| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
గరుణావిలాసంబు కన్నులఁ దోఁపఁ గరము వేడుకతోడ గద్దియ డిగ్గి యాలింగనముచేసి యనిలనందనుని నీలోకజాలంబు నెందాఁకఁ గలుగు రామాయణము గల్గు రమణ నెందాఁక నీమేను నందాఁక నిత్యమైయుండు రాకాసుధాకరరశ్ములనగుచు నీకీర్తి వర్తించు నిఖిలలోకములఁ గపికులోత్తమ మాకుఁ గావించినట్టి యుపకారమునకు మాఱొనరింపలేము ఆపదల్ బ్రాపించునప్పుడు సుజను లోపి ప్రత్యుపకార మొనరించు టెల్ల నీకు నాపదలేదు నిఖిలలోకముల నేకతంబున నంచు నింపారఁ బలికి నాయకరత్నమై నడుమ వైడూర్య మాయతద్యుతిఁ బొల్చు హారమిచ్చుటయు ధరియించి మారుతి దనిరె నక్షత్ర పరివృతాంగంబైన భర్మాద్రి పగిది నృపలోకనాథుండు నెమ్మితో మఱియు నుపగూహనంబుల నుచితవాక్యముల నిమ్ముల మన్నించి యెలమి వీడ్కొలుప సమ్మదంబున నద్రిచర నిశాచరులు సాఁగిలి మ్రొక్కుచుఁ జనిరి చిత్తముల రాఁగిల్లి తమతమ రాజధానులకు నమ్మహీశుండును నతిభక్తితోడఁ దమ్ములు పనిసేయ ధరణి యేలుచును |