ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
శుకసందేశము
“జని వేగ వానరసైన్యంబు సొచ్చి
యినసుతుతోఁబ్రియంబేర్పడఁబలికి
పగలేమిఁజెప్పి యా భానునందనుని
మగుడించి రమ్ముక్రమ్మఱఁ;బొమ్ము; లెమ్ము.”
అన విని యతఁడేఁగి యర్కజుఁగాంచి
యనియె రావణుచెప్పినంతయుఁదెలియ:
“వైరంబు సేయ రావణుతోడ నీకుఁ
గారణంబేమి యర్కజ! నాకుఁజెపుమ?
వాలి మీ యన్న నా వలవదు; వినుము
వాలికి నీకును వైరంబు గలదు.
వాలి యా దానవేశ్వరుపగవాఁడు.
చాల రావణుతోడ సంధి నీ కమరు.
రావణుఁ డీ రాము రామఁదెచ్చుటకు
నీ విట్లు రాఁదగునే? కపిరాజ!
యనిఁగుబేరుని నోర్చి యా పుష్పకంబుఁ
గొనిన రావణు నెఱుంగుట లెస్సగాదె?
యట్టేల, హరుతోడ నయ్యద్రి నెత్తి
నట్టిరావణుఁడల్పుఁడా కపిరాజ!
దేవేంద్రుఁడాదిగా దివిజులనెల్ల
నా విధంబున గెల్వఁడా296వానరేంద్ర!
కొలఁది మీఱిన హోమకుండంబునందుఁ
దలలు ఖండించి297యుద్ధతగతి వేల్చి
జలరుహసంభవుఁజాల మెప్పించి
వెలయంగఁద్రైలోక్యవిజయంబుఁగొనఁడె?
హీనమానవునితో నేటిసఖ్యంబు?
దానవేశ్వరుతోడఁదగఁజేయు సంధి.”
ననవుడుఁగోపించి యగచరులెల్ల
వినువీథి కెగయుచు వెస వానిఁబట్టి
బెడిదంబు298గాఁబెక్కుపిడికిళ్లఁబొడిచి
కడు299మాఱుమసఁగి ఱెక్కలుద్రుంచివైచి
ముక్కును జెవులును మొగిఁగోసివైవ
నొక్కటఁగడఁగిన నుదరి రాఘవుఁడు:
“దూత నేటికి నింత దొసఁగులఁబెట్ట
బ్రాతిగా వీని నేఁపక పోవనిండు.”
అనవుడు రఘురామునానతి కులికి
వనచరులందఱు వానిఁ బోవిడువ
వినువీథి కెగసి యా వినువీథి నుండి
యినసూనునకు శుకుఁడేర్పడఁబలికె:
“రావణుతోఁగపిరాజ! యేమందు?”
నావుడుఁదారాధినాథుఁడు గినిసి:
300తా నెంచ ద్రోహి యీ ధరణీశ్వరునకుఁ
గాన యా ద్రోహినిఁగని సైఁప301ననుము.
సురిగి యే లోకంబుఁజొచ్చిననైనఁ
బొరి302గొందుఁగాని 303యేఁబోవనీ304ననుము.
పటుకార్ముకంబు యూపంబుగా నిలిపి
చటులాస్త్రములు పరిస్తరణముల్‌ సేసి
305పరగఁగెంధూళులు ప్రభలు గావించి
తరు306చర స్రుక్‌ స్రువతతులు చేపట్టి
సమరభూవేదికాస్థలమున 307నుండి
యమరులకెల్లఁబ్రియంబెక్కుచుండఁ
గరమొప్ప వీరాంగకంబులఁబెల్లు
దొరుగుచునున్న నెత్తురు నేయి గాఁగ
మహితగుణధ్వనుల్‌ మంత్రముల్‌ గాఁగ
బహురాక్షసశ్రేణి పశుకోటి గాఁగఁ
దనరెడు సింహనాదధ్వనుల్‌ 308పేర్చి
యనిమిషావలికి నాహ్వానంబు గాఁగ
విడువని కాహళవితతులమ్రోఁత
కడునింపుగా సామగానంబు గాఁగ
ఘనమైనరామలక్ష్మణుల కోపములు
మునుకొని నా కోపమును గూడఁబర్వి
యనుపమత్రేతాగ్నులై 309యుండ నందుఁ
దనదుప్రాణంబు లత్తఱి నాహుతులుగ
రణమునఁ దన వీరరసమడంచుటయె
ప్రణుతింపఁగా సోమపానంబు గాఁగఁ
బ్రకటరాక్షసవీరపశుపలలముల
సకలభూతవ్రాతసం310తృప్తి గాఁగ
విడువక సంగ్రామవిపులయజ్ఞంబుఁ
గడు నొప్పఁజేయు రాఘవసోమయాజి.
యటు గాకమున్న సీతాంగనఁదెచ్చి
యిటయిచ్చి బ్రదుకుట యిది బుద్ధియనుము.”
అని పేర్చి సుగ్రీవుఁడాడు వాక్యములు
విని శుకచారుండు వేగంబె పోయి
యంత వృత్తాంతంబు నా రావణునకు
మంతనంబునఁజెప్పె. మఱి రాముఁడిచట

  1. దైత్యవిభుఁడు
  2. యుద్ధతి వేల్చి
  3. లైనట్టి
  4. దయమాలి
  5. తానుద్రోహుఁడు రామధరణీనాథునకుఁ
  6. ఁడనుము
  7. గొనుఁ
  8. నిన్‌
  9. ఁడనుము
  10. పరగెడుకెంధూళి
  11. చరుల్‌
  12. నుండ-న
  13. పేర్మి
  14. మండుచుండ
  15. తృప్తులెసగ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )