ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రాముని ధనుర్విద్యాకౌశలమును రావణుఁడు గొనియాడుట
“నల్లవో రఘురామ! నయనాభిరామ!
విల్లువిద్యగురువ! వీరావతార!
కరశరలాఘవక్రమకళానిపుణ!
స్ఫురదురుచాపసంశోషితకృపణ!
భుజసారదృఢ 663ముష్టిభువనవిఖ్యాత!
విజిత రిపువ్రాత! విజయసమేత!
మానవ రాజకుమారకంఠీర
వా! నవ్యదివ్యశస్త్రాస్త్ర సంపన్న!
స్ఫారఘోరాక్షయబాణతూణీర!
వీరాగ్రగణ్య! యో విశ్వశరణ్య!
బాపురే! రామభూపాల! లోకముల
నీ పాటి విలుకాఁడు నేర్చునే కలుగఁ.
బాటించి పురములపైఁబడ్డహరుని
యే టొప్పు; 664నిందు నీ యేటొప్పుఁగాక.”
యనియని పదినోళ్ల నందంద పొగడ
విని మంత్రు లా దైత్యవిభున కిట్లనిరి:
“పగవాని నీ రీతిఁబంతంబు విడిచి
పొగడుదురే దైత్యపుంగవ? యిట్లు
పొగడిన భయ మందఁబోలు నటంచుఁ
బగవారుఁదనవారుఁబలుచఁగాఁజూతు;
రది665గాక, రాచకార్యముగా.”దటన్న
మది నవ్వి యమరారి మంత్రుల కనియె:
“విలువిద్య666పెంపును విక్రమక్రమముఁ
గలితనంబును బాహుగర్వ667రేఖయును
నాదియౌగుణముల నధికుఁడైనట్టి
కోదండ దీక్షాదిగురునితో రాజ
వరునితో రామభూవరునితో668సురలు
హరిహరబ్రహ్మాదులైన నెంతయును
సాటియే యీ మూఁడు జగములయందు?
మేటి శూరులపెంపు మెచ్చంగవలదె?”669
యని నీతి సెప్పుచు నచ్చోటు వాసి
దనుజేశ్వరుఁడు వోయె. దనుజనాయకులు
తెగిపడ్డగొడుగుల తెఱఁగొప్పఁజూచి
మిగిలిన భీతిమై మెల్లనఁజనుచు
నట రాముశౌర్యంబు నతులవిక్రమము
పటుగతిఁబొగడుచుఁబలుదెఱంగులను:
“నా రాఘవుఁడు కరుణాంబుధి గాన
ఘోరబాణంబున గొడుగులే త్రుంచె
నటువంచివ్రేసిన నందఱతలలు
పటు670తరంబుగ నుచ్చి పాఱవే?”యనిరి

  1. దృష్టిముష్టి
  2. ఁగడిఁది, నేఁడు
  3. గాన
  4. నేర్పును
  5. రాజసము
  6. నొరులు - పరికించి చూడ నే పట్టుననైన, సాటి…
  7. పగవాని మగఁటి మేర్పడఁ బొగడుటయు (మి పతి యెంచుటెల్ల)- ఁదగ దాపురముసుమ్ము ధాత్రిలోఁదనకు- నని…
  8. రయంబునఁద్రుంచి (దెగి) పారదే యనిరి
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )