ఇతిహాసములు రంగనాథరామాయణము యుద్ధకాండము
పుష్పకారోహణము
“భీషణరణకేళిఁ బేర్చి రావణుఁడు
రోషించి మును గుబేరునిఁగెల్చి కొన్న
పుష్పకంబున్నది; పురుహూతలోక
పుష్పకక్రమమహాద్భుతవేగ మదియు;
నెలమి నా పుష్పక మెక్కి సమ్మదము
వెలయ నయోధ్యకు వేంచేయు టొప్పు.”
నన విని రఘురాముఁడనుమతించుటయుఁ
జని మహాసంభ్రమసంప్రీతు లొప్ప
నరిది వైభవముల నమరుపుష్పకముఁ
గరమర్థిఁదెచ్చె రాక్షసలోకవిభుఁడు.
‘రావణు లోకవిద్రావణుశక్తి
భావించి యెంతయు భయమునఁబొంది
యఱిముఱిఁగదలుప ననిలుండు గదియ
వెఱచునో దీపముల్‌ వెఱచునో కదల!”
నవరత్నదీపంబు లచలరూపములఁ
2458బొనరమదానిలంబుల నొప్పుదాని;
ఘనవిమానోదరకలితపుష్పములఁ
గొనకొన్నగంధముల్‌ గ్రోల నేతెంచి
యులికి లోపలఁజొరకున్న తుమ్మెదల
చెలువున దీప్తుల చెన్నగ్గలించు
నా విమలద్వారహరినీలమణుల
భావింప నెంతయు భాసిల్లుదానిఁ;
దలకొని తోఁటలఁదమపిన్ననాఁడు
వలపించి తముఁబాసి వచ్చినఁజూచి
పొగులుచు షట్పదంబులతోడ వచ్చి
మొగినున్న మల్లికాముకుళంబు లనఁగ
నా నీలమణులతో నలవడఁగ్రుచ్చి
మానైన మౌక్తికమణులొప్పుదానిఁ;
ద్రిభువనములయందుఁ దిరిగినగంగ
యభిరతి విశ్రాంతికై యున్నకరణి
ఖచితహంసావళి కమలదుకూల
రచితవితానంబు రాజిల్లుదాని;
“నెప్పుడు వచ్చునో యిందు శ్రీరాముఁ;
డెప్పుడు చూతుమో యేము రాఘవుని?”
నని యని చింతించి యమరకన్యకలు
తనువు లుజ్జ్వలమణిస్తంభముల్‌ సేర్చి
నిలిచిన చెలువున నిర్మలస్తంభ
ముల మణిపుత్త్రికల్‌ మొగి నొప్పుదానిఁ;
జేకొని వసుధపై సృష్టి రక్షింప
వైకుంఠపతి రామవల్లభుఁడైనఁ
బొలుచువైకుంఠంబు పుష్పకంబైన
చెలువున నెంతయుఁజెలఁగెడుదానిఁ
గనుఁగొని యప్పుడా కాకుత్స్థతిలకుఁ
డనురక్తితో రాక్షసాధీశుఁజూచి:
“రా విభీషణ! వీరు రావణోదగ్ర
పావకు నార్చినపటుపయోదములు;[వా.రా. సర్గ 125]
వీరి నారాధింపు; వీరిఁబూజింపు;
వీరి సంభావింపు విపులసంపదల.”
నని వానరులఁజూపి యర్థి దీపింపఁ
బనిచిన రాక్షసపతి విభీషణుఁడు
ధనము లంబరములుఁదగు భూషణములుఁ
గనకముల్‌ దెప్పించి కడుఁబ్రీతి మెఱసి
జనపతిసన్నిధి సంభ్రమంబొప్ప
వనచరపతులకు వరుసతో నిచ్చెఁ.
బతి రాముఁడపుడు పుష్పకము నర్చించి
సతియుఁదమ్ముఁడుఁదాను సద్భక్తి2459యుక్తిఁ
గృతకృత్యుఁడై ప్రదక్షిణముగా2460వచ్చి
యతిహర్షమున నెక్కె నవ్విమానంబు.
నెక్కి సుగ్రీవాదిహితుల వానరులఁ
దక్కక వీక్షించి దశరథాత్మజుఁడు:
“మీరు సేసినయట్టి మిత్రకార్యములు
నేరరు సురలైన నిష్ఠతోఁజేయ;
నెల్ల తేజంబులు నెల్ల సౌఖ్యములు
నెల్లయశంబులు నేను మీ వలనఁ
బడసితిఁ;2461బుణ్యులుఁబరమపావనులుఁ
గడుధన్యులగు 2462దురు; గాన మీ రింకఁ
బొండు మీ మీ దేశములకు.”నావుడును
నిండారువేడుక నృఫుఁజూచి కపులు:
“ధరణీశ!మే మయోధ్యకుఁగొల్చివచ్చి
పరమానురక్తి మీ పట్టంబుఁజూచి
నిరుపమచరితుల నీ సహోదరుల
భరతశత్రుఘ్నులఁబరమపావనులఁ
జూచి మీ తల్లులఁజూచి మీ పురముఁ
జూచి భాగీరథిఁజూచి వచ్చెదము.”
అనవుడు విని రాముఁడంతరంగమున
ననయంబు హర్షించి యా విభీషణుని
భానుజు నంగదుఁబవనజు నీలు
మాననీయాత్ముల మఱియుఁబెక్కండ్ర
వనచరముఖ్యుల వాత్సల్య మొప్ప
నెనయ నా పుష్పక మెక్కఁబంచుటయు
ధరణీశుమన్ననఁ దగ నుత్సహించి
పరమపావనులు పుష్పక మెక్కిరంత.
2463దనుజాంగనలు మహీతనయకు మ్రొక్కి
చనిరంత నిజనివాసములకు నెలమి.
దశరథాత్మజుఁజూచి దానవేశ్వరుఁడు
విశదంబుగాఁబల్కె:“వినుము శ్రీరామ!
యెలమి నీ పుష్పకమెంద ఱెక్కినను
సలలితంబుగఁజోటు చాలి వెండియును
నొకమూల గడమయై యుండు నేనూటి
కకలంకమహిమతో.”నన ముదంబంది
ధరణీశుఁడప్పుడు తరుచరాసురులఁ
గరుణఁబుష్పక మెక్కఁగా నానతిచ్చె.
నప్పు డా పుష్పకం బాకాశవీథి
నొప్పెడువేడుక యుప్పొం2464గ నెగసి[వా.రా. సర్గ 126]
ఘనమనోవేగంబు గైకొన నిగుడి
వినువీథి దివ్యులు వినుతింపఁబేర్చి
పర్వినప్రభలతో భానుబింబంబు
పూర్వపశ్చిమపథంబులఁబోక మగుడి
దక్షిణంబుననుండి తగ నుత్తరమున
కక్షీణగతిఁబోవునాకృతి దోపఁ
బోవ నప్పుడు నిత్యపుణ్యుండు రామ
దేవుండు జానకీదేవితో ననియె:

  1. బొనరు
  2. మ్రొక్కి
  3. వించి
  4. బుణ్యముల్‌ పర
  5. మీరుగలుగుటఁజేసి, మీరుకపులార, యింక
  6. త్రిజటాదిసతులు ధాత్రీ జకు మ్రొక్కి-నిజగృహంబులకంత నెమ్మితోఁజనిరి
  7. గియెగ
AndhraBharati AMdhra bhArati - Ranganatha Ramayanamu - Ranganadha Ramayanamu - Ranganatha Ramayanam - Ranganadha Ramayanam - Gona Buddha Reddy ( telugu literature andhra literature )