| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
పోయి వచ్చెదమంచుఁ బొలుపారఁ దమకుఁ జేయు సత్కృతులొప్పఁ జేకొంచు నెలమి నందఱుఁ దమతమ యాశ్రమంబులకు సందీప్తతేజులై చనిరి సంయములు అంత రశ్ములు చల్లనై డిందుపడఁగ నంతకంతకు బింబ మరుణంబు గాఁగ నీడలు నిగుడంగ నీడముల్ జేరఁ గూడుచు బహుపక్షికుల మెలుఁగింప మక్కువ గనుమాటు మది సైఁపలేక జక్కవల్ బెగడంగ జలజముల్ మొగుడఁ దోయజగంధముల్ దోఁగి తుమ్మెదలు మ్రోయుచుఁ దమ దిక్కు మొగిరాకఁ జూచి కైరవంబులు నవ్వఁ గమలబాంధవుఁడు చేరె నస్తాచలశృంగంబుకడకు నిబ్భంగి నినుఁ డస్తమింపంగ నప్పు డబ్భానుకులనాథుఁ డఖిలభూపతుల నర్కతనూభవుఁ డాదిగాఁ గలుగు మర్కటోత్తముల సమ్మతి విభీషణుని నెంతయు సంతోష మెసఁగ వీడ్కొలిపి యంతఃపురంబున కరిగె నిట్లరిగి సముచితక్రమమున సాయంతనాది సమయోపచారముల్ సలిపి నిండించె నారాత్రి వేగంగ నంచితస్తోత్ర పారీణులగు పుణ్యపాఠకుల్ వచ్చి వీరపుంగవరామ విజయాభిరామ భూరివిక్రమ నిత్యపుణ్య మేల్కొనుము కౌసల్య సత్పుత్త్రుగా మోచి కన్న భాసురోదయ రామభద్ర మేల్కొనుము కౌశికుఁ డొనరించు కడిదిజన్నంబు శైశవంబునఁ గాచి సత్కీర్తిగన్న పాటవబహుదివ్యబాణసంపన్న తాటకాబలగర్వదమన మేల్కొనుము హాటకశైలంబు నాకృతిగల్గి మేటియై ధాత్రిలో మెఱసినయట్టి హరచాపగౌరవాహరణైకనిపుణ నరనాథ జానకీనాథ మేల్కొనుము తవిలి భార్గవరాము ధైర్యంబు పెంపు తివిచిన కోదండదీక్ష మేల్కొనుము చతుర నయోపాయ సత్యప్రతిజ్ఞ పితృవాక్యపాలనప్రియుఁడ మేల్కొనుము దండి విరాధుని దారుణాస్త్రమున ఖండించివైచిన ఘనుఁడ మేల్కొనుము ఘటితకారణజన్మ ఖరదూషణాది భట మేఘపటలోగ్రపవన మేల్కొనుము మారీచ నీరంధ్ర మాయాంధకార నీరజబాంధవ నెమ్మి మేల్కొనుము ఉగ్రాస్త్రమున వాలినొడిచి కిష్కింధ సుగ్రీవు కొసఁగిన శూర మేల్కొనుము సదయావలోకన సత్యప్రసన్న వదన విభీషణవరద మేల్కొనుము దుర్వారకల్లోల దుస్తరాంభోధి గర్వశోషణచండకాండ మేల్కొనుము ఘను కుంభకర్ణుని గడిది బాణములఁ దునుమాడు దుష్కృతదూర మేల్కొనుము దశకంఠకంఠనిర్దళన ప్రచండ విశిఖప్రయోగప్రవీణ మేల్కొనుము ఘనకీర్తిచంద్రికా క్రాంతిదిక్చక్ర జనలోకనుత రామచంద్ర మేల్కొనుము పూతశుభాకార భూనుతాచార భ్రాతృవత్సల రామభద్ర మేల్కొనుము సుఖరాత్రియై నీదు సుప్రబోధమున నఖిలలోకములకు నానంద మొదవె యోగనిద్రాలీల నుదధిమధ్యమున భోగీంద్రతల్పుఁడై పొలుపారుచున్న పురుషోత్తముని భంగి భువనరక్షైక పరత మేల్కొనుమంచుఁ బ్రస్తుతించుటయు నెత్తమ్ము లిటమీఁద నిద్దుర దెలియ నత్తెఱం గిట్టిదయని చూపు కరణి నల్లన నయనంబు లలరఁ దాల్చుటయు మెల్లని పొడ వెట్టి మేల్కని వచ్చి మలయజవాసిత మణిహేమకుంభ జలముల నొగి వార్చి జలకంబు దీర్చి యత్యంతనియతితో నగ్నిహోత్రాది నిత్యకర్మంబుల నెరయంగఁ దీర్చి భూసువర్ణాదిక పుణ్యదానములు భూసురవితతికిఁ బొలుపార నిచ్చి సురపితృపూజలు సొరిదిఁ గావించి గురుభక్తియుక్తుఁడై గురుల