| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నాతతగతిఁ బుష్పకారూఢుఁడగుచుఁ బాతాళలోకంబు పైకెత్తిపోయి భోగవతీపురిఁ బొలుపారుచున్న భోగీంద్రులందఱుఁ బొరిఁ దన్నుఁ గన్న మానుగాఁ గైకొని మఱి వారిచేత మానితవిభవుఁడై మణిపురంబునకు నవిరళోద్ధతినేగి యందు నివాత కవచు లన్వీరులఁ గయ్య మర్థింపఁ జెలఁగి వారలు తమ సేనలఁగూడి వెలువడి తలపడి వివిధాయుధముల బలువిడి నొక్కటిపై మూఁడు నెలలు చలమునఁ బోరంగ జలజసంభవుఁడు వచ్చి యాసమరంబు వారించి వలదు మచ్చరం బిటమీఁద మది విచారింప దేవదానవులకుఁ దెగువతోఁ గడగి రావణు గెలువఁగ రాదు కయ్యముల మీర లజేయులు మీకు నతనికిఁ బోరేల సమబలుల్ పొత్తొప్పుననుచు నరవిందసంభవుఁ డగ్నిదేవుండు గురిగాఁగ సఖ్యంబుఁ గొమరొప్పఁ జేసి రవిరళప్రియవాదులగు నానివాత కవచులతోఁ గూడి కడువేడ్కతోడ మణిపురంబది లంక మాఱుగా నందు గణుతింపఁగా నేఁడు గాలంబు నిలిచి యొక్కటి కడమగా నొగి నూఱుమాయ లక్కడవారిచే ననువుగా నెఱిఁగి యొగి నొప్పు కాలకేయులపురం బశ్మ నగరంబు దానిపై నలువార నడచి వేలసంఖ్యలుగల విపులవిక్రములఁ గాలకేయులనెల్లఁ గడతేఱఁ జంపి నానాస్త్రముల శూర్పణఖ మగఁడైన వాని విద్యుజ్జిహ్వు వధియించి మఱియు నందంద దైత్యనాయకుల నన్నూటిఁ గ్రందుగా వధియించి కడఁకతో నరిగి విలసిత నవరత్న వివిధచిత్రములఁ బొలుపారు వరుణుని పుర మర్థిఁ గాంచి సిరియందు జన్మించె శితరోచియందు సురుచిరంబుగఁ బుట్టె సుధయందుఁ బొడమె నాపయోనిధి నిండ నధికదుగ్ధంబు లీపురంబుననుండి యిది నిచ్చ గురియు గురుకీర్తి నొప్పు నీగోవు సామర్థ్య మరుదుంచు సురభికి నటు ప్రదక్షణము గావించి మ్రొక్కుచుఁ గడు తెంపుతోడ నావీడు సొత్తించి యచట మార్పడిన బలరక్షకుల గెల్చి పరుషంబుగాఁగ నెలుఁగెత్తి వారితో నేపుమైఁ బలికె మీరు వేగమె పోయి మీరాజుతోడ నారాక చెప్పుడ నాతోడ ననికిఁ గడిమిమై రానిమ్ము కాదేని వచ్చి తొడరంగలేనని తొలఁగిపొమ్మనిన వరుణపుత్రులుఁ బౌత్రవర్గంబుఁ దారు నరుదారఁ బుష్కరుండను వీరవరుఁడు తీరుల విలసిల్ల దీప్తకోపమున ఘోరసైన్యముఁ గొంచు గోవుతో వెడలి దశకంఠు సేనతోఁ దలపడి యిందు దశకంఠు మంత్రులఁ దల మీఱి కెడపె నెసఁగు నాశుగముల నెంతయు నొంచి వెస రథంబులతోడ వినువీథి కెగయు పటుసాయకంబులఁ బఙ్క్తికంధరుని నటుమోముగా నేసి యతని మర్మములు పొరిఁ గాఁడ నేయ నప్పుడు మహోదరుఁడు సురవైరి నొచ్చుటఁ జూచి కోపమునఁ బృథుగదాపాణియై పృథులఘాతమున రథహయంబుల మ్రగ్గ రథములు శృంగ సారథుల్ నురుముగాఁ జక్రరక్షకులు తోరంపునెత్తుర్లతోడ రూపఱఁగ నాగ్రహంబునఁ గిట్టి యందఱఁ జంపి విగ్రహంబున నార్వ వివశులై తొలఁగి వారును నొక్కింత వడికి ధైర్యంబు లారంగఁ గైకొని యతని దిట్టుచును మండితభుజదండమండితద్యుతులుఁ జండకోదండకాంచనమణిప్రభలుఁ గలయంగ దీపింప గలసి లంకేంద్రు బలువిడి దాఁక నప్పఙ్క్తికంధరుఁడు కనుఁగొని నెఱ కులకాండముల్ ద్రుంచి ఘనముసలంబులు గదలు పరిఘలు భయద శరంబులు పరుషపాషాణ చయములు దుర్వారశక్తులు గురియ రథములెక్కుడు విర్గి రణయత్నమెల్ల శిథిలమై తారొండు సేయంగలేక పంకస్థలంబున భద్రసామజము లంకిలిఁబడియున్న యట్లున్నఁ జూచి నలువారఁగా సింహనాదంబుఁ జేసి బలువారఁ దఱచుగ బాణంబులేయ వారును నయ్యురువడి నివారింప సైరింపఁ జాలక జగతిపైఁ బడిరి పడిన గేహములకుఁ బరిచరుల్ వారి వడి నెత్తుకొనిపోవ వరుణుని మంత్రి వచ్చి సునాథుఁడన్వాఁడు లంకేంద్రు నచ్చుగా మొగపడి యతనితో ననియె నరవిందసంభవు నాస్థానమునకు వరుణుఁడు చన్నాఁడు వరగీతగోష్ఠి నిక్కడఁ గలవారినెల్లఁ గయ్యమున నిక్కంబు గెల్చితి నీవేగుమనిన ననయంబు నుప్పొంగి యందఱు వినఁగఁ దన గెల్పు చాటించి దశకంధరుండు |