ఇతిహాసములు రంగనాథరామాయణము ఉత్తరకాండము
కుబేరుని యొద్దినుండి పుష్పకము మరల వచ్చుట
అపరాహ్ణసమయము నందొక్కనాఁడు
విపులవాక్యంబుల వినువీథి వినియె
ననఘ నేఁ బుష్పకంబనుదాన మీరు
పనిచిన పౌలస్త్యు పాలికి నరిగి
కిన్నరాధిప రఘుక్షితిపతి నిన్ను
మన్నించి నను నీకు మరలంగనిచ్చెఁ
బుత్తేర వచ్చితిఁ బొలుపార ననిన
విత్తాధిపతి కడువేడ్కతోఁ బలికె
నమరవిద్రావణుండైన రావణుని
సమదపుత్రామాత్యసహితంబు గాఁగ
దుస్సహరణభూమిఁ దున్మాడి వైచి
నిస్సీమవిజయుఁడై నిను దెచ్చెఁ గాన
వసుధేశు నొద్దనె వదలక నీవు
వసియింపఁదగునన్న వచ్చితి నేను
దలఁచినప్పుడు వచ్చి ధరియింతు రూపు
గలిగియుఁ బొడలేక గమనింప నేర్తు
నాకేమి యానతి నరనాథ యనినఁ
గాకుత్థ్సపతి విని కరుణతోఁ బలికె
నగుఁగాక గైకొంటి నతనివాక్యములు
తగవున నే నిన్నుఁ దలఁచిన యపుడు
రమ్ము నీకిమ్మైన రమ్యదేశమున
సమ్మదంబున నీవు చరియింతుగాక
యని గంధపుష్పలాజాదులం బూజ
లొనరించి వీడ్కొల్ప నుడురాజవీథి
రాజమానానేకరత్నదీధితులఁ
దేజరిల్లుచుఁ దూర్పుదిక్కున కరిగె
నాలోన భరతండు హస్తముల్‌ మొగిచి
భూలోకపతితోడఁ బొలుపారఁ బలికె
పూజితధర్మైకబుద్ధి పెంపెసఁగి
రాజన్యవర నీవు రాజ్యంబు సేయ
నేరోగములను లే వెల్లభూజనులు
నార నాయుష్మంతులగుచున్నవారు
కాలంబు దప్పక కడిమిమై వాన
లోలిమైఁ గురియించుచుండు నింద్రుండు
పాయక సుఖతరస్పర్శంబులగుచు
వాయువు లెలమితో వర్తించుచుండు
దెసలఁ గీర్తులు నిండఁ ద్రిదశులు మెచ్చ
వసుధఁ బాలించుచు వర్తించునట్టి
రాజులలో నిట్టి రాజెందుఁ గలఁడు
రాజాధిరాజైన రామచంద్రుండ
యని సంతసిల్లుచు నఖిలలోకులును
వినుతి సేయుదురంచు విన్నవించుటయుఁ
గుండలమణికాంతిఁ గొమరారుచున్న
గండభాగంబులఁ గడునవ్వు మెఱయ
భరతు వాక్యములకుఁ బ్రమదంబునొంది
ధరణిఁ బాలించుచుఁ దగనొక్కనాఁడు
విద్యాధరాదులు విహరించు నింద్రు
నుద్యానవనమన నుల్లసిల్లుచును
ధరణికిఁ దొడవైన తన వనంబునకు
ధరణిజ తోడరా ధరణీశుఁ డరిగి
పొరి నశోకంబులుఁ బోక బోదియలు
సురగలుఁ బొన్నలుఁ జూతపోతములుఁ
బనసలు నరఁటులుఁ బగలు చీఁకట్లు
గొను తమాలంబులుఁ గోవిదారములు
దాడిమంబులు నారదములుఁ బెంపొందు
నీడలు నిమ్మలు నింబభూజములు
మాతులుంగంబులు మంచి నేరేళ్ళు
నాతతమోదములయిన కేతకులు
మాటికిఁ దనుతావి మారుతంబునకుఁ
బాటిల్లఁ బూచిన పాటలీతరులు
నాగకేసరములు నవకంబులైన
సాగు కింజల్క కేసరవృక్షములును
కడలేని కడుములు కర్ణికారములు
కడునొప్పు బొగడలు ఖర్జూరములును
గొరవులు నెరవులు గురువిందపొదలు
నరుదుగాఁ బొదలిన యంబాళములును
లలి నొప్పు నుద్యానలక్ష్మికి నవియ
తిలకంబు లననొప్పు తిలకభూజములుఁ
గమ్మతావులు దిశల్‌ గలయ వాసించు
సమ్మదం బొనరించు చంపకంబులును
హింతాళతాళము లెడనెడ మఱియు
వింతలై కనుపట్టు వివిధవృక్షములుఁ
దరగని నెత్తావి దనరు క్రొవ్విరులు
గిరిగొన్న నవలతాగేహవాటికలుఁ
గమలముల్‌ పగళులు కలవలు రేలు
నమరంగ మకరంద మందంద దొరఁగ
వెలితి గానఁగరాని విమలపూరములఁ
బొలుచు వీచుల రాలు పుప్పొళ్ళజడియుఁ
గలహంససారసకారండవాది
కలకలారావముల్‌ గల కొలంకులును
నాదటఁ దనరుచు నవ్యరత్నముల
వేదికాతలములు వేడ్కలు వెనుప
మనసులు గలఁగ మన్మథుఁడు దర్పింప
వనజలక్రీడల వాంఛతోఁ జలిపి
యావనమధ్యంబునం దొక్క చోటఁ
బావనసమతలస్ఫటికవేదికను
బఱచిన రత్నకంబళముపై విరులు
పఱచినఁ గూర్చుండి పరమానురక్తి
మాకందమకరందమధువులు గ్రోలి
జోకలై తుమ్మెదల్‌ శ్రుతిఁగూడి మెఱయ
సరసగీతంబులఁ జారు లాస్యముల
నరుదార హృద్యంబులైన వాద్యముల
గణికాజనులు దన్నుఁ గదిసి మెప్పింప
మణిభూషణాదులు మది కింపు నొసఁగఁ
పురజను లలరంగ భూపుత్రితోడఁ
బురమున కేతెంచి భూలోకవిభుఁడు
నిర్మలతరనీతినిష్ఠాత్ముఁడగుచు
ధర్మక్రమంబున ధర నేలుచుండె
నిచ్చలు సీతయు నియతవ్రతంబు
లచ్చుగాఁ గైకొని యంద ఱత్తలకుఁ
బరమపావనమైన భవ్యశీలమునఁ
బరిచర్య సేయుచు భక్తి మ్రొక్కుచును
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )