| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నడుచుచో నమ్మహానాథు లొండొరులుఁ గడువేడ్క రథములు గదియ రానిచ్చి భరతుఁడు పిలిపింపఁ బ్రతినతో మనము నరుగుదెంచిన కార్య మది సేయఁగలిగె సాహాయ్యకము పేరఁ జని మన రాము నాహవనైపుణం బది చూడలేదు రామరావణులకు రణమైన చోట నేమని యుండిరో యింద్రాది సురులు క్రందెంత గలిగెనో గగనభాగమున .......... దేవాసురాదులఁ దృణముగాఁ గొనుచు దేవేంద్రుఁ డాదిగా దిక్పతు లడల నాలంబులోపల నవలీల నిలిచెఁ గైలాసమెత్తెను గౌరీశుతోడ నట్టి యాదశకంఠు నస్త్రవేగమున నెట్టు వారించెనో యినకులోత్తముఁడు ఎట్టి దివ్యాస్త్రంబు లేసెనో వానిఁ గట్టల్క ననిలోనఁ గడతేర్చి పుచ్చె నింద్రాది దివిజుల హృదయశల్యంబు నింద్రజిత్తనువాని నెక్కటి దాఁకి సౌమిత్రి యేగతిఁ జంపెనో మనకు నామహాభుజు లావులవి చూడలేదు శూరపుంగవులైన సుగ్రీవముఖ్యు లారఁ జేసిన లావు లతివిచిత్రములు హనుమంతు చేసినయట్టి కార్యములు విన విస్మయంబు లావిధములన్నియును గనుఁగొనలేకున్నఁ గాకుత్థ్సుచేత వినఁగల్గెఁ గనుఁగొన్న విధమెకా మనకు ననుచు సంతోషంబు లంతరంగముల నినుమడింపంగఁ బోయిరి పురంబులకు నిమ్ముల భరతుండు నెమ్మి లక్ష్మణుఁడు నెమ్మి శత్రుఘ్నుఁడు నృపతివాక్యమున రాజుల నయ్యయి రాజధానులకు వాజిసామజరథావళులతో ననిచి తేజంబుఁ బెంపును దీపింపఁ దన్నుఁ బూజించి క్రమ్మఱఁ బుత్తెంచునపుడు రాజన్యవిభుఁడైన రఘువీరు పేర రాజమానానేక రత్నసంఘములు చారుకాంచనముల సంతతద్యుతులఁ దారకావళి మించు తారహారములు భాసిల్లు తొడవులు పరికింప నొప్పు దాసీసమూహముల్ తగు రథంబులును నుత్తమాశ్వంబులు నున్న తాకృతుల మత్తమాతంగముల్ మలయజాదులునుఁ |