ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
ఇంద్రజిల్లక్ష్మణుల ద్వంద్వయుద్ధము
గరవాల పట్టిస ఘనభిండిపాల
శరజాలముల మిమ్ము సమయింతు.”ననుచు
రోదసీకుహరంబు మ్రోయంగ సింహ
నాదంబు సేయుచు నానాశుగముల
వెస నేయుచును“బాహువిక్రమస్ఫూర్తి
నెసగు నా ముందఱ నెవ్వండు నిలుచు!’
ననవుడు లక్ష్మణుం డా దైత్యు1735తోడ:
“దనుజాధముఁడ! యీ వృథాగర్వ మేల?
చేరక యడఁగి మ్రుచ్చిలి పోటు వొడుచు
టే రణంబున పాఁడి; యే మగతనము?
నీ మాయలన్నియు నిరసించి నిలువు;
నా మార్గణములఁబ్రాణములు హరింతు.”
ననవుడుఁగోపించి యతనిపై నేసె
ఘనకాలసర్పప్ర1736కాండబాణముల.
నవి లక్ష్మణునిఁగాఁడి యవ్వల వెడలి
యవనీస్థలముఁగాఁడె నద్భుతశక్తి.
మఱియును వాఁడు లక్ష్మణదేవుమేన
గఱులాడఁగాఁ బెక్కు కాండంబు లేయ
వడి వచ్చి తాఁకి యవ్వల నుచ్చిపాఱ
వెడలు రౌద్రరసంబు వెల్లియపోలెఁ
గడుఁబెల్లు నెత్తు రంగంబుల వెడల
నడరంగ రాక్షసు లార్చుచు నుండ
జంకెలు నట్టహాసములు సేయుచును
లంకేంద్రతనయుఁడా లక్ష్మణుఁ1737జేరి:
“నరనాథసుత! నేఁడు నన్నాజిఁగదిసి
బిరుదవై యిటు విజృంభించిన నిన్నుఁ
దొలుతఁగత్తళముఁదుత్తునియలు సేసి
తలఁద్రుంచివైచెద దారుణాస్త్రములఁ;
బెనుపేది పడియున్న ప్రియసహోదరుని
నినుఁజూచు రాముఁడు నేఁ డవశ్యంబు’
నని పల్క లక్ష్మణుం డా నిశాచరునిఁ
గనుఁగొని: “యీ వృథాగర్వ మేమిటికిఁ?
బలుకులఁబనియేమి బవరంబులోనఁ
దొలఁగక నాతోడఁదొడరుదుగాక!
మాటలాడక వహ్ని మడియించుకరణి
మాటలాడక నిన్ను మడియింతు నిపుడు;
పనిలేనిపంతముల్‌ పలుకంగ నేల?”
యనుచు నుగ్రాస్త్రంబు లరిఁబోసి తిగిచి
ఘనతరభీషణాకా1738రుఁడై పేర్చి
కనుఁగవఁగెంజాయ గడలుకొనంగ
నమరంగఁగోపించి యర్కదీధితులు
గమియంగ దిక్కులు గలయంగఁబర్వ
విలయాగ్నికీలలు విస్ఫులింగములుఁ
గలఁగొనఁ1739దెరలెడు ఘనతరశక్తి
గలయమ్ము సంధించి కఱకురక్కసుని
యలఘువక్షస్‌స్థల మటు కాఁడ నేయ
దాన దైత్యుండు రక్తము1740గ్రక్కి మూర్ఛ
నూని యంతన తెల్వినొంది పెల్లార్చి
వాఁడిమి మిగులఁ దీవ్రంబున నేసె
మూఁడుబాణముల రామునితమ్మునురము.
నప్పుడు ధీరులై యధికరౌద్రమున
నిప్పులు గన్నుల నివ్వటిలంగఁ
జెలఁగు నయ్యిద్దఱసింహనాదములు
బలువిడిఁ1741బఱతెంచు బాణఘట్టనలు
నురుగుణస్వనములు నొక్కట నెసగ
నరయ1742ఁగాలుని యట్టహాసంబువోలె.
వెలసిన లావున విక్రమంబునను
బొలుపునఁజలమున భూరిరౌద్రమున
ననిశంబు వెలుఁగుచంద్రార్కులుఁబోలె
దనరు చతుర్దంతదంతులుఁబోలెఁ
గొమరారు సింగంపుఁగొదమలుఁబోలె
రమణఁగుమార తారకులునుఁబోలె
నేపారు వృత్రాసురేంద్రులుఁబోలె
రూపింపఁగాఁగాలరుద్రులుఁబోలెఁ
బాయని జయకాంక్ష1743ఁబ్రబలులై చెలఁగి
యా యిద్దఱును బోరి రప్పుడు చూడఁ.
1744గోపంబు నుద్దండగుణఘోష మెసగఁ
జాపరథధ్వజసహితంబు గాఁగ
నా మేఘనాదుని1745నమ్ముల బిట్టు
సౌమిత్రి ముంచిన సైరింప కతఁడు
ప్రతిసాయకము లేయ బలువిడిఁద్రుంచి
వితతంబుగా బాణవృష్టిఁగప్పుటయు
నా యింద్రజిత్తుండు1746నలవెల్లఁబొలిసి
యా యస్త్రములకు మాఱైనయస్త్రములు[వా.రా. సర్గ 89]
నెఱి నేయనేరక నిట్టూర్పు వుచ్చి
తఱిగొని చూడ నత్తఱి విభీషణుఁడు
సౌమిత్రిఁగనుఁగొని:”జననాథతనయ!
నీ మార్గణంబుల1747నిర్విణ్ణుఁడగుచు
దశకంఠసుతుఁడున్నదశ చూడుమిపుడు.
దశరథాత్మజ! రణస్థలి1748నీవు1749గెలువు.”
మనవుడు నుగ్రంబులైన బాణములు
గొని యంగకంబులు గ్రుచ్చిపో నేయ
నొక ముహూర్తము మూర్ఛనొంది1750వే తెలిసి
“యకట! మున్దేవాసురాదుల గెలిచి
పరికింప దైవంబు ప్రతికూలమైన
నరునకు నిటు నేఁడు నా కోడవలసె.
ననిలోన రాక్షసులందఱుఁబొలిసి
రినవంశజులచేత; నిఁక నేటిబ్రదుకు?”
అనుచుఁగోపమున నయ్యసురకంటకుఁడు
జననాథసుతుఁజూచి చల మగ్గలించి:
“నరనాథనందన! నా విక్రమంబుఁ
బరికించి నీ వింక బంటవై నిలువు.”
మనుచు నేడమ్ముల నతని నొప్పించి
హనుమంతుఁబదియింట నదరంట నేసి
వెస విభీషణుమీఁద విశిఖము1751ల్నూఱు
మసలక నిగుడించి మఱి విజృంభించెఁ.
గాకుత్థ్సతిలకుఁడాకడిమి గైకొనక
నా కీశరిపుఁజూచి నవ్వుచుఁబలికె:
“నధికుండు పంతంబు లాడక గెలుచు;
నధముండు పంతంబు లాడియు నోడు;
ననుచితస్థితి శూరులగువారు డాఁగ
రనిలోన; వంచించు టది1752బంటుతనమె?
కుటిలయుద్ధము సేయుక్రూరాత్మ! నీకుఁ
బటుగతి నిహమును బరము లే.”దనుచు
దినకరకరజాలతీవ్రార్చు లడరఁ
గనకపుంఖంబులు గలుగు బాణములు
వానిపై1753నిగుడించి వడి జోడు ద్రుంచి
మే నుచ్చి చనఁగ నమ్మెయిమఱు వపుడు
కాలోగ్రసర్పంబు కంచుకంబనఁగ
నా లోకనాభీలమై నేలఁబడియె.
