| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
బ్రకటితభోగసౌభాగ్యసంపదల నొక కొఱఁతయులేకయున్న దేవారిఁ గనుఁగొని చూపోప కట యొక్కనాఁడు తన మదిలోనున్న తలపెల్లఁ దెలియ ధరణిజతో వినోదంబుగాఁ గడఁగి కరమర్థిఁ బలికె నక్కజము దీపింప నోరామ కుంభజుం డొగి శంబరారి యారామకంటెఁ జెల్వైన కామినుల నేమానవులకును నెఱుఁగ రాకుండఁ గామరూపంబులు కరము శోభిల్లఁ దనరారు వారినిద్దఱి నిచ్చుటయును మనమున నరలేక మైత్రితో వారు బాణాకృతుని రామభద్రునియొద్ద నేణాక్షులుండుట యెఱుఁగుదొ లేదొ యనవుడు సీత దానాత్మలో నిట్టి పనియెట్లు రామభూపతి కెట్టు లోర్వ కాడిననాడె నేమనవచ్చు నల్ల నాఁడంత చేసిన నాతి యౌఁగాదొ యని చింతయును మోద మటు పురికొనఁగ వనజాక్షి యత్తల వరుస వీడ్కొనుచుఁ గడుమోదమునఁ దొంటికంటె శోభిల్లఁ దొడి పూసికట్టి కౌతూహలంబొప్పఁ గాకుత్స్థుఁడున్న యేకాంతపుటింటి కాకందువులకేగి యతివినోదములఁ బ్రియునకుఁ బ్రియముగాఁ బ్రియగోష్ఠి సలిపి ప్రియు చిత్త మెఱిఁగి సంప్రీతి నిట్లనియె దేవర యేకపత్నీవ్రతుండనుచు క్ష్మావరజనులు నక్కజముగా ననెడి పలుకు బొంకని కానఁబడుఁ జిత్రగతుల వలఁతులై మనుజు లెవ్వరు నెగ్గకుండ లలితవిలాసినులైన కామినులు గలరఁట నీయొద్దఁ గమలాప్తవంశ యనవుడు రఘురాముఁ డవనీతనూజఁ గనుఁగొని నీకు బొంకఁగ నేల వినుము గొనకొని యొకనాఁడు కుంభసంభవుని గన వేడ్కఁ జని నమస్కారంబు సేయ సంతుష్టహృదయుఁడై సన్మునీశ్వరుఁడు నంతట నొకవిల్లునమ్ములు రెండు వలనొప్పగాఁ దెచ్చి వరుసతో నాకు నలవడ నొసఁగుచో నాతఁ డిట్లనియె నీబాణరాజంబు లెలమితో మీకుఁ బ్రాబల్యముగ నెల్లపను లొడఁగూర్చి నీకును నాధరణీతనూభవకుఁ జేకొని పుత్త్రులై చెలఁగి జన్మించి భువనంబులౌననఁ బొగడతకెక్కి యవనికి రాజులై యతిశయిల్లఁగను గలరంచు నిచ్చినఁ గైకొని యేను తలపోసి వానివిధంబెల్లఁ దెలియు కొఱఁకునై యవి దాచికొన్నాఁడఁ గాని తరళాక్షి యొండువిధంబు లే దనుడు నవి యెవ్వియనిన రామావనీశ్వరుఁడు కవదొనలోన నొక్కటి వెల్గుచున్న పసిడిపింజెలచేతఁ బ్రభగలయట్టి విశిఖంబు లవి యని వ్రేలఁ జూపుటయు నోనరనాథ యీయురుసాయకములు మానినులై యుండు మార్గమెట్టిదియొ కావింపవలయు వేడ్కయ్యెడుఁ జూడ నావిధంబంతయు ననిన రాఘవుఁడు తన మది నూహింపఁ దచ్ఛరద్వయము వనితాకృతుల్ దాల్చి వచ్చి కేల్మొగిచి తమ యున్న దొనకు నత్తఱి నేగి తొంటి క్రమముననున్న యగ్గలికయుఁ జూచి యాలోన వెఱఁగంది యమ్మహాదేవి పోలంగ మును విన్న పొందుగా నెఱిఁగి మనమునఁ దలపోసి మఱియొక్కనాఁడు మొనయు రోషమున రాముని గానకుండ నాయంపదొనఁ జేరి యందున్న కపట సాయకంబులఁ జూచి చయ్యన దిగిచి ధళధళ యను మించుతళుకుల నొప్పు నలుగుల నూడ్చి కోలలనందె దాచి వడిఁ గొంచుఁబోయి యెవ్వరు లేనిచోట బొడిపొడి సేసి యాపొడి నీళ్లఁ గలపి త్రావెఁ ద్రావుటయు నాతాపసాధీశుఁ డావసుధేశుతో నాడినయట్లు చపలాక్షియగు సీత జఠరంబులోన నపుడు బాణములు పిండాకృతిఁ దాల్చె శుకవాణికిని గర్భశుభసూచకములు నకలంకగతిఁ జూడ నమరె నందంద నడుమనుమానంబునకుఁ బాసె నంతఁ గడుఁదోరమగుచు నాకాశంబు మీఁది సుడి విస్తరిల్లె భూసుతకుఁ జిట్టుములు బెడిదంబుఁ గాగ ముప్పిరిఁ బేనినట్టు లారు నీలచ్ఛాయ నమరె దేహంబు భారంబు గాఁగ షట్పదములు హేమ కలశాగ్రముల నున్న గతి గల్గె పద్మ దళనేత్రకును గుచద్వయ మొప్పుచుండె నివ్విధంబునను మహీపుత్రి వేడ్క మువ్వు రత్తలకును మ్రొక్కి యొక్కప్డు మణిభూషణంబుల మహితమాల్యములఁ బ్రణుతాంబరంబుల భవ్యగంధములఁ బొలుపారఁ గైసేసి భూనాథు కడకు నెలమి నేతేర నయ్యినకులోత్తముఁడు కేళిగృహంబులఁ గృతకశైలములఁ నోలిఁ గొలంకుల నుద్యానములను నలరారు నిష్టంబులగు వినోదములు సలుపుచుఁ బదివేలసంవత్సరములు వసుధఁ బాలించుచు వదనాబ్జ మలర వసుధేశుఁ డొకనాఁడు వైదేహిఁ జూచి కమలాక్షి నీయందు గర్భచిహ్నములు కొమరారుచున్నవి కుశలంబు లగుచు నెయ్యది కోర్కి నాకెఱిఁగింపుమనిన నొయ్యన నగవుతో నుడురాజవదన యెలసిగ్గుచూపుల నిలఁ గనుంగొనుచుఁ దలవాంచి యొక్కింత తడవూరకుండి దేవ భాగీరథీతీరదేశమున వావిరిఁ దాపసవనభూములందు ఫలములు సేవించి భక్తి నమ్మునులఁ గొలువంగ నొకనాఁడు కోర్కి నాకనియె ననవుడు నౌఁగాక యని పల్కి మఱియు మనుజేశుఁ డాస్థానమండపంబునకు నరిగి కొల్వైయున్న యవసరంబగుట పరికించి విజయుండు భద్రుండు గురుఁడు |