| ఇతిహాసములు | రంగనాథరామాయణము | ఉత్తరకాండము |
|
నంత నయోధ్యకు నరదంబు చనఁగఁ జింతాపరంపరం జెంది లక్ష్మణుఁడు నాసుమంతునితోడ ననియె భూజములు దోసంబులాడిన దుష్కీర్తి కోడి జనకజ పావనచరితంబు మొదలఁ గనియును నీ తెంపుఁ గావించె విభుఁడు క్రూరమృగవ్యాళఘోరకాంతార దారుణావస్థకుం దగునె యాసాధ్వి యెందున నిదిపాప మీపాపఫలము బ్రందిన జనులకో పార్థివేంద్రునకో యనఘాత్ముఁ డారాముఁ డపవాదభీతుఁ డనవుడు నాసూతుఁ డనియెఁ గేల్మొగిచి యేమిటి కీవెంట నింతశోకింప సౌమిత్రి మదిలోన సంతాపముడుగు మీ తండ్రి దశరథ మేదినీనాథుఁ డాతతబుద్ధిమై నడిగినఁ దొల్లి యది రహస్యంబైన నాదేవమంత్రి సుతుఁడు దూర్వాసుండు సూచించినాఁడు అది నీకు నెఱిఁగింప నవసరంబగుట విదితంబుగాఁ జేతు విను గోప్యముగను గురునమస్కారంబు కొఱకొక్కనాఁడు ధరణీశనందన దశరథేశ్వరుఁడు రమణీయగతి నేగె రథ మేను గడప నమర వసిష్ఠుని యాశ్రమంబునకు ననఘుండు దూర్వాసుఁ డంతకుమున్ను చనుదెంచి యందొక్క సంవత్సరంబు నెమ్మి వసిష్ఠుండు నిలుపంగ నిలిచి సమ్మదంబున నున్న సమయంబునందు వసుధేశుఁ డాశ్రమవనసమీపమున నసమానరుచిఁ బొల్చు నరదంబు డిగ్గి చని యావసిష్ఠుని చరణాబ్జములకు ననఘాత్ముఁడై మ్రొక్కి యర్కతేజమున వ్రాలు నమ్మునిముఖ్యు వామభాగమున నాలోలకీలోగ్రమగు నగ్నిభంగి నమరు దుర్వాసున కవనతుండగుడుఁ గొమరార వారును గుశలంబులడిగి యధికప్రియంబున నర్ఘ్యపాద్యములు మధురఫలాదులు మానుగా నొసఁగి యుచితాసనమ్మున నుండంగఁ బనిచి యుచితప్రసంగంబు లొండొండఁ దిగిచి ధర్మకథాగోష్ఠి దగిలియుండఁగను ఘర్మదీధితివోలె గహనమధ్యమున నయ్యెడ ముకుళితహస్తాబ్జుఁడగుచు నయ్యత్రిపుత్రుతో నవనీశుఁడనియె నెందాఁక వర్తించు నీరవికులము ఎందాఁక రాఘవుండీ నేల నేలు నా తనూజుఁడు రామునకు మహీసుతకుఁ బూతాత్మ యెందఱు పుత్రులయ్యెదరు తనరిన యాసుతుల్ ధర్మవర్తనల ననఘాత్మ యెబ్భంగి నవని నేలెదరు మఱి వీరి యాయుఃప్రమాణంబులెంత యెఱుఁగ నిష్టము నాకు నెఱిఁగింపుమనిన రఘుకులస్థితియు నారాము వర్తనము నఘదూరయగు సీతకయ్యెడు దశయు మొదలుగా సకలంబు మునిపుంగవుండు విదితంబుగాఁ జెప్ప విని రాజు నలరి తన పురి కేతెంచెఁ దక్కిన కథల పనియేమి విన నీకుఁ బార్థివతనయ నిండార రాముఁడు నెమ్మితోఁ బదునొ కొండువేలేఁడులు కువలయంబేలుఁ బెక్కండ్రురాజులఁ బృథివిపై గెలుచుఁ బెక్కశ్వమేధముల్ పెంపారఁ జేయుఁ బుడమికి రాజుగా భూపుత్రిపుత్రుఁ గడువేడ్కఁ బట్టంబుఁ గట్టు నయోధ్య పటుకీర్తి నటుమీఁద బ్రహ్మలోకమున కటమీఁద వైకుంఠమను పేరు గలిగి నిరవద్యమగుచున్న నిజలోకమునకు హరిమూర్తియగు రాముఁ డరుగంగఁ గలఁడు తొల్లి యీవిధమెల్ల దూర్వాసుచేతఁ దెల్లమైనదిగాన ధృతిఁ బూనవలయు నాదిత్యకులవిభుఁడగు రామువలన వైదేహి దిక్కున వగపు నీవుడుగు పౌరుషంబునకంటెఁ బ్రబలంబు దైవ మారయఁగా నున్న యదియుఁ దానయ్యె ననవుడు మునిముఖ్యు నాదేశమునకుఁ దనలోన వెఱఁగంది దశరథాత్మజుఁడు తాలిమి పదిలించి తగుమాటలాడు నాలోన దిననాథుఁ డస్తాద్రి కరిగె నారాత్రి గడచిన నంత వేగుటయు దేరు సుమంతుండు దెచ్చిన నెక్కి మఱునాఁ డయోధ్యకు మధ్యాహ్నవేళ నెఱయంగ నేతెంచి నిర్విణ్ణుఁడగుచు నేమనుచుండునో హృదయంబులోన నామాననిధి విన్ననైయున్న వదన మేమని గనుఁగొందు నేమందునోయి .......... యకలంకచరితగా వటు గనుఁగొనియు నకట మిథ్యానింద కతిసాహసమున జనకజఁ బాసె నా జననాథుఁడనుచుఁ జనుదెంచి యరిగి మోసల తేరు డిగ్గి |