వాఁడు వెండియు నొక్క వజ్రాంగిఁదొడిగి
వాఁడిబాణంబుల వడి నేయ నపుడు
పరువడి నొండొరుబాణఘాతముల
నురువడి1754వెడలెడు నురుశోణితముల
గైరిక నిర్జరకలితంబులైన
భూరిభూధరముల పొలుపుఁగైకొనుచుఁ
గరవేగశరవేగగతుల నేర్పులను
గరమొప్పఁబోరుచోఁగారాకు 1755డుల్లి
పూచిన కింశుక1756ంబులు గనుపట్టు
నా చందమున నొప్పి రస్త్రఘాతముల.
నమరగంధర్వాదు లచ్చెరువంది
సమరంబుఁజూడ నా సమయంబునందు
గలభవేష్టిత మత్తగజలీల మంత్రి
కలితుఁడై భీకరగతి విభీషణుఁడు[వా.రా. సర్గ 90, 92]
విలు గుణధ్వని సేసి విపులరోషమున
వెలుఁగుమంటలతోడి విశిఖంబు లేయఁ
బిడుగులు సఱచినపృథుల భూజముల
వడువున రాక్షసుల్‌ వసుధపైఁబడిరి.
అనలుండు మొదలుగా నతనిమంత్రులును
ఘనశూలపట్టిసఖడ్గఘాతముల
నెగడి రాక్షసకోటి నేలపైఁగలపి.
రగచరావలిఁజూచి యవ్విభీషణుఁడు
“నింక నీతనిఁజంపుఁడిందఱుఁబొదివి
లంకేశు బలమన్న లావన్న నితఁడె.
యని నీతఁడీల్గిన నద్దశాననుఁడు
తన సేనతోఁగూడఁ దా నీల్గినాఁడు.
మును బ్రహస్తుని వజ్రముష్టిఁబ్రజంఘు
డనువాని సుప్తఘ్నుఁడనువాని మఱియు
గుంభనికుంభుల ఘోరవిక్రములఁ
గుంభకర్ణుని మహోగ్రుని నతికాయు
వికటు మహాపార్శ్వు వెలయ ధూమ్రాక్షు
మకరాక్షుఁగ్రోధను మఱి శోణితాక్షు
యూపాక్షుఁద్రిశిరు మహోదరు నగ్ని
కోపుని దేవాంతకుని నరాంతకుని
ఖరు జంబుమాలి నకంపను మఱియుఁ
బరుషవిక్రములైన పగతురఁజంపి
యా హవసాగరంబవలీల దాటి
బాహాబలంబునఁబరగితి; రింక
సమయంబు మీకు లక్ష్మణునకు దాట
నమరంగ నింద్రజిత్తనుగోష్పదంబుఁ.
గొడుకుఁజంపఁగ నాకుఁగూడదు;వీఁడు
చెడునుపాయము మీకుఁజెప్పెద వినుఁడు:
హింస గావించిన నెదిరిచేఁబంచి
హింస సేయించిన నివిరెండు 1757సరియె.
యిది రాముకార్యార్థ; మిది లోకహితము;
నదిగాన పాతకంబైనఁ గానిండు;
సౌమిత్రిచే నేను జంపింతు వీని.
నే మాయలును గొల్ప విటమీఁద.”ననిన
జాంబవంతుఁడు ఋక్షసంఘముల్‌ గొలువ
నంబరంబగలంగ నార్చి రాక్షసుల
నగశృంగతరుషండ నఖదంతములను
బగతుఱ నవలీలఁబాల్పడి చొచ్చి
నొప్పింపఁగపులచే నొగిలి రాక్షసులు
నిప్పులు సెదరంగ నెఱిఁదారు ఘోర
పరశు ముద్గర శూల పట్టిస ప్రాస
పరిఘ1758శరాసనపాణులై బెరయఁ
బొరి సురాసురులకుఁబోలె నయ్యద్రి
చరనిశాచరులకు సంగ్రామ మయ్యె.
హనుమంతుఁడా సమయంబునఁగినిసి
ఘనుని లక్ష్మణు డించి కాలునిపగిది
నొక్కొక్క 1759వాటున నొక్కొక్కమాటు
పెక్కండ్రుదైత్యులఁబృథివిపైఁగూల్చి
శైలశృంగంబుల సాలవృక్షముల
లీలమైఁ1760జంపి బల్లిదుఁడు నై పేర్చె.
సరభసంబున విభీషణుఁడంత నలుక
నురుతరజ్యాఘోష మొనరించి మించి
తన మంత్రులును దానుఁదద్దయుఁగడిమి
దనుజులఁబెక్కండ్రఁదరమిడి చంపి
కరమొప్పు కనకపుంఖప్రదరములు
దొరిగించె నింద్రజిత్తుని మేనుగాఁడఁ.
దరమిడి వాఁడు నుదగ్రుఁడై 1761కినిసి
యరిదిశరంబు లేయఁగ నవి వచ్చి
పొరి విభీషణు నురంబున నుచ్చి పాఱి
ధరఁగాఁడ ధరణియుఁదల్లడపడియె.
దురము విభీషణుతో నింద్రజిత్తు
కర ముగ్రగతి నిట్లు కావించు చుండఁ
గనుఁగొని యపుడు లక్ష్మణుఁడు గోపించి
హనుమంతు నెక్కి తీవ్రాస్త్రసంతతులు
వడి మీఱి రాక్షసవరునిపై నేయఁ
గడు నొచ్చియును భయంకరముగా నపుడు
మగుడ వాఁడుజ్జ్వల మార్గణపంక్తి
మిగులంగ లక్ష్మణుమీఁదఁ బెల్లేసె.
నడరి యయ్యిద్దఱు నతికోపులగుచుఁ
గడిఁదిబాణంబు లుగ్రత నేయ నప్పు
డా యంపతండంబు లడరి యొండొరుల
కాయంబు లందంద కప్పిన నప్పు
డంబుధారలతోడి యంబుదంబులను,
నంబుదంబులతోడి యర్కచంద్రులను
బోలి; రామార్గణంబులు వచ్చుచున్న
యా లోనివేగ మేమని చెప్పవచ్చుఁ.
దొడిగినశరములు తొడిగిన1762యట్లు
విడువరొకో యనువిధమున నుండె.
నా రెండు తెఱఁగులయమ్ములు గగన
మారంగఁగప్పిన నడరెఁజీకట్లు.
వీరరసావేశ వివశత నెఱుఁగ
రైరి యొండొరుల మహాజిరంగమున.
నా యవసరమున నచ్చెరు వడర
వాయువు రణభూమి వర్తింపదయ్యె;
ననలుండు వెలుఁగొందఁడయ్యె దిక్పతులు
ననిమిష గంధర్వ యక్ష కిన్నరులు
సకల దేవతలును శరణంబు సొచ్చి
చకితాత్ములగుచు లక్ష్మణుఁబ్రశంసించి
యా లక్ష్మణునకు1763 జయంబుగా నపుడు
చాల దీవన లిచ్చి సంతోషమునను
“నతిలోకకంటకుఁడైన యా దైత్యు
మృతునిగాఁజేయు సౌమిత్రి, నీ.”వనుచుఁ

  1. ఁజూచి
  2. కార
  3. జీరి
  4. రతఁబేర్చి
  5. జెదరెడు
  6. గ్రమ్మి
  7. బరగించు
  8. మృత్యువున
  9. బలియురై పోర-నా… నొప్పిరప్పు
  10. గోపించి కోదండ
  11. నంపవర్షమున
  12. నలు
  13. నిర్వీర్యు
  14. వీని
  15. నొంపు
  16. యుఁదె
  17. లాఱు
  18. యొక్క గెలుపె?
  19. ఁగురియించి
  20. వెలువడు
  21. రాలి
  22. భూజంబులొప్పు
  23. సమమె
  24. గదాఖడ్గపాణు
  25. వ్రేటున
  26. బెంచి
  27. మెఱసి
  28. యట్ల
  29. ఁబ్రియంబు
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )