ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రావణుఁడు యమునిపై దండెత్తుట
బొరి పొరి సెవ్వఁడు పుణ్యపాపంబు
లరసి యేర్పఱచు దా నఖిలజీవులకు
నట్టి కాలుని గెల్తునని పల్కె నీతఁ
డెట్టుండునో కయ్య మేఁ జూతుననుచు
యమునొద్ద కతివేగ మరిగె నారదుఁడు
ప్రమదంబుతో నర్ఘ్యపాద్యంబులిచ్చి
అప్పు డాసమవర్తి యముడు ముందఱను
నొప్పార నెదురేగి యుచితోక్తు లమరఁ
మునినాథ కుశలమె ముదమొంద ధర్మ
మనిశంబుఁ జెల్లునె యనుచు మున్నడిగి
యేమి కారణము మీరిట రాక యనిన
నామునిప్రవరుఁ డాయమునితో ననియె
నాహవక్రీడకు నవిజేయుఁడైన
బాహుబలంబొప్పు పఙ్క్తికంధరుఁడు
పుడమిరాజులనెల్ల భూరిదర్పమున
వడి గెల్చి నిను గెల్వ వచ్చుచున్నాఁడు
తెఱఁగొప్ప నీకు నిత్తెఱఁగు మున్గలుగ
నెఱిగింప వచ్చితి నిందు నేననఘ
యని చెప్ప నాముని యంతటిలోన
ఘనదీప్తులడరంగ గగనమార్గమున
నడరు తేజముతోడ నర్కుండు వొడుచు
వడవునఁ గానఁగ వచ్చెఁ బుష్పకము
దారుణాకృతి నంత దశకంధరుండు
చేరి పన్నిన జముసేనఁ గన్గొనుచుఁ
బన్నుగాఁ దమ పుణ్యపాపముల్‌ గుడుచు
చున్నవారలఁ గాంచె నొక్కొక్కయెడను
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )