| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
“బదిలంబు దప్పి యిబ్భంగి శోకించె; దిది యేమి దేవ! నీ వితరులభంగి? వనజాసనునిచేత వరమునఁగొన్న ఘనశక్తి నీయందుఁగలిగియుండంగ నవిరళ మంత్రపూతాస్త్రముల్ వజ్ర కవచంబు నీయందుఁగలిగియుండంగ నురుతరగతిగల యుజ్జ్వలరథము గరమొప్ప నీయందుఁగలిగియుండంగ శోకింతురే? నిన్నుఁజూడు మొక్కింత! నీ కెదురెవ్వరు నిర్జరవైరి! వేవేగ నవలీల వెడలి రాఘవుని నీ విక్రమంబున నేలపైఁగూల్పు. మిట శోక ముడుగు మీ; వింతియచాలు. నట యేనుఁబోయి మహాజిరంగమున నతులవిక్రమకళాహంకారవృత్తి నతిశూరుఁడితఁడన నందంద పేర్చి గరుడుండు పాముల ఖండించుమాడ్కిఁ దరుచరావళి నెల్ల ధరణిఁగూల్చెదను. సురపతి1310వృత్రుని స్రుక్కించుభంగి హరుఁడంధకాసురు నణఁగించుకరణి రామునిఁద్రుంచెద రణములో నిప్పు; 1311డీ మెయిఁబోయెద నెలమి నన్నంపు.” మనఁగ రావణుతోడ నప్పుడు కడఁగి ఘనబాహుబలుఁడతికాయుండు వలికె: “నింతశోకింపంగ నేటికి నీకుఁ? బంతంబుతో దైత్యబలము1312లఁగూడి యేనె పోయెద; నంపుమిట; చిత్రముగను గాననంబుల నేర్చుకార్చిచ్చు పగిది విపులబాణంబుల విశదంబుగాఁగఁ గపులతో రామలక్ష్మణులఁద్రుంచెదను.” నని పల్కునపుడు నరాంతకుఁగూడి యనుపమబలుఁడు దేవాంతకుఁడనియె: 1313“నేమిద్దఱముఁబోయి యీ క్షణంబుననె రామలక్ష్మణుల మర్కటులఁద్రుంచెదము.’ అనిన మాటలకు దైత్యాధీశ్వరుండు దనశోక1314ముడిగి మోదంబున 1315నుండి తనయు1316లతోడను దద్దయు నొప్పె ననిమిషగణయుక్తుఁడగు నింద్రుమాడ్కి నవ్విధంబున నుండి యా రావణుండు నవ్వుచుఁగొడుకుల నలువురఁ1317బనిచె: “రామలక్ష్మణుల మర్కటసైన్యములను భీమాస్త్రములఁజంపి పేర్చిరం.”డనుచుఁ దన తమ్ములను మహోదరమహాపార్శ్వు లను వీడుకొలిపె నాలము సేయుటకును “మాకతంబుననె యీ మనుజాశనుండు చేకొని సీతకై శ్రీరాముఁదొడరె.” నని యరిషడ్వర్గ మా రావణునకు మునుమున్న రాము నిమ్ములఁదాఁకఁబోవు పగిది నా యార్వురు బ్రహ్మాండభాండ మగలంగ నార్చుచు నని కేఁగునపుడు భూరి 1318నీలాంబుదస్ఫురణంబు గలిగి యైరావతేభంబు నంశజంబగుచుఁ1319 దనరారుచున్న సుదర్శనేభంబు నినుఁడస్తశిఖరిపై నెక్కినకరణి నెక్కి మహోదరుండేపారి నడచెఁ. దక్కక నిశితాయుధంబులు వెలుఁగఁ బటు జవసత్త్వప్రభా1320వముల్ గలిగి చటులంబులైన యశ్వంబులఁ1321బూన్చి యెసగుచాపంబు నయ్యింద్రచాపంబు పస మీఱ, సూర్యునిభంగి వెలుంగు నరదంబుమీఁద నీలాభ్రంబుఁబోలి తిరమైన వేడ్కతోఁద్రిశిరుండు వెడలె. వితతధనుర్వేదవిద్యాఢ్యుఁడైన యతికాయుఁడును నప్పుడధిక తేజమున శరచాపఖడ్గాదిశస్త్రాస్త్రసమితి గరమొ1322ప్పు సూర్యప్రకాశమై వెలుఁ1323గఁ దనరారుకనకరథంబెక్కి వెడలె ఘనభూషణద్యుతిఁగనకాద్రి 1324యగుచు. సురవరఘోటకస్ఫురణఁ జెన్నొంది యురుభూషణప్రభ నుజ్జ్వలంబైన యవదాతహయము నరాంతకుండెక్కి ప్రవిమలతేజోవిభాసితుండగుచు శక్తి నుద్భటబాహుశక్తిమైఁదాల్చి శక్తిపాణియుఁబోలి సన్నుతి వెడలెఁ. దీపితగదఁదాల్చి దేవాంతకుండు రూపింప విష్ణునిరూపున వెడలె. గురుగదాపాణియై గుహ్యకేశ్వరుని పరుసున నట మహాపార్శ్వండు వెడలె. గాలచక్రంబులగతి నుజ్జ్వలంబు లై లీలఁబెక్కైనయరదముల్ వెడలెఁ. గొండలవడువునఁగోటానఁగోట్లు గండుమీఱిన మదగర్వ1325ంబు మిగుల దండిమై వెడలె నుద్దండహస్త దండంబు లొప్ప వేదండసంఘములు. హేషారవంబుల నెల్లదిక్కులను ఘోషింపఁజేయుచు గుఱ్ఱముల్ వెడలెఁ. గాలకింకరసమాకారంబు1326లగుచుఁ గాలుబలంబు లుగ్రత నేచి వెడలెఁ. జతురంగబలము లీ చందంబు నొంది యతులితంబగుటయు నప్పుడు నడుమఁ బ్రళయకాలార్కులభంగి నెంతయును వెలుఁగొంది రాదైత్యవీరు లార్వురును. నతిశుభ్ర1327మగు శరదభ్రంబు లొప్పు గతి వారి పుండరీకంబు లొప్పారెఁ. “గడిమిమై గెలుతుము; కాదేనిఁజత్తు; ముడుగ మెబ్భంగి రణోత్సాహ.”మనుచు నడచిరి కలనికి నానా విధముల నెడపక పంతంబు లిచ్చుచు వార. లప్పుడొండొరులయాహ్వానములను జెప్పఁజోద్యంబైన సింహనాదముల రథఘోషములను దురంగహేషలను బృథులదంతావళబృంహితంబులను గర ముగ్రమగుపదఘట్టనధ్వనుల నిరుపమధ్వజకింకిణీ నిస్వనములఁ బటహభేరీ శంఖభయద రావములఁ బటుతరనిస్సాణభాంకారములను దిక్కులు ఘూర్ణిల్లె; దివి పెల్లగిల్లెఁ; జుక్కలు డుల్లె; 1328వాసుకి యొడ్డగిల్లె; మేరువు గంపించె; మేదిని వడఁకె; భార మోర్వక దిగిభములు సలించె. |