ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రాముఁడు జనకుని మిథిలకుఁ జనుమని వేఁడుట
నలరి విదేహాన్వయంబు నిక్ష్వాకు
కులమును వెలయుట కుశలమై యొప్పె
ధరణీశ మీరును దశరథేశ్వరుఁడు
బరికింప మాకొక్క భంగియె కాదె
పెక్కునాళ్ళకు మమ్ముఁ బ్రీతిఁ గన్గొనుచు
రాజశేఖరుఁడవై రాజిల్లు మీరె
పూజితంబగుచున్న పురుషరత్నములు
ఇక్కడనుండితి రిష్టభావమునఁ
బోయివత్తురుగాక భూపాల యనుచు
నాయతద్యుతి నొప్పు నవ్యరత్నములు
కట్టనిచ్చిన వానిఁ గరపంకజమున
ముట్టి లేనవ్వుతో ముదితాత్ముఁడగుచు
భావింప నృపవీర పరమబంధుఁడవు
నీవు కావున మేము నిన్నె కోరెదము
కాకుత్థ్సకుల యిట్టికడిఁది కార్యంబుఁ
జేకొని యెవ్వఁడు సేయంగనోపు
నీయొప్పు రత్నంబులివి నీకె యొప్పు
మా యీవిగా వీని మరలఁ గైకొమ్ము
అనవుడు రఘురాముఁ డౌఁగాక యనుచు
జనకభూవరు సంతసమున వీడ్కొలిపి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )