| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
యంగదు తొట్లకు నటమీఁద వ్రేల నంగకమగు దశాననకందుకంబు నిరవందఁ గట్టిన నింద్రుమన్మఁడును నురునఖాస్త్రంబుల నురుశోణితంబు దొరఁగంగ దనుజనాథుని మోములందుఁ బరువడి నిడియాల పఙ్క్తులుగాఁగఁ గడు నుగ్రముగఁ జేయఁ గఱకురాక్షసుఁడు మిడుకుచు వాపోవ మిన్నెల్ల నద్రువఁ గరుణించి యాపఙ్క్తికంఠుని జూచి యిరవంద నీకోర్కులీడెఱె ననిన విని సిగ్గుపెంపున వెలవెలఁ బాఱి గొనకొన్న భీతితోఁ గూఱి యిట్లనియె నమరులకంటె నీవసురలకంటె నమితవిక్రమలీల నధికుండవగుదు భూరివేగముఁ జూడ భుజగారికొండె మారుతమునకొండె మనసునకొండె నీకొండెఁ గలదేను నెరయఁ గయ్యముల భీకరభుజశక్తిఁ బెంపొందినాఁడ నీవును నేనును నిక్కంబు చెలిమి గావింపఁదగుదుము కలిసియుండుదము నా సొమ్ములను నీవు నగచరాధీశ నీ సొమ్ములని చూడు నీదు చిత్తమున మనమగ్నిసాక్షిగా మైత్రిఁ గైకొంద మనవుడు విని వాలి యగుఁగాక యనుచు నానిశాచరవీరుఁడగు దశాననుఁడు దానును మన మన్నదమ్ములమనుచుఁ బావకు సన్నిధిఁ బరిరంభణములు గావించి కీలితకరపద్ములగుచు నొప్పారు మృగరాజయుగళంబు భంగిఁ జొప్పడఁ గిష్కింధ సొచ్చి రిర్వురును నచటఁ గిష్కింధలో నద్దశగ్రీవుఁ డుచితవర్తనమున నొకమాసముండి వాలితోఁ దొడరంగ వచ్చి రావణుఁడు చాలక యిబ్భంగి సత్యంబుఁ జేసి యలరుచుఁ బుష్పక మర్థితోనెక్కి నలువార నాదశానను మంత్రులతని గనుఁగొని మనమునఁ గల కందువాప నొనర నిశాచరుం డుల్లంబుఁ బెంచి యెలమి మంత్రులు గొల్వ నెల్లలోకములు గెలుచు దర్పముల నాకిష్కింధ వెడలి వసుధేశు లులుకంగ వసుధఁ గ్రమ్మరుచు వసుధేశ యొకపుణ్యవనభూమిలోన |