| ఇతిహాసములు | రంగనాథరామాయణము | యుద్ధకాండము |
|
నన విని:“నీ బంటు హనుమంతుఁడుండ నినకులోత్తమ! నీకు నేల చింతింప? నీ యాజ్ఞఁదల మోచి నృపసింహ! వేగ నా యేడుదీవులకవల నుండినను నినుఁడుదయాద్రికి నే తేరకమును కొనివత్తు నౌషధ కుధర మే.”ననుచు నడుగుల కెఱఁగిన హనుమంతు నెత్తి నడుగ్రుచ్చి యాలింగనము సేసి విభుఁడు “నింద్రుఁడు నీ శిర;మినుఁడు నీ ముఖముఁ జంద్రుండు నీ మది, శక్తి నీ పిఱుఁదు, ననిలుండు నీ వెన్ను, హరుఁడు నీ వాల, మనలుండు నీ యంఘ్రు, లజుఁడు నీ బుద్ధి వరుణుండు నీ శక్తి, వాణి నీ వాణి, గరుడకేతనుఁడు నీ ఘనబాహుయుగముఁ, గుంజరాననుఁడు నీ కుక్షి రక్షింతు; రంజనాసుత! వేగ యరిగి ర.”మ్మనిన సరవి నర్కజ విభీషణ ఋక్షరాజ పురుహూతపౌత్త్రులప్పుడు వీడుకొల్ప మేదిని వడి వ్రయ్య, మెట్టిన నగము పాదంబులూదిన బలువడిఁగ్రుంగ, మెయిగాలి మున్నీరు, మిన్నేఱుఁగలఁగ, రయమున లంకాపురము గోపురములు వెసఁగూలఁగుప్పించి వినువీథి కెగసి, లసిత విద్యున్నిభలాంగూల లతయు నుగ్రబాహార్గళయుగళంబు నెత్తి యుగ్రాంశుపటుమండలో దగ్రలీల వదనంబు గడుసముజ్జ్వల లీల వెలుఁగఁ బదకర్ణసంకోచభంగిఁజెన్నగుచు బహుపర్వతంబులు బహుదేశములును బహునదీనదములు బహువనంబులును బురములు సాగరంబులుఁగనుంగొనుచు నరుదారఁదుహినాద్రి నవలీలఁగడచి, దెసలు ఘూర్ణిల్లంగ, దిగ్భాగ మగల, నసహాయ శూరుఁడై హనుమంతుఁడరిగె. |