ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
నారద ప్రేరితుఁడై రావణుఁడు శ్వేతద్వీపమునకుఁ జనుట
బాహుదర్పితుఁడైన పంఙ్క్తికంధరుఁడు
సాహసంబున నిశాచరులతోఁ గూడి
యెల్లందుఁ దిరుగుచు నెవ్వ రుద్ధతులు
బల్లిదులెవ్వరు భండనంబునకు
ధరణీశ రాక్షసదనుజగంధర్వ
సురవర్గములలోన శూరులెవ్వారు
వారున్న యెడలకు వడి నెత్తిపోయి
వారిఁ బోరికిఁ బిల్చి వరగర్వియగుట
భయమెందుఁ గానక భయదసంగ్రామ
జయకాముఁడై యట్లు చరియించుచుండ
బ్రహ్మసన్నిధినుండి బ్రహ్మనందనుఁడు
బ్రహ్మవర్చసమహోద్భాసి నారదుఁడు
నొండొక రవిభంగి నురుదీప్తి మేఘ
మండలోపరిభాగమార్గంబునందుఁ
జదలెల్ల వెలుఁగంగఁ జనుదేఱఁ జూచి
యెదురుగాఁ జని వాని నింపారఁ బలికె
లోకపూజిత సర్వలోకజ్ఞ బ్రహ్మ
లోకంబు మొదలైన లోకంబులెల్లఁ
జూచినాఁడవు నీవు శూరుల బలిమి
నేచిన పురుషులు నేయందుఁ గలరు
కడకతో మద్భుజాకండూతి వోవఁ
దొడరి కయ్యము వారితోఁ జేయవలయు
నావుడుఁ దలపోసి నారదుండనియె
రావణ నీమనోరథసిద్ధి వినుము
చెప్పంగఁదగు దుగ్ధసింధువు పొంత
నొప్పు శ్వేతద్వీపమొక్కటి గలదు
కనుఁగొనఁగా నందుఁగల వీరులెల్లఁ
దనుకాంతిమై సుధాధాముఁ బోలుదురు
అతులప్రమాణంబులగు శరీరములు
నతిదీర్ఘబాహులు నతులసత్త్వములు
నురువిక్రమంబులు నుగ్రతేజములుఁ
బరుషనాదంబులు భయదరోషములు
నచలధైర్యంబులు నమర వర్తింతు
రచటికిఁ జనుమన్న ననియె వెండియును
నేయాగ మేపుణ్య మేయుగ్రతపము
ధీయుక్తిఁ జేసి యాదివిని బుట్టుదురు
మునినాథ యెఱిఁగింపు ముదముతో నాకు
ననుడు నయ్యనఘాత్ముఁ డనియె నాతనికి
విజ్ఞానమయమనోవీథి నూహింప
నజ్ఞానులకుఁ జూడ నతిదుర్లభంబు
యుక్తిభేదములెల్ల నొండొంటఁ దెలిసి
భక్తి నారాయణపరతంత్రులగుచు
నేకనిష్ఠావృత్తి హృదయంబులోనఁ
జేకొని హరియందుఁ జిత్తంబు నిలిపి
హరికథాశ్రవణంబు హరికీర్తనంబు
హరిపదధ్యానంబు హరినామజపము
హరిమహోత్సవమును హరినిరీక్షణము
హరిసేవనముఁ దక్క నన్యంబు లేని
హరిభక్తులైనవా రందుఁ బుట్టుదురు
..........
అసురారిచే నాజి హతులైనవారు
నసమానసౌఖ్యంబు లందుఁ బొందుదురు
వినుమంచుఁ జెప్పిన విస్మయంబంది
తనలోన నూహించి దశకంధరుండు
మదవృత్తిఁ దద్ద్వీపమార్గంబు చనఁగ
నిది కడునాశ్చర్య మేఁ జూతుననుచు
నారదుండును నంత నలి నేగె నప్పుఁ
డారాక్షసుండును నద్దీవిఁ జేరి
విలయ మేఘధ్వనివిధము నొనర్చె
బలువిడి బ్రహ్మాండభాండంబు లవియ
నంత రావణుమంత్రు లాదీవి చెంత
నెంతయు భీతులై హృదయముల్‌ గలఁగి
రావణుఁ గనుగొని రజనీచరేంద్ర
నీ వెన్క రాలేము నిలువంగలేము
మా దర్పముల్‌ దక్కె మా మతుల్‌ దూలె
నీదీవి సామర్థ్యమెట్టిదో గాని
యిది చూడు మరుదైన యీపుష్పకంబు
చదలగాడ్పులఁ దూలు జలదంబు భంగి
నిగుడక నిలువక నిజశక్తి దూలి
మగిడిపోయెడి దీని మది విచారింపు
మదగర్వ మింకిన మా పనియేమి
కదనంబునకునంచుఁ గడిమి పోవిడిచి
తొలఁగజూచినవారితోన పుష్పకము
దొలఁగంగఁ బుచ్చి యాదోషాచరేంద్రుఁ
డొక్కఁడె చనుదెంచె యుద్ధంబు సేయ
నిక్కడఁగల వీరుఁ డెవ్వడో యనుచుఁ
బరికించి యందుల పడఁతులఁ గాంచి
యరుదంది కదియంగ నందొక్కవనిత
యడరు వేడుక వుట్టి యఱచేతిలోన
నిడుకొని నవ్వుచు నెలమితోఁ బలికె
నెవ్వఁడు పుత్తెంచె నిందేల వచ్చి
తెవ్వని తనయుండ వెవ్వఁడవనిన
నేవిశ్రవసునకు నిష్టపుత్త్రుండ
రావణుఁడనియెడు రాక్షసేశ్వరుఁడ
సమరార్థినై యిందుఁ జనుదెంచినాఁడ
నమితవిక్రమశాలి యగువానినొకని
నెక్కడఁ బొడఁగాన నేనంచుఁ బలుక
నక్కొమ్మలందఱు నందంద నగుచు
నానాతిచే నప్పుడట్లున్నవానిఁ
దానందుకొని యొక్క తరలాయతాక్షి
శిరములు పదియును జేతులిర్వదియు
నిరులుఁ గొన్మేనునౌ నిదియొక్క పురుగు
కడువింత చెలులార కనుఁగొనుండనుచు
నడుమంటఁ బట్టి యానాతులు చెలఁగి
శిశువునెత్తిన భంగి జిరజిర గొనఁగ
దిశలెల్లఁ ద్రిప్పిన తెఱఁగుగాఁ ద్రిప్పి
వారివారికి నిచ్చి వనజాక్షులిట్లు
వారక నొగి నెల్లవారు గావింపఁ
గడక నొక్కతెచేయి గఱచె నాసతియుఁ
జెడుపుర్వు గొనుమంచుఁ జెలిమీఁద వైవ
నదియు నాదశకంఠు నవలీలఁ గొనుచు
నొదవిన వేడ్కతో నుడువీథి కెగసి
కడునల్క చెలిచేయి గఱచిన పుర్వ
వడిఁబోయి పడుమంచు వాని వైచుటయుఁ
గులిశాహతంబైన కొండ చందమున
బలువిడి నబ్ధిలో బడియె మ్రోయుచును
నిబ్భంగి నందలి యింతులచేత
బ్రాభవం బెడలిన పఙ్త్కికంధరుఁడు
పడిన చందముఁ జూచి పరమహర్షమున
నడరి నారదుఁ డాడెనని చెప్పి మఱియు
మనుజేంద్ర నీ చేత మరణంబునొంది
ఘనకీర్తి సుఖములు గైకొందుననుచు
లోకైకరక్షణలోలుఁడవైన
నీకుఁ గోపమువుట్ట నిఖిలలోకముల
గాఢదర్పంబునఁ గలఁచె రావణుడు
మూఢాత్మకుఁడు గాఁడు మోక్షార్థి గాని
విక్రమోజ్జ్వల నీవు విష్ణుండవగుటఁ
జక్రగదాశంఖశార్ఙ్గహస్తుఁడవు
వామనరూపంబు వలనొప్పఁ దాల్చి
భూమి మూఁడడుగులు పొలము మున్నడిగి
యుడువీథి నొకపాద మొకటిపెన్నేల
కడమకు బలిఁ బట్టి కట్టితి వీవు
సురల భక్తికి భక్తిసులభుండవగుటఁ
గరుణించి లోకైకకంటకుండైన
రావణు వధియింప రామరూపమున
నావిర్భవించితి వాదిదేవుఁడవు
మానుషదేహాభిమానివి నగుచు
మానసంబున నిన్ను మఱపు గైకొనక
విష్ణుండ నేనని విజ్ఞానవీథి
నుష్ణాంశుకులనాథ యూహించి చూడు
సతతంబు నిను రహస్యములలోనెల్ల
నతిరహస్యముగాఁగ హరుఁ డెన్నుచుండు
నృపమాత్రమూర్తివై నీయందుఁ గలుగు
విపులవిక్రమమున వింశతిభుజుని
ననిలోన సుతులతో ననుజులతోడ
మనుమలతో నిష్టమంత్రులతోడ
నిఖిలబంధులతోడ నెట్టనఁ జంపి
తఖిలలోకములకు నక్కుముల్లణఁగ
ననురాగమును బొంది రఖిలదేవతలు
మును లాశ్రమంబుల ముదితాత్ములైరి
ఆ రావణుండును నట్ల సనత్కు
మారుచేఁ జగదేకమాత శ్రీదేవి
సీతగా మును వింటఁ జేసి యద్దేవి
నాతెంపుచే కొని యట లంకలోన
జననియ ట్లునిచి నీచండకాండములఁ
గనియె నిత్యంబైన కైవల్యపదము
పౌలస్త్యకులముఖ్యుఁ బఙ్త్కికంధరుని
నాలంబులోపల నవలీలఁ దునుమ
నాదైత్యదమనుండవగు నీకుఁ దక్క
నేదేవునకుఁ జెల్లు నినకులాధీశ
చెలువొంద నీకథ చెప్పిన విన్న
నలరుచుఁ బుత్రపౌత్రాదులతోడ
శుభలీల నరలోక సురలోక సుఖము
లభిమతస్థితిఁ గాంతు రాపుణ్యమతులు
క్రమమొప్ప నీయుపాఖ్యానంబు శ్రాద్ధ
సమయంబునందెల్ల జపియించిరేని
బితృదేవతలు గయాపిండప్రదాన
గతిఁ దృప్తులై పుణ్యగతులు గైకొందు
రనవుడు రఘురాముఁడౌ రామచంద్రుఁ
డనుజులు మువ్వురు నర్కనందనుఁడు
నగచరోత్తములును నక్తంచరేంద్రుఁ
డగు విభీషణుఁడును నతని మంత్రులును
నమ్మహాకథ విని యాశ్చర్యమంది
సమ్మదంబును బొంది సభలోననున్న
భూసురోత్తములును భూపాలవరులు
భాసిల్లు వైశ్యులుఁ బరఁగు శూద్రులును
మఱియుఁ దక్కినవారు మతుల నందంద
వెఱఁగంది యారామవిభుని గన్గొనఁగ
నాకుంభసంభవుఁడనియె రాజేంద్ర
నీ కీర్తి వింటిమి నిన్నుఁ జూచితిమి
లోకైకవినుత సుశ్లోకుండవగుచు
నేకాగ్రబుద్ధి నీవిల యేలుచుండు
త్రైలోక్యకంటకు దశకంఠుఁ దునిమి
వ్రాలిన నీ పెంపు వర్ధిల్లనిమ్ము
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )