గొనుము దశకంఠ యమృతంబు ద్రావిననైన వశమె చావకయుండ వాలితోఁ దొడరి మరణంబు వేగంబు మదిఁ గోరితేని యరుగుమిప్పుడు దక్షిణాంబుధికడకు నుగ్రతేజముతోడ నుర్వికి డిగిన యుగ్రాంశువిధమున నొప్పారువాని నక్కడఁ గనియెద వవ్వాలి ననిన ధిక్కరించుచు నేగి దేవకంటకుఁడు కనకాద్రినిభమైన గాత్రంబు తరుణ దినకరబింబంబు తెఱఁగు నాననముఁ గలిగి సంధ్యావిధుల్ గడునిష్ఠతోడఁ జలిపెడి నయ్యద్రిచరవీరుఁ గాంచి కడుతెంపుతోఁ బుష్పకము డిగ్గి యతని నడఁగఁ బట్టెదనంచు నల్లనఁ గదియఁ గాలిచప్పుడు విని కను విచ్చి చూచి వాలియు నాదశవదను తెంపెఱిఁగి కేసరి కరిఁ బట్టు క్రియ మహోరగము గాసిల్ల గరుడుండు కబళించు కరణి నీతని నలిఁ బట్టి యెమ్ములు నలియ నాతతగతి జంక నంటంగ నిఱికి శిథిలంబులై కాళ్లు చేతులు వ్రేలఁ బృథివిపై జనులెల్లఁ బ్రియమంది చూడ నామూఁడుజలధుల నానిశాచరుని దీమసం బడరంగఁ ద్రిప్పుదుననుచు నూహించి జపనిష్ఠనుండి యాలోన సాహసంబున నానిశాచరేశ్వరుని నవలీలఁ బట్టి కక్షాంతరాళమున నవయవంబుల సందు లందంద నులియ నిఱికి యాకసమున కెగయంగఁ జూచి వెఱగంది పోనీక విడిపింతమనుచు దశకంఠు మంత్రులు దారుణగతుల దిశల నార్పులు నిండఁ దెగువతో నరిగి యనిలవేగంబున నరుగు నవ్వాలి ఘనవాలవాతూలగతి సైఁపలేక తూలికాలఘులీలఁ దూలి వేసారి రాలంబునకుఁ బోవ నలవి గాకునికిఁ దలలూఁచి పొగడుచుఁ దరుచరేశ్వరుని దలపడ మనమెంత దశకంఠు లావు సమసియుండఁగ మన సాహసంబులును గ్రమమున నేరవు గతిదప్పె ననుడు నంత నాకపివీరుఁ డమరసంఘములు సంతోషమునఁ దన్ను సంస్తుతుల్ సేయఁ బశ్చిమాంబుధికి నప్పౌలస్త్యుఁ గొనుచు నిశ్చలగతి నేగి సేమంబుఁ దీర్చి వరుస నుత్తరపూర్వవార్ధులయందు వెరవొప్ప సాయాహ్నవిధు లనుష్ఠించి మరలి కిష్కింధకు మహిమతో వచ్చి పురసమీపంబునఁ బుడమిపై వైచి నవ్వుచు నాదశాననుఁ జూచి పలికె నెవ్వఁడ విటకు నీవేతెంచుటేమి నావుడు నమరేంద్రనందన యేను రావణుఁడనువాఁడ రాక్షసేశ్వరుఁడ మలసి యాజికి వచ్చి మశకంబు భంగి బలము వమ్ముగఁ బట్టువడితి నీచేత నాలుగుజలధుల నన్ను నిబ్భంగి నోలిఁ ద్రిప్పితి నీ బలోద్ధతి మెఱయ నీ లావు కడునొప్పు నీ ధైర్యమొప్పు వాలిన గంభీరవర్తనంబొప్పు ననవుడుఁ గోపించి యావాలి కినిసి యని సేయనని వచ్చి యకట నీవింకఁ బురమున కీమొగంబులతోడ మరలి యరుగుట యుచితమె యది యాలముడిగి పరఁగ నీయాననపంకజంబులకుఁ దరమిడి యస్త్రక్షతంబులు వలయు నని పేర్చి నగరికి నద్దశానుని గొనిపోయి కందుకాంకునిగా నొనర్చి |