మన్నించి భూసురాశీర్వాదపూతంబులైన సేసఁబ్రా లొనరంగ శిరమునఁ దాల్ప కప్రంబుతోఁ గూడఁ గలయ వీడ్యముల విప్రపుంగవులకు వేడ్కతో నిచ్చి యాననం బలరంగ హస్తముల్ మొగిచి వీనుల కింపార వినయంబుతోడ విచ్చేయుఁడని పల్కి వివిధభూషాదు లచ్చుగా ధరియించి యధికతేజమున బహుచిత్రమణిగణప్రభలు శోభిల్ల మహనీయతరసభామండపంబులకుఁ జనుదెంచి జనముఖజలజంబు లలరఁ గనుఁగొని దోషాంధకారంబు విరియ భద్రపీఠంబను ప్రథమాద్రి రామ భద్రుండు విలసిల్లెఁ బద్మాప్తుకరణి నంత వసిష్టాదులగు పురోహితులు సంతుష్టమతులైన సకలభూపతులు రుచిరభూషణజాలరోచిష్ణులగుచు నుచితాసనంబుల నోలి శోభిల్ల వరభూషణాదుల వరుసఁ గైసేసి పరమప్రియంబున భరతుండు నెలమి శత్రుభీకరభుజోజ్జ్వలుఁడు లక్ష్మణుఁడు శత్రుఘ్నుఁడును వచ్చి సమయజ్ఞులగుచు జననాథముఖచంద్రచంద్రికారుచులఁ గనుఁగొని తమ హస్తకమలముల్ మొగిచి బహురత్నకోటీరభాగముల్ గదియ మహితాత్ము లింపార మాటిమాటికిని బనియేమి దేవ యన్పల్కు మున్గాఁగఁ బనులెల్లఁ గైకొంచు భక్తిమైఁ గొలువ ననుపమజయసత్త్వులగు ఋక్షవరులు ఘనబాహులగు మహాకపులతోఁ గూడి మర్కటాధిపుఁడును మంత్రులతోడ నర్కసన్నిభతేజుఁడగు విభీషణుఁడు వరకవుల్ గాయకుల్ వరుసతో సరస పరిహాసచతురులు బహుకళావిదులు పౌరాణికులు శాస్త్రపరిణతుల్ వేద పారగుల్ నృపనీతిపరిచితమతులు నుచితభంగుల నుండ నురుహేమరత్న రచితభూషాదులు రమణమైఁ బూని లలితముక్తాదామ లసితంబులైన నలినంబు లననొప్పు నగుమొగంబులును గ్రాలుచూపులు నల్లకలువలో యనఁగ నాలోలచతురంబులైన నేత్రములు నమృతాంశు నవరేఖ లడఁచు ఫాలములు నమృతంబు మఱపించు నధరబింబములు కాముకావళి మతుల్ గరఁగింపఁ జాలు కామకార్ముకశృంగగతిఁ బోలు బొమలు నెత్తమ్మితావులు నిగుడునాసికలు మెత్తని చిగురుల మించుహస్తములు నిండారు నునుఁగాంతి నెలకొన్న చంద్ర ఖండంబు లననొప్పు గండపాలికలు వదనేందురుచులను వంచించి వెనుక నొదవు చీఁకట్లన నొప్పు క్రొమ్ముళ్లు విలసితభుజలతావిక్షేపణములఁ గలయ నిగ్గులు సూపు కమ్రకక్షములు ప్రక్క గానఁగ సరుల్ పైపయిఁ బొరలఁ బిక్కటిల్లుచునున్న బిగిచన్నుఁగవలు వృత్తోరుయుగములు వేడ్కఁ గాముకుల చిత్తముల్ గరఁగించు సింహమధ్యములు నడదీఁగెలో యన నవకంబుఁ గాంతి కడునొప్పు మేనులు ఘననితంబములు చిఱుతనవ్వులు తీయ చెయ్వులుఁ గల్గు తెఱవలు వలరాజు దీమంబులనఁగ మణిమయమేఖలామంజీరవలయ ఝణఝణత్కారంబు సరిఁ గ్రందుకొనఁగ గురునితంబోల్లసత్కోమలగతుల మురిపెంబు లమరంగ మొగి నేగుదెంచి వరుస నానాగీతవాద్యనృత్యముల సరసులై కొలువంగ సమయంబు లెఱిఁగి పొలుపుగా ధర్మార్థపురుషార్థ కథలు చెలఁగి పౌరాణికుల్ చెప్పంగ వినుచు రాజితమణిహేమరత్నపీఠమున రాజమధ్యంబున రాజేంద్రవిభుఁడు రవికులోత్తముఁడైన రామచంద్రుండు దివిజసేవితుఁడైన దేవేంద్రు భంగి గ్రహగతుండగు చంద్రు గతి నొప్పుచుండె మహిమ నిట్లొప్పుచు మఱియొక్కనాఁడు సకలజ్ఞు మిథిలేశు జనకు నీక్షించి ముకుళితహస్తుఁడై ముదమొప్పఁ బలికె |