ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
రాముఁడు కపివీరులకు బహుమానము లిచ్చుట
బొరి పొరిఁ గొనివచ్చి భూలోకనాథు
చరణంబులకు మ్రొక్కి సరి కేలు మొగిచి
దేవర మీకుఁ బుత్తెంచినారనుచు
..........
విన్నవించిన వాని వేడ్కఁ గైకొనుచుఁ
గొన్ని భూషణములు కొన్ని రత్నములు
నుగ్రాంశుకులనాథుఁ డుగ్రతేజునకు
సుగ్రీవునకు నిచ్చి సుస్మితుండగుచుఁ
దగు భూషణమ్ములు ధర్మైకనిరతుఁ
డగు విభీషణునకు నందంద నిచ్చి
సరి నాఁగ యామినీచరులకు నెల్ల
నురుతరాభరణంబు లొగి నొప్ప నిచ్చి
భవ్యదయాదృష్టి పరమమంత్రులకు
నవ్యంబులగు భూషణము లిచ్చె నిచ్చి
సుగ్రీవుఁ జూచి నీసుతుఁ డంగదుండు
విగ్రహోదగ్రుఁడై వెలయు నీలుండు
హనుమంతుఁడును మాకు నత్యంతహితులు
ఘనవిక్రములు వాలికంటె నీకంటె
వీరు గావించిన విక్రమక్రమము
లారసి చూడంగ నతివిచిత్రములు
అదిగానఁ దగు పూజ కర్హులు వీరు
వదలక మన్నింపవలయు మాకనుచుఁ
గడువేడ్కతోఁ గేలఁ గరమొప్పఁ దిగిచి
తొడలపై నిడుకొని తొడరారు కరుణఁ
దన దొడ్డతొడవులు దగ విభాగించి
జనులెల్లఁ బొగడంగ సరి రాఁగఁ దొడిగె
నంత నంగదుఁడును నచలనందనుఁడు
సంతోషమున మ్రొక్కి సభ నుల్లసిల్ల
గజగవాదులు నట్ల కడకతో మ్రొక్కి
నిజమైన భక్తితో నిలుచున్నఁ జూచి
యర్కవంశాధీశుఁ డనియెఁ దానిట్లు
కర్కశవిక్రమఘనులైన మీరు
మర్కటోత్తములార మాకు సోదరులు
తర్కింప బంధువుల్‌ తనువు ప్రాణములు
వెలయంగ మీయట్టి వీరపుంగవులు
కలుగ సుగ్రీవుండు కడుధన్యుఁ డనుచు
నిరుపమాకృతినొప్పు నీలుని నలుని
గిరిచరాగ్రణియైన కేసరిఁ గుముదు
ఘనుని సుషేణుని గంధమాదనుని
వినతుని మైందుని ద్వివిదునిం బనసు
వరకీర్తియుతు జాంబవంతు గవాక్షు
దురవలోకుండగు ధూమ్రు సన్నాహు
మొగిఁ బ్రజంఘుని దధిముఖుని దుర్దమునిఁ
దగు మహాబలు మహోద్ధతు నింద్రజాను
నాళీకముఖుఁడగు నగచరోత్తముని
నాళీకముల నవ్వు నయనంబు లలరఁ
గనుఁగొని బహురత్నఖచితంబులైన
వినుతభూషణములు వివిధాంబరములు
మానితస్థితి నిచ్చి మఱియు నీవలయు
వానరోత్తములకు వరుసతో నిచ్చి
నిచ్చలు నిబ్భంగి నృపుఁడు మన్నింప
మెచ్చైన ఫలములు మేటి తేనియలు
నమృతోపమానంబులైన యన్నములు
నమర భుజించుచు నంచితాకృతులు
ప్లవగ గోలాంగూల భల్లూకపతులు
నవిరళస్థితిఁ గూడి యామినీచరులుఁ
జరియించుచుండి రాజననాథుఁ డంత
సురుచిరస్థితి నొప్ప సుగ్రీవుఁ జూచి
గిరిచరాధిప నీవు కిష్కింధ వెడలి
చిరకాలమయ్యెను శిశిరంబు వచ్చె
నీ సేనతో నేగి నీవు నీ పురిని
భాసురస్థితి మైత్రిఁ బాటించియుండు
ముపచారవాక్యంబు లొండింక నేల
కపినాథ నీవెల్ల కపులఁ బాలింపు
వాలిసూనుఁడు వాలి వరులలోనెల్ల
వ్రాలిన వీరుఁ డీవాయునందనుఁడు
విజయుఁ డీశతబల ద్వివిద మైందులును
గజుఁడును గవయుండు గంధమాదనుఁడు
శరభుండు కుముదుండు జాంబవంతుండు
హరియుఁ గేసరియు గవాక్షుండు నలుఁడు
నీసుషేణుండును నీసుబాహుండు
నీసుందరుండును నీపాటలుండు
హేమాచలోన్నతి నేపారుచున్న
యీమేటిశరభుండు నీనిశంభుండుఁ
జూడుఁడు మొదలైన శూరులనెల్ల
వేడుక మన్నింపు వేఱు సేయకుము
వీరపుంగవ నీతి విడువకుమనుచు
నారవినందనుం డలరంగఁ బలికి
యుపగూహనంబుల నుల్లంబు లలరఁ
గపినాయకులనెల్లఁ గడు గారవించి
సమ్మదంబున విభీషణుఁ జూచి మాకు
నెమ్మి గావించితి నీవెల్ల హితవు
ధర్మాత్ముఁడవు సత్యదాక్షిణ్యమతివి
నిర్మలవ్రతుఁడవు నీతిమంతుఁడవు
గాన నీవకలంకగతి లంక నేలు
మానుగా సురలకు మఱి రాక్షసులకు
ననఘుఁడు మీయన్నయగు కుబేరునకుఁ
దనర నీవేయెగ్గుఁ దలఁపకయుండు
ధర్మవర్తన మెందుఁ దప్పని విహిత
కర్ములు ధరఁ బెద్దకాలమేలుదురు
పాయక ధర్మంబుఁ బాటింపు మనఘ
మాయెడ నెయ్యంబు మఱవకు మనిన
శైలచరాదులు సకలరాక్షసులు
మేలు మేలని రాము మృదుతరోక్తులకు
నలరుచు నీబుద్ధి యమరు నీబాహు
బలవిక్రమంబులు ప్రణుతింప నొప్పు
జగదీశ నీకీర్తిచంద్రికల్‌ జగము
లొగి నిండి యొప్పుచునున్నవి యనుచుఁ
బలుమాఱుఁ గొనియాడఁ బవననందనుఁడు
నలువార దండప్రణామంబుఁ జేసి
నరలోకనాయక నాకు మీమీఁదఁ
దిరముగాఁ గల భక్తి దీపింపనిమ్ము
వీరుండ నీకథ వినఁబడుచుండు
నారంగ నెందాఁక నంతకాలంబు
జననాథ నీకథాజలధి నోలాడ
ననిశంబు నాచిత్తమది గోరుచుండు
నిచ్చలు నచ్చరల్‌ నీకథామృతము
వచ్చి నాకడఁ బాడ వరమిమ్ము నాకు
నెందాఁక నీకథ యెసఁగు లోకముల
నందాఁక ధరియింతు నాయు వేననినఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )