| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
మతిమంతుఁడును నిద్ధమతివిరాజితుఁడు మతివిశాలుండగు మాధవాఖ్యుండుఁ గశ్యపుండనువాఁడు గాధిపింగళుఁడు వశ్యవాక్యుండును వజ్రదంతుండుఁ బరిహాసదశకళాపారీణులగుచు నరనాథుఁ డలరంగ నవ్వులఁ గథల నొగిఁ బ్రొద్దుపుచ్చుచు నుండి రాలోనఁ దగ భద్రుఁ గనుఁగొని ధరణీశుఁ డనియెఁ క్రొత్తరాజ్యంబైనఁ గూడి భూజనులు క్రొత్తలు ఘటియించి కొన్ని యాడుదురు నా రాజ్యమెట్టిదో నన్ను నా పురము వారు దేశంబులవారు నేమండ్రు మా మాతలగువారి మా సహోదరుల నేమండ్రు వైదేహి నేమండ్రు చెపుడ యనవుడు భద్రుండు హస్తముల్ మొగిచి జననాథ చెప్పెద సత్యవాక్యముల నినసుతుఁడాదిగా నెల్లవానరుల ఘనులైన ఋక్షులఁ గడిదిరాక్షసుల దనవారిఁ జేయుట దారుణంబైన వనరాశి గట్టుట వడినెత్తి చనుట యఖిలలోకద్రోహియైన రావణుని సఖులతో సుతులతో సచివులతోడ వారణంబులతోడ వాజులతోడఁ దేరులతోఁగూడఁ దీవ్రబాణముల ఖండించివైచుట కడిది రాక్షసుల దండించి లోకముల్ దయఁ గాచుటొప్పుఁ బట్టిన చెఱవోయి పగవాని యింట నట్టున్న జానకి ననురక్తుఁడగుచుఁ గోపమంతయుఁ దక్కి కొనివచ్చి కుసుమ చాపునిచేఁ జిక్కి చాపలం బెసఁగఁ బ్రియము దలిర్ప నా పృథివీతనూజఁ గయికొని యున్నాఁడు కాకుత్థ్సుఁ డెలమి మనమునఁ గాంతల మార్తురు గొన్న మనకు నిట్టిదిగాదె మనరాజు గుఱిచి యను నివిలోనుగా నల్పవాక్యములు మునుకొనిపురజనుల్ మూకలు గట్టి రచ్చల వీథుల రాజేంద్ర నిన్ను నచ్చటనచ్చట నాడుచుండుదురు దేవ మీయానతిఁ దెగి చెప్పవలసె నీవిధంబునను ననిష్టోక్తు లనినఁ గడు నప్రియంబులై కర్ణరంధ్రములఁ బడిన యామాటలు పదిలుఁడై సైఁచి యిదియేమి తెఱఁగన్న హితులు బాంధవులు నిది నిక్కమని పల్కి రిరుగేలు మొగిచి జనలోకవిభుఁ డంత సడికిఁ జిత్తమున వనటఁ బొందుచు నెల్లవారి వీడ్కొలిపి దౌవారికుని జూచి తగఁ జేరఁ బిలిచి నీవు నా తమ్ముల నిర్మలమతులఁ గడువేగఁ దెమ్మని కాకుత్స్థుఁ డనుప .......... విన్నఁబోయిన మోము విధమెల్లఁ జూచి యన్నకు మ్రొక్కుచు నంతంత నిలిచి యిది యేమొకో నేఁడు హృదయంబులోన నొదవిన చింతతో నున్నాఁడు విభుఁడు |