| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నాకలోకాంగన నరలోకమునకు నేకారణంబున నేతెంచినదియొ యేరాజుదేవియొ యిందిరాదేవి గారవంబున నొప్పు గలదొక్క వనిత యొక్కతెయును నాశ్రమోపాంతభూమిఁ బెక్కుభంగుల విలపించుచున్నదియు శోకాతురుల దయఁ జూచి రక్షింప మీకు ధర్మముగాన మీరేగవలయు ననిన నావాల్మీకి యంతయుఁ బ్రేమ విని నిర్మలజ్ఞానవిధిని నీక్షించి జననుతుండగు రామచంద్రుని దేవి యనఘవర్తన సీతయని నిశ్చయించి నిమిషంబు నిలువక నిజనియోగమున నమరఁ గాంచనపాత్ర నర్ఘ్యంబుఁ గొనుచు వేగంబ శిష్యులు వెనుక నేతేర భాగీరథీసమీపమున కేతెంచి యక్కడఁ బలుమాఱ నరదంబు చన్న దిక్కుఁ గన్గొనుచును దిగని శోకమున రాసిన యెలుఁగును రథమార్గధూళి దూసరంబగు మేనఁ దూలి పైకొంగు తుంగ స్తనంబులఁ దోఁగ నందందఁ దొంగలి ఱెప్పలం దొరఁగు కన్నీరుఁ గెంగేలు సెక్కున గిరి గొన్న వగలఁ బ్రుంగిన మనసునై పొగులు భూసుతను నంగనామణిని బద్మాయతనేత్ర .......... రవికులోత్తముఁడైన రాముని దేవి భువనైకపావని బొడఁ గని కదిసి నప్పు డశ్రులు రాల నద్దేవి ఱెప్ప లప్పళించుచుఁ జూచి యమ్మునీశ్వరుని నడుగులముందట నవనిపై వాలి యడలంగఁ గరుణ నయ్యనఘాత్ముఁడనియె నిదియేల భూపుత్రి యింత శోకింప హృదయంబుఁ బదిలింపు హితబుద్ధి వినుము నీ శుభాచారంబు నిర్మలంబైన నీ శీలమును నొప్పు నీ గౌరవంబు ఘనుఁడైన రాముండు గనియు నొండాడ మునుకు నజ్ఞులనోళ్ళు మూయఁ జొప్పడక హృదయంబు గొని కాల్ప నీతెంపు సేసె నదిగాన దుఃఖించు టనుచితంబింక నీతపోవనము నీకిల్లు నీకేను మీతండ్రి ప్రతినిధి మిథిలేంద్రతనయ నరనాథుతోఁ గూడ నాడిందువచ్చి తరలాక్షి గనుఁగొన్నదాన వీవనము మాయాశ్రమంబున మహనీయశీల లైయున్న మునిపత్నులందఱు నీకు నుచితవర్తనముల నుచితవాక్యముల నుచితసత్కారంబు లొనరింపఁగలరు మనుజేంద్రతనయ వే మావనంబునకుఁ జనుదెంచి యందుండు సంతాపముడుగు పౌరుషంబునకంటెఁ బ్రబలంబు దైవ మేరూపమునఁ దప్పదిది దైవకృతము గాన విజ్ఞానంబు ఘనబుద్ధిఁ బూని జానకి వినుము నా సత్యవాక్యములు జనకుండు మీ తండ్రి సకలలోకైక వినుతుండు దశరథవిభుఁడు మీ మామ రాజేంద్రతిలకుండు రామచంద్రుండు తేజోభిరాముండు దేవి నీ విభుఁడు ఉభయవంశములు నీకుత్తమోత్తమము లభిమానవతివి నీవతిశుద్ధమతివి పంకజానన ముఖప్రక్షాళనాదు లింక నీకుచితంబు లెన్నిభంగులను బతివాక్యకరణంబు పరమధర్మంబు సతులలో నుత్తమసతివి నీవనుచు ననునయోక్తుల శోక మార్చి యర్ఘ్యంబు గొనుమంచు నిప్పించి గురుదయాబుద్ధి జనకజఁ దోకొందు సంయమీశ్వరుఁడు మునికుమారులు దన్ను ముదముతోఁ గొలువ వనమున కేతెంచి వచ్చి సద్భక్తిఁ దను గోరి మ్రొక్కిన తాపసాంగనలఁ గనుఁగొని యీబాల కళ్యాణి సీత జనకభూపతిపుత్రి సత్యశీలములఁ దద్దయ నుతిగన్న దశరథేశ్వరుని పెద్దకోడలు కీర్తి పెంపారుచున్న రాముని దేవి యీరమణికి మీరు సేమమారఁగ రక్ష సేయంగవలయుఁ జెఱనున్న సతిఁ దెచ్చి చేపట్టెననుచు నెఱుఁగని జనులెల్ల నెగ్గాడు టెఱిఁగి లోకాపవాద మాలోకించి మనుజ లోకేశుఁ డుత్తమశ్లోకుండు గాన సడి కోడి పనిచిన సౌమిత్రి దెచ్చి యడవిని సతి డించి యాజ్ఞమైఁ జనియె మిథ్యాపవాదంబు మిన్నక యున్నఁ దథ్యమైనట్లుండు ధరలోన ననుచు నినకులాధీశ్వరుం డీ తెంపు సేయఁ బనిచినాఁడటు గానఁ బరమానురక్తి మునిపత్నులార యీముద్దియ మీరు కొనిపోయి మన్నించుకొని యుండఁదగును వగవకుండఁగ నెమ్మి వర్తింపుఁడనిన నగుఁగాకయని మ్రొక్కి యాతపస్వినులు ధరణిజఁ దోడ్కొంచుఁ దమ నివాసముల కరిగి యద్దేవికి నధికమోదమున నుచితోపచారంబు లొనరించుచుండ నచట వాల్మీకియు నర్థితో నుండె |