| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
ననిమిషమునిముఖ్యుఁడైన నారదుని గని మ్రొక్కి కుశలంబు కరమర్థి నడిగి యీవనంబునకు మీరేతెంచుటేమి నావుడు నతనితో నారదుండనియె నీవు పుష్పకమాఁపి నెమ్మి నా పలుకు రావణ విను నీ పరాక్రమంబునకు నసమానబలమున నమరయూధముల వెస విక్రమించిన విహగేంద్రు కరణి మహనీయభుజశక్తి మాఱెందులేక బహుసంగరప్రౌఢిఁ బరఁగు నీవలన మనమున సంతోషమగ్నుండనైతి వినఁదగు నీవొక్కవిధము లంకేంద్ర వాసవాదులకు నవధ్యుండవగుచు వాసికెక్కిన వీరవరుఁడవు నీవు నిన్ను దవ్వుఁల గని నిశ్చేష్టులగుచు నున్న మర్త్యులతోడి యుద్ధంబులేల జముని లోకమునకు జవమున నేగి జము గెల్వు నీ బాహుసంరంభ మెసఁగ నలఘువిక్రమశాలియైన యాజముని గెలుచుట సకలంబు గెలుచుట యనిన నారద విను మేను నాకలోకంబు వారినందఱి నాహవంబున గెలిచి నలువార నమృతంబునకు సముద్రంబు బలువిడి దెచ్చిన భంగి నేనడరి యనిమిషలోకంబు లన్నియు గెలిచి మునినాథ యమునిపైఁ బోయెద ననుడు సమవర్తిలోకంబు సమయించి కాని యమరలోకముమీఁద నరుగంగవలదు కీనాశుపై దశగ్రీవ నీవరుగు సేనతో ననవుడు చిఱునవ్వు నవ్వి తలపోయ నరులపై దయనిట్లు నీవు పలికెద వనఘ నీ పలుకుఁ గావింతు బలిమి నందఱి లోకపాలుర గెలుతుఁ బలికిన తొల్లింటి ప్రతిన చెల్లింతుఁ బ్రజలందఱిఁ బట్టి బాధింతు జముని భుజగర్వమంతయుఁ బుత్తు నీక్షణమె యని మ్రొక్కి పుష్పకంబతఁడు దక్షణము చననిచ్చె నంత నాసంయమీశ్వరుఁడు తగు బలాబలములు తలపోసి చూచి జగము లెవ్వనిచేతఁ జాలభీతిల్లుఁ |