ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
రావణుఁడు మూలబలమును బంపుట
నంత నా దశకంఠుఁడధిక 1811శోకమునఁ
జింతించి విన్ననై చిత్తంబు నందు[వా.రా. సర్గ 94]
మఱపువుట్టని పుత్త్రమర1812ణ శోకమున
మఱుఁగుచు నాస్థానమంటపంబునకుఁ
జనుదెంచి కొలువుండి చటుల1813వేగమున
గనలెడు సింగంబుగతి వెచ్చ నూర్చి
చలమును బలమును సమరనైపుణియు
గల సైనికులనెల్లఁ గలయ నీక్షించి
“కపులను రామలక్ష్మణుల మీ రేఁగి
నెపమార నిర్జించి నెఱిఁబగ దీర్చి
రండు; పొం.”డనవుడు రభసంబుతోడ
నొండొరుఁ1814గడవంగ నుద్దండలీల
సామజ ఘోటక స్యందన సుభట
సామగ్రితో యుద్ధసన్నద్ధులగుచు
వజ్రసమానేకవరసాధనములు
వజ్రాంగు లాదిగా వలయువర్మములుఁ
గరమొప్పఁగా భయంకరలీల మేన
ధరియించి మించి యుద్ధతులయి పేర్చి
కరిఘటాఘీంకారఘంటికానేక
తురగోగ్రహేషిత దుందుభి శంఖ
పటహ డమామికా పణవాదివాద్య
పటురభస ధ్వజపటపటాత్కార
రథనేమిశింజనీరావసంకులము
మథితాంబుధిధ్వనిమాడ్కి ఘూర్ణిల్ల
బలుధూళి జలరాశిపట్టు గయ్యంపుఁ
గలను సేయఁగ నేఁగుకరణిఁబెల్లెగయ,
భూకంప మెసగ, నార్పులు నింగిముట్ట
భీకరంబుగ నేచి పెడబొబ్బ లిడుచు
బింకముల్‌ జంకెనల్‌ పృథుతరఘోర
హుంకారములును నొండొరులపంతములు
నంకించు నెలుఁగులు నార్పులు సెలఁగ,
నంకితమణికుండలానేక హార
కంకణకోటీరకాంతులు నిగుడ,
లంకేశుసైనికుల్‌ లంక వెల్వడిరి
ఘనసత్త్వములఁబేర్చుకపికులాంభోధిఁ
గనుఁగొని బెగడొందఁగా నుత్సహించి
కడఁకతో నపుడు లంకావారి వెడలు
బడబాగ్నికోటుల భంగి శోభిల్లి.
యప్పుడు కపివీరు లార్పులు నిగుడ
నుప్పొంగి చెలఁగుచు 1815నురువడి నడవఁ
గ్రుంగి దిగ్గజములు కుదికిలఁబడఁగ,
నింగికి లంఘించి నేలకు దాటి
బ్రహ్మాండ మగలంగ బాహువుల్‌ సఱచి
బ్రహ్మాదిదివిజులు పరికించి చూడఁ,
గాటుకకొండలగతిఁ దనరారు
మేటిదైత్యుల1816ఁజూచి మిగిలినకడఁక
గొండలుఁదరువులుఁగోటానఁగోట్లు
గండోపలంబులుఁ గడువడిఁ బెఱికి
కొనివచ్చి తాఁకిరి క్రూరులై. యంత,
ననిలోన రఘురాము నస్త్రవైచిత్రిఁ
గనుఁగొను వేడుకఁగమలబాంధవుఁడు
జనుదెంచె ననఁబూర్వశైలాగ్ర మెక్కె.
వననిధి వననిధి వడిఁదాఁకునట్లు
దనుజబలమ్మును దరుచరబలము
నొండొంటిఁదలపడి యుగ్రత మెఱయ,
మెండుగాఁగపిసేన మిగులంగఁజూచి
యరదముల్‌ వఱపుచు హరులఁదోలుచును
గరుల డీ కొలుపుచుఁగదిసి రాక్షసులు
మునుకొని నొప్పింప, మొక్కలంబు1817నను
వనచరుల్‌ గిరులెత్తి వైవంగ నపుడు
వాటుల వ్రేటుల వడి నందు నిందుఁ
బోటుల1818దాటులఁ బొరి నందు నిందుఁ
గరవాలముల భయంకరవాలములను
గరదండముల గదాఘనదండములను
బరశులఁబరిఘలఁ బట్టిసంబులను
గిరులను దరులను గిరిశృంగములను
దరుచరుల్‌ వైవంగ దనుజులు వైవ
ధరణిపై శోణితధారలు దొరుగ
వనచరుల్‌ గొండలు వాలయంత్రములఁ
గొని మీఁద వైవ నా కొండలు నడుమఁ
దుత్తుమురై నేలఁదొరుగఁ జక్రంబు
లెత్తి వ్రేసియు గదలెత్తి మోఁదియును
సరిఁబోరి రొండొరుల్‌ సలమునఁగిట్టి
సుర లద్భుతంబంది చూడంగ. నపుడు
కరులను హరులను ఘనరథంబులను
సరిఁదోలి కపుల రాక్షసులు నొప్పింప
వనచరేశ్వరుఁడును వాలినందనుఁడు
ననిలజుండును నీలుఁడాదిగాఁగలుగు
నగచరప్రముఖులు నధికరోషమున
నగపాద1819పంబులు నలుదెసల్‌ గురియఁ
బరియలై పడియెడు బహురథంబులును
గర ముగ్రగతిఁగూలు కరి సమూహములు
నఱిముఱిఁగెడయు వాహనములు నేల
నొఱగుదానవులు నై యుండగఁ1820గినిసి
రథరథ్యవేగంబు రథికు లగ్గింప
రథములు వఱపి సారథులు బిట్టార్వ
రథములు దమ మనోరథములకరణిఁ
బృథివీతలంబెల్లఁ బెల్లుగా నద్రువఁ
గవిసినఁ గడనొగల్‌ కరములఁబట్టి
యవలీల దివికెత్తి యవనిపై వ్రేసి
తురగముల్‌ దోలినఁదొలఁగక కపులు
తురగంబుతో నెత్తి తురగంబు వ్రేసి
కరుల డీ కొలిపినఁ గరులపైఁగవిసి
కరిఁగరిఁ దాటించి గములకు నుఱికి
డా కాల నొక్కని డాకేల నొకని
1821నీ కాల నొక్కని నీ చేత నొకనిఁ
గుదిచి రాఁదిగిచియుఁగూలఁదన్నియును
నదరంట నేసియు నంటఁద్రొక్కియును
నదిమి నొంచియు వీఁక నదర వ్రేసియును
నదలించి దివికెత్తి యవని వైచియును
బెక్కువిధంబుల 1822ఁబెనఁచి రాక్షసుల
నిక్కడక్కడ సేయునెడఁ బెచ్చు1823పెరిగి
తురగ రిం1824ఖోద్ధూతధూళి గప్పుటయుఁ
దరుచరాధిపులును దానవాధిపులు
నరు1825దైన యా నిబిడాంధకారమునఁ
గరవాలరోచు1826లు గందువల్సూప
వీరు వారును బోర వెడలిన రక్త
ధారామరీచులు తఱుచుగాఁగవిసి
బలు రేణువను తమఃపటలంబు నడఁపఁ
జల1827మెక్కి కయ్యంబు సందడియైనఁ
గుంజర రథకూల ఘోటక మకర
పుంజధ్వజానేకభూరుహ సుభట
కరకాండకల్లోల ఖడ్గపాఠీన
కరికరోరగ ఖేట కచ్ఛపనికర
వికలభూషారత్న విసరవికీర్ణ
శకలసైకత కేశజాల శైవాల
జనితచామరఫేనచయ రక్తనదులు
వనచరుల్‌ దనుజులు వడి దాటి దాటి
తాఁకుదు; రాలోనఁదరుచరుల్‌1828గినిసి
వీఁకఁ గోలెమ్ములు విఱుగ1829 నొక్కియును
మోఁకాల మోఁచేత ముష్టి నందంద
తాఁకించి పడఁ1830ద్రోసి తలలు ద్రొక్కియును,
బొట్టలు సీఱియుఁ బోనీక పట్టి
చట్టలు వాపియుఁజదియ వ్రేసియును,
గఱచియు విఱిచియుఁగడకాళ్లు వట్టి
జిఱజిఱ1831ఁద్రిప్పియుఁజిదియవైచియును,
బలువిడిఁ దల లొగిఁ బట్టి వెండ్రుకలు
పెళపెళమనఁ 1832బెల్చఁ బెఱికి వైచియును,
నిరుచేతులందును నిరువురఁబట్టి
పొరిఁబొరిఁదాఁకించి పొళ్లుసేసియును,
నెఱసి రంధ్రంబుల నెత్తురుల్‌ వెడల
నుఱువడిఁబడఁ 1833ద్రోసి యురములు1834సఱచి
నఖరదంతంబుల నాసికా కర్ణ
ముఖఫాల1835పట్టికల్‌ ముసరి త్రెంచియును,
నొప్పించియును గపుల్‌ నూర్వు1836రొక్కొకని,
నుప్పొంగి 1837యొక్కొకండొనర నూర్వురను
బట్టి చంపియుఁజలపట్టి దానవుల
నట్టిట్టు వోనీక యవనిపైఁగూల్చి
చిందఱవందఱ సేయంగ, నప్పు
డందఱు వెసఁజూచి యధికరోషమున
ధరణి గంపింప దిక్తటములు వగుల
శరధులు గలఁగ ముజ్జగములు బెగడ
దారుణాకారులై తద్దయుఁబేర్చి
భేరీమృదంగ గంభీరవాద్యములు
చెలఁగించి యక్కపిసేనపైఁగవిసి
బలసూదనాది దిక్పతులు భీతిల్ల
వికృతమస్తకములు వికృతహస్తములు
వికృతప్రకోష్ఠముల్‌ వికృతోష్ఠములును
వికృతనఖంబులు వికృతముఖములు
వికృతగాత్రంబులు వికృతనేత్రములు
వికృతహాసంబులు వికృతనాసములు
వికృతవక్షంబులు వికృతకక్షములు
వికృతవర్ణంబుల వికృతకర్ణములు
వికృతపాదంబులు వికృతనాదములుఁ
గల సైనికులు లయకాలాభ్రపంక్తి
బలువిడి విడివడి పఱతెంచుపగిదిఁ
బరిఘ గదా చక్ర పట్టిస ప్రాస
పరశు తోమర భిండిపాల త్రిశూల
కరపత్ర కుంత ముద్గర యష్టి 1838కణయ
కరవాల ఖేటక క్రక1839చాసినాగ
ముఖ శిలీముఖ చాప ముసలాయుధాది
నిఖిలసాధనములు నెఱయంగఁబూని
నఱకియు నడిచియు నలియమోఁదియును
నుఱువడిఁజిమ్మియు నొనరఁగ్రుమ్మియును
వ్రేసియుఁబొడిచియు వీఁక వైచియును
నేసియుఁ1840గొట్టియు నీ రీతిఁగపుల
నొప్పింప నెంతయు నొచ్చి భీతిల్లి
యప్పుడు తరుగిరు లవనిపై వైచి:
“మనకేల యుద్ధంబు? మనకేల చలము?
నినకులేశ్వరుఁడేల? యిన1841సూనుఁడేల?
యడవిలోఁగాయపండాకులు నమలి
కడుపు1842సాఁకుచునుండఁగానక వచ్చి
మదిమది నిచ్చట మడియంగ నేల?
పదపదం.” డని కపిపతులు రాఘవుల
విడిచి, ధైర్యంబులు విడిచి రాక్షసులు
విడువక చలమున వెనువెంటఁదఱుమ

  1. రోష
  2. ణాతురమున
  3. కోప
  4. గడచుచు
  5. నుడుపథం బవియు, నుడుగణంబెడల
  6. మీఁద మించి యుద్వృత్తి
  7. గా,నే
  8. పముల వానలు వెసఁ
  9. గదిసి
  10. నా కాల… నాకేల
  11. బెరసి
  12. రేఁగి
  13. ఖాదుల
  14. దారఁగా
  15. లు గగనంబుఁబర్వ, లగ్గలముగా బెరయ, లుకలకలం బెసగ
  16. మరి
  17. గవి(ది) సి
  18. ఁద్రొక్కి
  19. దీ…
  20. నీడ్చి
  21. బేర్చి పె
  22. దాఁకి
  23. చదిపి
  24. గళములు
  25. రొక్కరుని
  26. యొక్కరుం
  27. పరశు
  28. చనారాచ
  29. గోసియు, జంపియు
  30. సుతుఁ
  31. ఁబోసుక యుండఁ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )