ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
మాల్యవంతుఁడు హనుమతోఁ బోరుట
నంతన నా హనుమంతుఁడంభోధిఁగదియ
నంతలో రాక్షసు లక్షీణబలులు
నుదితబలోదగ్రు లుగ్రవిక్రములు
పదివేలకోటులు బలిసి తన్గొలువ
రావణుపనుపున రణజయస్ఫురణ
వావిరి నమ్మాల్యవంతుండు వచ్చి
చదల నెదుర్పడి జలధిమధ్యమునఁ
బొదివి యా హనుమంతుఁ బోనీక కదిసెఁ.
గదిసిన నక్కొండ ఘనబాహుశక్తిఁ
బదిలంబుగాఁబట్టి పవననందనుఁడు
దాఁకిన, ఘనభుజాదర్పంబు2080మెఱసి
వీఁకతో రాక్షసవీరు2081లుఁగదిసి
పరశు తోమర చక్ర పట్టిస ప్రాస
కరవాల శూల ముద్గర భిండిపాల
తతుల నొప్పింప, నుద్ధతిఁబెచ్చు పెరిగి
యతుల2082విక్రమదక్షుఁడవి లెక్కగొనక
యమరు లచ్చెరువంద ననిలనందనుఁడు
సమర2083లీలాభీలచటుల 2084వాలమునఁ
గడఁకతో నొడిసి రాక్షసవీరవరుల
వడిఁ2085బట్టి చుట్టి యవ్వనధిలో వైచె.
భంజించెఁగొందఱఁబదతాడనముల;
భంజించెఁగొందఱ భయదనాదముల;
భంజించెఁగొందఱఁబటువాలహతుల;
భంజించెఁగొందఱఁ బరుషోగ్రదృష్టిఁ
గొందఱఁబడఁద్రోసెఁ; గొందఱఁజంపెఁ;
గొందఱఁగారించెఁ; గొందఱనొంచె:
నంత రోషాయత్తుఁడై మాల్యవంతుఁ
డంతకాకారుఁడై హనుమంతుమీఁద
నెనయ బాణములు 2086వేయేసి యేయుటయు
ఘనవాలమున వాని ఖండించివైచి
యలుక విల్విఱిచి యల్లటుపాఱవైచి
బలుతోఁకచేఁ గాళ్లు బంధించి యెత్తి
వడి వైచుటయు మాల్యవంతుండు 2087మగుడి
పొడిచె నమ్మారుతపుత్త్రుశూలమున.
నది లెక్కసేయక యతఁడున్నఁజూచి
యదరులు సెదరంగ నత్యుగ్రశక్తి
నురము నొప్పించిన నురుశోణితంబు
లురువడి దొరుగంగ నొక్కింత నిలిచి
యలుకతో2088ఁగపివీరుఁడసమున వాని
తలఁ2089దాఁచి చని వియత్తలమున 2090నిలిచెఁ.
దలకొని దివిజులు తలలూఁచి పొగడఁ
దలఁదన్నుటయు వాని తలబిట్టు వగిలి
యోలిఁగీలాలంబు లొలుక లోఁదారి
యాలోన మూర్ఛిల్లి యంతలోఁదెలిసి:
“కదనరంగమున నిగ్గదఁగదా నీకుఁ
దుద.”యంచు గద యల్కతో బిట్టువైచి
తడయక యది దాఁకుతఱి మంటలెగయ
వడిఁజూచి యమ్మాల్యవంతుండు వలికె:
“నోరి వానరుఁడ! యీ యుదధిలో నద్రి
బోరనఁబడవైచిపో; నిన్నుఁజంప;
మొనసేసి తొల్లి సముద్రమధ్యమున
వినతాత్మజుని నెక్కి విష్ణుండు వచ్చి
నా తోడ యుద్ధంబు నలిఁజేసి చేసి
భీతుఁడై చాలక పెనుపేది పోఁడె.
లోకంబు లెఱుఁగు;2091నుల్లోక మీ కడిమి.
నీ కోర్వఁగా రాదు నెఱిఁబోర నన్ను.”
ననవుడు హనుమంతుఁ డామాల్యవంతుఁ
గనుఁగొని పలికె నుత్కటకోపుఁడగుచు:
“యుద్ధమధ్యమున మహోద్ధతి మెఱసి
వృద్ధరాక్షస! నీవు వెఱవక నన్నుఁ
గదియ నెవ్వఁడ?”వని 2092కదియు నవ్వీరు
మదభాషలకు నల్గి మాల్యవంతుండు
ఘన2093చంద్రహాసోగ్రఖడ్గ మంకించి
హనుమంతువక్ష ముద్ధతశక్తి వైవ
నదివజ్రనిభకాయుడగు నాంజనేయు
విదితంబుగాఁదాఁకి వెసఁబెల్లు విఱగె.
ననిలజుఁ డా ఖడ్గహతి2094కింత నొచ్చి
కినిసి నిశాచరుఁగిట్టి బిట్టలిగి
భూతభయంకరాద్భుత వాలమెత్తి
యాతనిమెడఁజుట్టి యలుకతోఁబట్టి
చెలఁగి యాకసమునఁజిఱజిఱఁద్రిప్పి
యలఘువిక్రమశీలుఁడబ్ధిలో వైచె.
వైచినఁబడి మాల్యవంతుఁ డా త్రోవ
వే చని పాతాళవివరంబు చొచ్చె.
హతశేషరాక్షసు లన్నిదిక్కులకు
ధృతిదూలి పఱచిరి దివిజు లుప్పొంగఁ.
గొండంతగెలుపుతోఁగొండతో నమర
మండలి వొగడ ధీమండనుండరిగెఁ.

  1. పేర్మి
  2. లందఱును- బ
  3. బలాధ్యక్షుఁడవి
  4. లోలా
  5. వేగ
  6. జుట్టి త్రిప్పి
  7. నూఱేసి (సెనే)
  8. గినిసి
  9. హనుమంతుఁడచలుఁడై
  10. దన్ని
  11. కెగసె
  12. నాలో నున్న కడిమి
  13. కడిఁదియ
  14. సత్త్వమునఁబేర్చి
  15. ని
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )