| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నంత నా రాక్షసులట లంక కరిగి యెంతయు శోకంబు లెసగ నవ్వేళ[వా.రా. సర్గ 93] రావణు లోకవిద్రావణుఁగాంచి: “దేవ! నీ పుత్త్రుండు దేవేంద్రవైరి తన బాహుబలమునఁదఱిమి వానరుల దునుమాడి పెక్కండ్ర దురములోపలను దివిజు లచ్చెరువంద దివ్యాస్త్రకోటి నవిరళంబుగఁబేర్చి యంతటఁబోక బలువిడి లక్ష్మణుప్రాణముల్ గలఁగఁ బలుసాయకంబులఁ బ్రౌఢుఁడై యేసి యా మేఘనాదుఁడుదగ్రవిక్రముఁడు సౌమిత్రిచేఁజచ్చె సమరమధ్యమున.” ననవుడు రావణుండధిక శోకమున మునిఁగి పెద్దయుఁబ్రొద్దు మూర్ఛిల్లి తెలిసి “హా వంశవర్ధన! హా మహావీర! హా వితరణధుర్య! హా శూరవర్య! యా శతమన్యుని నవలీల గెలుచు నా శౌర్య మెవ్వఁడుదగ్రుఁడై యడఁచె? బలసూదనాది దిక్పతులు ఖేచరులు 1787బలమఱి నీవన్నఁబాఱుచుండుదురు; నీ యుగ్రశక్తికి నిలిచి నిన్నెదిరి యా యోధనంబున నడఁచెనే నరుఁడు? చటులకోపంబునఁజండకోదండ పటుబాణపాణివై బవరంబులోన? నిలిచిన జముఁడైన నీ కోడునట్టి బలిమి యెక్కడపోయెఁ బరికింప నేఁడు? వక్రమై దైవంబు వలను గాకున్న శక్రారి! నీకంటె జముఁడెక్కు డయ్యె; నక్కజంబుగ మందరాచలంబైన వ్రక్కలు సేయు నీ వాఁడి బాణములు; రణభూమిలో1788నీవు రామలక్ష్మణులఁ దృణలీల గెలిచితి తివిఱి పల్మాఱు; నా మహత్త్వము దూలి హా పుత్త్ర! నీవు సౌమిత్రిచే నేఁడు సమసితే యకట! యమరులు మౌనులు నమరారి! నీవు సమరోర్విఁబడుటకు సంతసించెదరు. సంహారఘనఘనస్తనిత1789మైనట్టి సింహనాదము నీవు సేసిన బెదరు నిఖిలలోకంబులు; నీ వజేయుఁడవు నిఖిలనిర్జరులకు; నీ1790పేర్మి దక్కి యల్పునిగతిఁగూలి తకట! యా బ్రహ్మ కల్పనఁదప్పింపగా నేరవైతి? సచరాచరములైన జగము1791 లీ రేడు సుచిరవిక్రమ!1792 వీరశూన్యమైతోచె. నందన! నీ లావు నమ్మిననన్ను బృందారకులు నవ్వఁబెడఁబాయఁదగునె? చెవులార రాక్షసస్త్రీవిలాపములు వివిధభంగుల నేఁడు విన నాకు 1793వలసె! నీ యువరాజ్యంబు నీదు లంకయును నీ యిష్టబంధుల నీ తల్లి నన్నుఁ దనయ! నీ పత్నులఁదనయుల డించి చనఁజాలితే! యెందుఁజనితి నీ వకట! నాఁడంతకుని గెల్చినాఁడ వాలమున నేఁడెట్లు పోయితి నీవు దత్పురికిఁ? బరలోకకృత్యముల్ భక్తితోఁదనయుఁ డరయఁదండ్రికిఁజేయు టదియెల్లఁబోయి యే నీకుఁజేయింప నిటు నేఁడు1794వలసె నే నింక నేమందు? నేమి చేయుదును? రామలక్ష్మణులును రవితనూజుండు యామినీచరపాలుఁడగు విభీషణుఁడు భీమవిక్రమలీలఁబెంపొందు కపులు నా మర్మములు 1795దూర నాటియున్నార; లట్టి నా హృదయశల్యంబు లో పుత్త్ర! నెట్టన పెఱుకక1796నీ వెందుఁజనితి? నా పాలి జయమయ్యు నా తేజమయ్యు నా పుణ్యఫలమయ్యు నా భాగ్యమయ్యు నా పెంపుగతి యయ్యు నా కీర్తియయ్యు నేపార నో పుత్త్ర! యెంచినవెల్ల నీవయై యుండుదు; నీ యట్టి కొడుకు చావును జూచితి; జన్మ మేమిటికి? నీ కష్టశోకాబ్ధి నెడతెగ 1797కీఁద నాకు 1798నెయ్యది తేప నలినాప్తతేజ! నినుఁగొని రాముని నిర్జింతుఁబోర; నని నమ్మి యుండితి నది1799యెల్లఁబొలిసె. నాశలన్నియుఁదీరె; నకట! యే నింక నీ శోకదావాగ్ని నెరియంగఁజాల.” నని యని శోకించి యందంద పొగిలి మనసు డిందకయుఁగ్రమ్మఱ మూర్ఛఁబొంది యున్న దశగ్రీవు నుగ్రప్రభావు నున్నతాత్ములు మంత్రు లొయ్యనఁదెలుప బలుశోకరోషముల్ బలిసి కన్బొమలు పలుమఱు ముడివడ బరవసంబొప్ప నేచినకిన్కమై నే దిక్కు సూచెఁ జూచిన దిక్కున స్రుక్కి రాక్షసులు ఘనభీతిఁబఱవ రాక్షసలోకవిభుఁడు కనదుగ్రదంతసంఘట్టనరవము నతిభయంకరవృత్తి నప్పు డా దిశలు ప్రతిరవంబొనరింపఁ1800బదిముఖంబులను గనుఁ1801గవలందగ్నికణములు దొరుగఁ దన మంత్రివరుల నందఱఁజూచి పలికె! “విడువనితపమున వేధ మెప్పించి పడసితి శస్త్రాస్త్రపంక్తులు పెక్కు; లెన్నఁడు నపజయంబెఱుఁగ యుద్ధముల; నెన్నడు నే శోక మెఱుఁగఁజిత్తమున; నిరుపమస్థితి నొప్పునీలాభ్ర మనఁగఁ బరమేష్ఠి మెప్పించి పడసినజోడుఁ గైకొని రథమెక్కి కదలితినేని నాకనాయకుఁడైన నను గెల్వఁగలఁడె? నలినసంభవుచేత నాఁడు నేఁగొన్న విలునమ్ములును మీరు వేగంబె తెండు; వాఁడిమి మీఱంగ వడిఁగిట్టి కలన నేఁడు నే గెలుతు నా నృపులును గపుల.” నని పల్కి ప్రళయకాలాగ్నియుఁబోలె మనమున జాజ్వల్యమానుఁడై మండి దివ్యవాద్యములతో దిక్కులు మ్రోయ సవ్యబాహాస్ఫాలనంబు సేయుచును ననికి నిట్లుగ్రుఁడై యధికరోషంబు పెనఁగొన మఱియును బేర్చి యిట్లనియె: “నేఁడు నా తమ్ముల నేఁడు నా సుతుల నేఁడు నా బంధుల నేఁడు నా భటులఁ జంపెను సీతకై చనుదెంచి కడిమి పెంపార రాముఁడభేద్యుఁడై పేర్చి. యా యింద్రజిత్తు మాయాసీతఁజంపె; నా యుపాయంబు నిరర్థకంబయ్యె. |