దీవింప! రఘుకులాధిపుఁడు వేడుకలు
గావించు భోజనాగారంబునకును
జనుదెంచి హితులను సకలబాంధవుల
ననుజుల రవిజాదులైన వానరుల
నా విభీషణముఖ్యులగు దైత్యవరులఁ
బావనాత్మకు గుహుఁ బరగ రావించి
యుచితాసనంబుల నుండంగఁబనిచె
సుచరిత్రు నంజనాసూనునిఁ దనదు
పొత్తున వేడుక భుజియింపు మనియె
నత్తఱిఁజాల నెయ్యముఁదియ్యమమర.
నెనయంగ నవ్వేళ నెలఁతలు దెచ్చి
కనకపుఁబళ్లెముల్ గ్రమమొప్ప నునిచి
పరగఁబాయసము సూపము లపూపములు
వరుగులు వడియముల్ వాంఛఁబుట్టించు
కూరలుఁబచ్చళ్లుఁగొమరొందుసిగర
లూరుఁగాయలును శాల్యోదనంబాత్మఁ
దనిపెడు సద్యోఘృతము వింతరుచులఁ
బెనుపొందు ఫలములుఁబ్రియముతో నిడఁగ
నందఱు భుజియించి యతిసంభ్రమమునఁ బొందిరి యా రామభూపాలుఁడంతఁ
బొసఁగఁగర్పూరతాంబూలంబు లిచ్చి వెస వారినందఱ విడిదుల కనిచి
వినయవిధేయుఁడై విలసిల్లుచున్న హనుమంతుఁగౌఁగిట నర్థితోఁజేర్చి
పవనజ! నా మీఁద భక్తి పెంపునకు వివిధ కార్యములు గావించితి పెక్కు.
ఘనుఁడు నీ చేసిన కార్యంబునకును నెనయఁ బ్రత్యుపకారమేఁజేయలేను
రమ్మని నగరికి రమణఁదోడ్కొనుచు నమ్మహీసుతతోడ నరుగుదేరంగఁ
గౌసల్య కానందకరము పెంపొంద భూసుత రామభూవరుఁడద్రిచరుఁడు
పన్నీట జలక మింపొందఁగా నాడి సన్నంపువలువలు సవరించి వేడ్కఁ
దెలివిగాఁగస్తూరి తిలకంబు దీర్చి సలలితరత్నభూషణములు దాల్చి
పరిమళంబులు మేన బాగుగా నలఁది గరిమతోడుత నిత్యకర్మముల్ దీర్చి
కరమొప్ప నవరత్నగద్దియమీఁద వెరవొప్పఁగూర్చున్న వేళఁగౌసల్య
పసమించుబంగారుపళ్లెరంబునను రసరసాన్నంబులు రమణి వడ్డింప
నత్తఱి రఘురాముఁడనిలనందనునిఁ బొత్తులఁగూర్చుండి భుజియింపు మనిన
మంతనంబునఁబొంగి మారుతాత్మజుఁడు సంతసంబున రామచంద్రునకనియె.
ఓరామ! ముందు మీరొక కబలంబు నారగించిన నేను నటమీఁద వత్తు
ననవుఁడు రఘురాముఁడట్ల గావింతు ననుచు వాత్సల్యంబు నాత్మలో మెఱయ
నినకులాధీశ్వరుం.......... ..........
నినకులాధీశ్వరుండింపు రెట్టింప:
“ననిలజ! భుజియింపు.”మనుచుఁదానొక్క
కబళంబుఁగొనిన నక్కపికులోత్తముఁడు
ప్రబలమౌభక్తి నప్పళ్లెరంబెత్తి
తలమీఁద నిడికొని తనర నాడుచును
జెలఁగుచు:“నో కపిశేఖరులార!
రండు; రామునిపళ్లెరముప్రసాదంబు
దండిగా దొరకె నందఱకు నేఁ.”డనుచు
మునివృక్షమెక్కి యిమ్ముల దాని దళము
లను వొందఁగాఁద్రుంచి యా ప్రసాదమున
నొనరించి సంతోషముల్లంబు నిండ
ఘనభక్తి నొసగె నా కపినాయకులకు.
వారును దానును వాంఛలు దీర
నారూఢిఁదృప్తులై రా ప్రసాదమున.
ననిశంబు నదిమొదల్ హరివాసరమున
మునివృక్షపర్ణముల్ ముఖ్యంబులయ్యె.
నంత నా రఘురాముఁడంజనాసుతుని
సంతతభక్తికి సంతోషమంది
పరపైన వేఱొక పళ్లెరంబునను
ధరణీశచంద్రుండు దా నారగించి
జలముల నొగివార్చి జతనంబు మీఱ
లలితసుగంధమాల్యము లొప్ప ముడిచి
కర్పూరతాంబూలగంధాక్షతంబు
లర్పింప దయమీఱ నందఱ కప్పు
డినకులోత్తముఁడిచ్చె నెల్లవస్తువులు.
మనమారనప్పుడు మహిమపెం పలర
అప్పుడు గంధాక్షతాదివస్తువులు తెప్పించి యందఱఁ దెఱగొప్పఁజూచి
భరతునిఁబిలిపించి పార్థివేశ్వరుఁడు పరగంగ యువరాజ్య పట్టంబుగట్టె.
సకలమంత్రులకును సకలభృత్యులకు సకలబంధువులకు సకలాశ్రితులకు
నినకులోత్తముఁడిచ్చె.......... ..........
మనుజేశ్వరుఁడు హనుమంతునిఁజూచి ఘనముగాఁగొల్వుండఁగావలె నింకఁ
గొలువుకూటంబెల్లఁగొమరు దీపింపఁ జెలువందఁగాఁజక్కసేయింపు మీవు
అనవుడు హనుమంతుఁ డా సుమంత్రుండు గొనకొని పరిచారకులను రావించి
తీరుగా శోధించి తీర్థముల్ దెచ్చి కావరమున....గైకొనఁజేసి
కస్తూరిచందనకర్పూరములను విస్తరిల్లఁగఁజల్లి విభవంబెలర్పఁ
గరము వేడుక రత్నకంబళ్లు దెచ్చి పరువడితోఁగూడఁబఱచి వేవేగ
నవరత్న సింహాసనము నొప్పఁదెచ్చి యవఘళంబుగ మధ్యమందిడి రొప్ప
రవికులతిలకుండు రామచంద్రుండు నవధానమతి జలక మర్థితో నాడి
సన్నంపు పైఠాణిసేలువ గప్పి(ట్టి) తిన్నఁగాఁగస్తూరి తిలకంబుఁదీర్చి
బొండుమల్లెలవిరుల్ పొసఁగంగ జుట్టి నిండుబుర్సారుమాల్ నీటుగాఁజుట్టి
మేన శ్రీగంధంబు మేలిమి నలఁది భానువంశజుఁడంతఁబటుసంభ్రమమున
దివ్యభూషణములు దృఢముగాఁబూని దివ్యతరంబైన తేజంబుతోడ
జలజాక్షు లిరుగడఁ జామర లిడఁగ వలనుగా సతులాలవట్టముల్ పట్టఁ
దలకొని తమ్ములు తనుఁజేరి యపుడు సలలితంబుగ సితఛత్రముల్ పట్ట
నంగనల్ పాడ దేవాంగనల్ పొగడ మంగళతూర్యముల్ మహినిండ మ్రోయ
సూటిగాఁబాఠకుల్ స్తుతియించుచుండఁ బాటించి తన మూలబలములు గొల్వ
నవధానతత్పరుఁడై వాయుసుతుఁడు కవగొని ముందట గైకొని నడవ
గురుఁడు వసిష్ఠుండు కుంభినీనాథుఁ బరికించి దక్షిణభాగాన నమరఁ
జెలువంద మంత్రులు చేరి కొల్వఁగను కొలువుకూటమునకుఁగొమరొప్ప వచ్చి
నవరత్న సింహాసనంబుపై నొప్ప నవిరళద్యుతిరాముఁ డాసీనుఁడగుచు
సకలభృత్యామాత్య సహితుఁడై వేడ్క నకలంకచిత్తుఁడై యట కొలువుండెఁ.
దెలివితో శచిఁగూడి దేవేంద్రుఁడున్న చెలువున నవరత్న సింహాసనమున
వామభాగంబున వసుధాతనూజ యా మెయి లక్ష్మణుండర్థితో నుండ
భరతశత్రుఘ్నులు పరమానురక్తి గరిమఁబిఱుందను గపిరాజు ప్రీతి
సరవి నంగదుఁడును జాంబవంతుండు నరయ విభీషణుండాదిగాఁగొల్వ
నఖిలసైన్యములలో నాదరంబెసఁగ నఖిలదేశాధిపు లందఱు వచ్చి
చెలఁగి యా రాజులు సింధురంబులును బొలుపొందునవరత్నభూషణంబులును
వెరవొప్ప నందఱు వేర్వేఱఁదెచ్చి ధరణీశునకు నిచ్చి తాత్పర్య మొప్ప.
మనుకులపతిచేత మన్ననల్ వడసి యనుపమస్థితిఁగొల్వ నంతటిలోన
ఘనుఁడగస్త్యుండు మార్కండేయ గార్గ్య మునులాదిగాఁగలమునులతోఁగూడ
నజుఁడును దేవతల్ పదిదిక్పతులును ద్రిజగత్సముల్లాస తేజులై కొల్వ
నేతెంచినను రాముఁడెదురుగా వచ్చి భాతిగా బ్రహ్మకుఁ బ్రణమిల్లి లేచి
యుచితాసనంబున నొప్పుగా నునిచి యుచితార్ఘ్యపాద్యంబు లొనరించి వేడ్క
గంధపుష్పాక్షతాగమ మొప్పఁజేసి సంధిల్లుప్రియము లుత్సవతఁగావించి
క్షేమమే యనుచును జెన్నొంద నడుగ క్షేమంబు నీవల్ల సిద్ధించె మాకుఁ
గడు నుగ్రుఁడగు దశకంఠు వధించి పుడమి సంరక్షించు పుణ్యంబుగంటి
మని పెక్కు భంగుల ననిమిషుల్ ఋషులు ఘనుని రామునిఁబొడఁగని కొల్వులోనఁ
బడవాళ్లు ఎలుఁగిచ్చి బ్రద్దలవారు జడియ నోహో! యని సంగ(ద)డి మాన్ప
వినయవిధేయుఁడై విభుని సన్నిధిని ననువుగా నున్నట్టి యవసరంబునను
అప్పుడు సౌమిత్రి ననురక్తితోడ.... ..........
సకలభృత్యామాత్య సహితుఁడై వేడ్క
నకలంకచిత్తుఁడై యట కొలువుండె.
నప్పుడు సౌమిత్రి ననురక్తితోడ
నొప్ప నిద్రాదేవి యొగిఁబొందుటయును
గొలువులోపలను గాకుత్థ్సునియెదుటఁ
గలకల నవ్వినఁగమలాప్తకులుఁడు
జనకజయును విభీషణుఁడు సుగ్రీవుఁ
డును మారుతాత్మజుఁడును వాలిసుతుఁడు
నలనీలశరభసన్నాదతారాది
బలిముఖుల్ శత్రుఘ్నభరతులు భీతిఁ
దలలు వంచిరి యప్డు తమయందుఁజెంది
లలిమీఱినట్టికళంకముల్ దలఁచి.
విన్ననై తలవాంచి వెఱఁగంది మదుల నున్నకళంకుల నొదుఁగుచు నుండ
చెఱనున్నసతిఁదెచ్చి చెలఁగుచు సభను సరగున నున్నాఁడు జననాథుఁడనుచు
నని తోచుచుండె నా యవనీశుమదిని అనరానిమాట నన్నాడి యా రావ
ణునిచేతఁజెఱఁజిక్కి యొదుఁగుచునుండి ..........
నేఁడు నీ సభలోన నిర్మలస్థితిని బోఁడిగా నున్నది పూఁబోఁడి యనుచు
నవ్వెనో యిప్పుడు ననుఁజూచి యనుచు నవ్వేళ సీత ఖిన్నాత్మయై యుండె.
నినకులంబునఁ(బుట్టి)యింతైన నీతి మనమున లేక భూమండలంబేలి
నేఁడు భక్తునివలె నిలిచి సన్నిధిని నోడక యున్నవాఁడొగి రామునొద్ద
నని నవ్వెనో యని యప్డు భరతుఁడు మనమునఁగడు ననుమానింపుచుండె.
నాకుఁదమ్ముండైన నయమింత లేక ప్రాకటరాజ్యవైభవమును గోరి
యుండి రామునియొద్ద నూనిన భక్తి నిండినవాఁడునై నేఁడున్నవాఁడు
అని నవ్వెనో యని యపుడు శత్రుఘ్ను మనమునఁదోఁచి యుమ్మలికమైనుండెఁ.
దన వారిమర్మముల్ దగ్గఱనుండి మనుజేశునకుఁజెప్పి మహినిఁగూల్పించి
యతిభక్తుఁడై చేరి యవనీశునొద్ద హితవరై యున్నాఁడు యీ విభీషణుఁడు
అని నవ్వెనో యని యతఁడు లజ్జించె. ననయుఁడై రాముచే నన్నఁజంపించి
యన్న సత్కూర్మిభార్యను రమింపుచును వన్నెవాసియు వావివర్తనల్ మాని
సద్దుసేయక రామచంద్రభూవిభుని వద్ద నున్నాఁడు యీ వనచరుఁడనుచు
నవ్వెనో యని యర్కనందనుఁడపుడు నివ్వటిలెల్లడు భీతి నివ్వెఱఁగందె.
జనకునిఁజంపిన జననాథు నొద్ద ..........
నీ రీతి వారివారికిఁ దగినట్టి ఘోరకళంకులుక్కునఁ దోఁచుచుండ
మొగములు వంచియు మొనసినభీతి దిగులొందుచుండిరి తెలియనిమతుల
విన్ననైయున్న నిర్విణ్ణులఁ జూచి. యన్నలినజు డప్పుడాత్మలో నెఱిఁగి
కంపంబు సిగ్గును గడుభీతిఁజింతఁ దెంపుతో సభకెల్లఁదెలుపంగ వలసి
యింద్రచంద్రార్చితు నినవంశ్యు రామ చంద్రునిసభలోన సౌమిత్రి నీవు
ఏ విధంబున హాస్యమేమియు లేదు నీవేల హాస్యంబు నెఱిఁజేసి తనిన?
నప్పుడు రఘురాముఁడాగ్రహవ్యగ్ర ముప్పొంగుచుండఁ దమ్మునిఁజూచిపలికె.
నిదియేమి? సౌమిత్రి! యెన్నఁడు నీకుఁ బొదలినయట్టి దుర్బుద్ధులు లేవు
ఏ విచారము లేక యీ సభయందు నీ విధి నవ్విన దెఱిఁగింపు మనుడుఁ
గరము భీతిలి కరకమలముల్ మొగిచి వెఱచుచు రామభూవిభుని వీక్షించి
ధరణీశచంద్ర! నా తప్పు సవరించి యరయ నా విన్నపం బాలించి వెనుక
మఱియు నీక్షింపుఁడన్మానింపవలదు సరగున నని పల్కి చయ్యన బ్రహ్మ
కనువంద నప్పుడు నా లక్ష్మణుండు ఘనభక్తి సాష్టాంగకం బొనరించి
దేవ! యీ కొల్వులోఁదేటగా నొండు భావించి నవ్వినపాటిగా దేను
రామభూపాలుఁడరణ్యభూములకు భూమిజతోఁగూడి పోవఁగాఁదలఁచి
జనకుని వాక్యము సేయంగఁబూని వనముల కేఁగుచో వలనొప్పఁద్రోవ
గుహుని యాశ్రమభూమిఁగొమరొప్పఁజేరి సహజమౌ నొక పూరిశయ్యపై నుండ
నయ్యెడ సంకల్ప మాత్మలోఁజేసి చయ్యనఁబదునాల్గుసంవత్సరములు
నియమించి యాహారనిద్రలు మాని ప్రియమునఁగాతు నన్బెనఁగొన్నభక్తిఁ
గమలాక్షు శ్రీరాముఁగాతు నన్వేడ్క సమకట్టియుండంగఁజయ్యన వచ్చెఁ
దమముఁగప్పుచును నిద్రాదేవి యపుడు నమరంగ నాకును నాసన్నయగుచుఁ
గన్నులఁదట్టగాఁ గాంత కిట్లంటి. నెన్నఁగఁబదునాలుగేండ్లు మాయన్నఁ
గావఁగా నని బుద్ధి గావించినాఁడ నీ వంక నిల్వ కింకేఁగు మటంచుఁ
బూని నిద్రాదేవిఁబొసఁగ నర్థించి భానువంశజుఁగాతుఁబదునాలుగేండ్లు
దివమురాత్రియు నొక్క దివముగాఁగోరి తవిలివ్రతంబేను దనరంగఁజేసి
యున్నాఁడ ననవుడు యుగ్మలి నిలిచి పిన్ననాఁటనునుండి ప్రియమునఁగూడి
యున్న నన్బొమ్మన నుచితమే నీకు? నెన్నాళ్లు గడువు నా కెద్ది సమయము?
వదలక యెన్నఁడు వత్తు నే ననినఁ గదిసి దానికి నొక్క గడువు సేసితిని.
వనవాస సమయంబు వరుసతోఁదీర్చి జనకజతో రామజననాథవరుఁడు
మగుడంగఁ బురిఁజేరి మహిఁబుణ్యజనులు పొగడంగ నేలుచు భూపుత్త్రితోడఁ
బన్నినవేడ్క సభామంటపమునఁ జెన్నొంద మణిమయసింహాసనమునఁ
గొలువున్నవేళ నా కొల్వులో రాము వెలయంగ సేవ గావించుచునున్న
వేళ రమ్మని దాని వీడుకొల్పితిని. తాళక గడువ దెంతయుఁదప్పకుండ
నది వచ్చి కన్నుల నావహించినను మదిఁజోద్యమంది యిమ్మాడ్కి నవ్వితిని.
మెచ్చువచ్చినచోట మేదినీరమణు లచ్చుగాఁగుఱుచసేయుట నీతి గాదు
అనుటయు బ్రహ్మయు నమరులు మునులు మనుజేశుఁడగు రామమహిపతి భూమి
పతులును వనచరపతులును దనుజ పతి విభీషణుఁడాదిపతులెల్ల మెచ్చి
తలలూఁచి సౌమిత్రిధైర్యంబుఁబొగడి విలసిల్లఁగాఁ గొంతవెఱఁగున నుండ
నప్పుడు లక్ష్మణుండగ్రజుఁజూచి చెప్పితి నవ్వు వచ్చిన విధంబెల్ల
నిది తప్ప నా మది నేమియు నెఱుఁగ సదయాంతరంగ! నీ చరణంబులాన
యని బాష్పలోచనుఁడైన తనపాద వనరుహంబులమీఁద వ్రాలినయట్టి
యనుజన్మునెత్తి ప్రేమను గౌఁగిలించి కనుఁగవ హర్షాశ్రుకణములు దొరుగ
నన్న! నీ వింతకష్టము కోర్చి నన్నుఁ గన్నట్టి తలిదండ్రిగతిని బ్రోచితివి
యిట్టి సద్గుణశాలి యిప్పుడు నిన్నుఁ గట్టిఁడిమనసునఁ గడవ నాడితిని
అమరంగ నీ యట్టియనుజు జన్మాంత రములందు నేను సంరక్షింపగలనె?
యనుచుఁ దమ్మునిఁబ్రియమ్మునఁ గౌఁగిలించి ఘనముఁగా దొరిగెడు కన్నీరు దుడిచి
ఘనరత్నభూషణ కనకాంబరములు తనివారఁగా నిచ్చి తమ్ముని కనియె.
నడవులయందుఁ గష్టంబులచేత బడలినా వింక నా పంపుఁగైకొనియుఁ
దమ్ముఁడ! వేగ యంతఃపురంబునకుఁ బొమ్మనుటయు మ్రొక్కి పోయె సౌమిత్రి.
తనదురాకకును సంతతమును నాత్మ నెనసినభక్తితో నెదురుచూచుచును
ఉన్నట్టి యూర్మిళ నూఱడఁబల్కి మన్నించి వేడ్కఁబ్రేమను గౌఁగిలించి
యతులితసౌఖ్యవారాశిఁదేలించి హితవుతో నుండె సౌమిత్రి యక్కడను.
అంత శ్రీరాముఁడౌదార్యతత్పరుఁడు సంతసంబున నుండె సఖులును దాను
వనధిఘోషముఁబోలి వర్ణించుచుండ మనుకులపతి హర్షమగ్నుఁడై యుండె.
సౌమిత్రిపైఁ గూర్మి సంపద నిల్పి రామణీయకలీల రాముఁడున్నంత
నరుదుగా నవరత్నహారముల్ బ్రహ్మ వరదుఁడై దేవాంగవస్త్రముల్ ప్రీతి
రామలక్ష్మణులకు రాగమింపొందఁ బ్రేమమై నిచ్చి దీపింప నవ్వేళ
వనజగర్భునకును వాసవాదులకు ననిమిషులకు వేడ్క నభినవంబొసగ
వినయమృదూక్తుల విలసిల్లఁజేసె. ననఘుఁడు రఘురాముఁడటు వీడుకొలుప
సురవరుల్ గొలువంగ సురపతి బ్రహ్మ కరమర్థి దీవించి కదలినపిదప
వందనప్రియపూర్వవచనంబు లొప్ప నందంద ఋషులకు నానంద మెసగఁ
బరగెడి తేజంబు ప్రబలుచు వెలుఁగఁ దిరముగా నొకలక్ష ధేనువు లొసఁగి
యఖిలగుణాన్వయుఁ డా రామవిభుఁడు నిఖిలంబు నెఱుఁగంగ నటు వీడుకొల్ప
సంతోషచిత్తులై చని రంత మునులు. నంత నా రఘురాముఁడతిగుణధాముఁ
డసమొప్ప నేఁబదియాఱుదేశముల వసుమతీశ్వరులకు వరుస వేర్వేఱ
మధుపర్కములు నిచ్చి మహిపతి వారి విధముల నందఱ వీడుకొల్పినను
బతిభక్తి వడసి భూపతులెల్లఁగదలి యతిరయంబునఁ బోయి రందఱు వేడ్క
నమరు లొసంగిన యట్టి వస్త్రములు కమలాప్తసుతున కంగదునకుఁబ్రీతి
వనచరపతులకు వాయుసూనునకు నొనర విభీషణాఖ్యున కొప్ప నిచ్చి
నిర్మల కారుణ్య నిధి.......... ..........
యందఱుఁగొలువులో నట్లున్నయెడను
యందఱఁగని రాముఁడను జన్ముఁజూచి;
“వెలయంగ లక్ష్మణ! వివరింపుమీవు
నెలకొని నగి తేమి నిష్కారణముగ?”
ననవుడు భయమంది యా లక్ష్మణుండు
తనకరంబులు మోడ్చితగ విన్నవించె:
“వనవాసమునకు దేవరఁగొల్చి వచ్చి
వనముల నున్నచో వచ్చెనీ నిద్ర.
వచ్చినఁబదునాల్గువత్సరంబులును
నచ్చుగాఁజేరకు మన నిద్ర సనియెఁ.
బదునాలుగేండ్లును బరగ నిండుటయు
వదలక యిప్పుడు వచ్చె నా నిద్ర.
యదికారణంబుగా నవనీశతిలక!
యిది నేను నవ్వితి; నిదియె నా తప్పు.
ఇది తప్ప నా మది నేమియు నెఱుఁగ
సదయాంతరంగ! మీ చరణంబులాన.”
..........నందఱయాత్మలలోన ననుమానములు వాసె నంతఁబుష్పకము
చనుదేర నిదియేమి? సరగునఁజెప్పు మనిన రావణుఁ జంపి యా రాఘవుండు
దివిజులు వొగడంగ దివ్యతేజమున దివిజులచెఱఁబాపి ధృతి విభీషణునిఁ
జంద్రార్కనభములు జలధులు ధరణి యింద్రదిక్పతులున్న యెల్లకాలంబు
లంకకు విభునిఁగా లలితసత్కీర్తి యంకించి పట్టంబు నలవడఁగట్టి
ప్రభుఁడు శ్రీరాముఁడు భానువంశజుఁడు అభయహస్తంబిచ్చె నఖిలలోకులకు.
నా పరమాత్మకుఁడైన శ్రీరామ భూపాలు నొద్దనె పోయి నీవుండు
మని కుబేరుఁడు నన్నుఁబనుప వచ్చితిని జననాథ! యనవుడు సెలఁగి భూవిభుఁడు
అచ్చుగా ధనదునియర్థంబ వనుచుఁ బుచ్చితిఁ గడఁక నిప్పుడు పుష్పకంబ
సచ్చరిత్రముతోడ సకలదేవతలు నిచ్చలు నినుఁజూచి నీ సేవసేయ
నాది దేవతలకు నావాసమైన నా దేవపురమున కా సమీపమున
నిమ్ముల నుండు నిన్నెప్పుడుఁదలఁతు రమ్ము వేగంబప్డు రయమున నీవు
క్రమ్మఱ నిప్పుడు కరమర్థితోడఁ బొమ్ము నీ వనవుడుఁబోయె బుష్పకము
నిర్మలకారుణ్య నిధి.......... ..........
యనవుడు నందఱు నాత్మలలోన
ననుమానములు వాసి యలరి రెంతయును.
నిర్మలకారుణ్యనిధి రాముఁడంత
నర్మిలి నిండార నందఱఁజూచి:
“యెల్ల తెఱంగుల నెల్లకార్యముల
నెల్ల ధర్మంబుల నేమఱ కెపుడు
గొనకొని సేయుఁడీ కోర్కి దీపింప
ననువొంద.”ననుచు నత్యాదరంబొప్పఁ
“బొం.”డని కడఁకతో బుద్ధులు గఱపి
యొండొండ ప్రియముల నూఱడఁబలికి
యనిలజసుగ్రీవు లాదిగాఁ గపుల
దనుజ విభీషణుఁదగ వీడుకొలుపఁ
గిష్కింధ కెలమి సుగ్రీవాదికపులు
నిష్కళంకాత్ములై నెమ్మితోఁజనిరి.
అంత విభీషణుఁ డా రాముఁజూచి యెంతయు భక్తితో నిలఁజాఁగి మ్రొక్కి
దేవ! యిచ్చటనె మీ దివ్యశ్రీపాద సేవ సేయుచు నుందుఁజనఁగ నేనొల్ల
మనుజేశ! నా మది మఱి నిల్వ దచట యనవుడు రఘురాముఁడతని కిట్లనియె.
నరయఁగా మా స్వామి యగుచున్నయట్టి శ్రీరంగధాము నిచ్చెద నీవు గొమ్ము
పోయి నీ వందు నెప్పుడు పూజసేయు మాయందు భక్తియు మఱువకు మెపుడు
ననుచు శ్రీరంగనాయకు నిచ్చె వేడ్క. ననలొత్త శ్రీరంగనాయకుఁగొనుచుఁ
జనియె లంకకు.......... ..........
(రచనాంతరము)
చనక లంకకు విభీషణుఁడు రామునకు ననియెను నపుడు కరాబ్జముల్ మొగిచి
జననాథ! నేను మీ చరణపద్మములు ఘనభక్తిఁ గొల్చి యిక్కడ నుండకున్న
మఱచెడివారు రామావనీనాథ! కఱకురక్కసులు నెక్కడనైన నున్న
ధర్మఘాతకుఁడైన దశకంఠునకును గూర్మితమ్ముఁడ నని కొదవ లెంచకయ
శరణన్న మాత్రానఁజేకొని లంకఁ జిరతర పట్టాభిషిక్తుఁ జేసితివి.
అదిగాన లంక కేనరుగంగ లేను సదయాంతరంగ! నీ చరణంబులాన
యనవుడు విని రాముఁ డా విభీషణుని ననువంద నా లింగనము సేసి పలికె.
నా మాఱుగా నీవు నయభక్తి మీఱఁ దామసింపక రంగధాముని నీకు
నిచ్చెదఁగొంపోయి యెలమిఁబూజింపు మచ్చపుభక్తితో నని యొసంగుటయు
నానంద మొదవంగ నా మందసంబు శ్రీనివాసునితోడ శిరసునఁజేర్చి
జననాథునకు మ్రొక్కి సంతోష మొదవ గొనకొన్న వేడ్కతోఁగొనిపోవ నపుడు
రాముఁడిట్లనియె నీ రంగనాయకుని భూమిని డింపక పొమ్మనుటయును
విని పోవుచుండ నవ్వేళ దేవతలు మనమునఁజింతించి మఱి లంకలోకిఁ
జేరినపిమ్మట శ్రీరంగధాముఁ గోరి సేవింపంగఁ గూడదు మనకు
వారిధి దాఁటిపోవకనె వంచించి చేరిక నుండంగఁ జేయంగవలయు
నని మనంబున సురలర్థితోఁదలఁచి ఘనతరమూషకగమనుండు రాఁగ
గణపతిఁబ్రార్థించి గణనాథ! నీవు ప్రణుతింపఁగా వటుభావంబుఁదాల్చి
దనుజునిచే రంగధాముని భూమి ననువందఁబెట్టించి యరుగుదెమ్మనిన
వెరవొప్ప నుభయకావేరితీరమున నరుగుచునుండంగ నట చేరఁబోయి
పొడచూప వేగిరమ్మున విభీషణుఁడు కడు పుబ్బినను వటుగ్రామణిఁజూచి
యీ మందసంబు నీ వించుక సేపు నోమికతోఁబట్టుకుండు మీ యనిన
నో విభీషణ! తడ వుండక రమ్ము నీవు వచ్చినదాఁక నేను ధరింతుఁ
దడవు వోయిన నేను దాళనంతటను జడియక యిప్పుడే చెప్పంగవలయు
ముమ్మాటు పిల్తునే ముదమొప్ప నిన్ను రమ్మనినంతలో రాకుంటివేని?
గట్టిగా నేను నిక్కడమందసంబుఁ బెట్టి పోవుదు నని బెదరించి యందె
పోవఁగా నేఁజలంబొదవ ముమ్మాఱు కావలెనని వటుగ్రామణి పిలిచి
పిలిచి మందస మందుఁబెట్టి నవ్వుచును బొలుపొందు వేడ్కతోఁబోయె నద్దివికి.
శమశాలి యా విభీషణుఁడు వేవేగ క్రమమునఁ దన శౌచకర్మంబు దీర్చి
చనుదెంచి శ్రీరంగశాయిమందసము ననువొంద నెత్తఁజాలక భీతి దనర
దీనచిత్తుండునై దేవాదిదేవు మానసంబునను బ్రేమంబున నిల్పి
ప్రార్థించుచుండ నా పరమేశ్వరుండు నర్థి విభీషణు కానతి యిచ్చె.
నిత్యనిత్యము నీవు నిచటికి వచ్చి యత్యంతభక్తిఁ బూజలు సమర్పింపు
మని యానతిచ్చిన నర్థిఁబూజించి చనియె లంకకు విభీషణుఁ.
చనియె లంకకు విభీషణుఁడర్థిఁదన్ను
దనుజులు గొలువ నుత్సవకేళిఁదేలి.
రాముఁడు మఱి యౌవరాజ్యంబునందు
సౌమిత్రిభరతులఁ జతురమానసులఁ
దగఁబ్రతిష్ఠించి యాతత రాజ్యభూతిఁ
దగిలి సుఖించుచుఁదాను సీతయును
సకలభోగంబుల సౌఖ్యంబు నొంది
యకలంకచిత్తుఁడై యనవరతంబు
వేదోచితాచారవిమలమార్గమున
నాది రాజన్యుల నందఱఁగడచి
పూజితానుష్ఠానములు నశ్వమేధ
వాజపేయాదికవరయాగతతులు
సొలవక చేయుచు సురల భూసురుల
నెలమి రక్షించుచు నేపు దీపింప
నిండారుధర్మైక నిష్ఠతోఁ బదునొ
కొండువేలేండ్లు దా నుర్విఁబాలించెఁ.
బాలించి యేలుచోఁ బ్రజలు దుఃఖములఁ
దూలరు; దురితముల్ దుర్భిక్షతతులు
గలుగ వెయ్యెడలను; గాలదోషములఁ
జలియింప వెన్నఁడు సత్యధర్మములు.
పరహితాచారతాత్పర్యంబులెల్లఁ
బురుషులయందును బొలుపారుచుండు.
ననియాంధ్రభాషభాషాధీశనిభుఁడు
వినుత కావ్యాగమవిమలమానసుఁడు
పాలితాచారుఁ డపారధీశరధి
భూలోకనిధి గోనబుద్ధభూవిభుఁడు
తమ తండ్రి విట్ఠలధరణీశుపేరఁ
గమనీయతరధైర్యకనకాద్రిపేరఁ
బనుగొన నరిగండభైరవుపేర
ఘనుపేర మీసరగండనిపేర
నలఘునిశ్చలదయాయతబుద్ధిపేర
లలితసద్గుణగణాలంకారుపేర
నాచంద్రతారార్కమై యొప్పుమిగిలి
భూచక్రమున నతిపూజ్యమై వెలయ
నసమానలలితశబ్దార్థసంగతుల
రసికమై చెలువొంద రామాయణమునఁ
బరగ నలంకారభావనల్ నిండఁ
గరమర్థి నీ యుద్ధకాండంబుఁజెప్పె.
నారూఢి నార్షేయమై యాదికావ్య
మై రసికానందమై యెల్లనాఁడు
నివ్వసుమతి నొప్పు నీ పుణ్యచరిత.
మెవ్వరు సదివిన నెవ్వరు వినిన
సామాదిబాహు వేదచయధామరామ
నామచింతామణి నవ్యభోగములు
పరహితాచారముల్ ప్రభువిచారములుఁ
బరిపూర్ణశక్తులుఁబ్రకటరాజ్యములు
నిర్మలకీర్తులు నిత్యసౌఖ్యములు
ధర్మైకనిష్ఠలు దానాభిరతులు
నాయురారోగ్యంబు లధికసంపదలుఁ
బాయక పాటిల్‌లు; బాప క్షయంబు
వరపుత్త్రలాభంబు వైరినాశనము
సరినొప్పు; ధనధాన్యచయసమృద్ధియును,
నే విఘ్నములు లేక యిండ్లలో నధిక
లావణ్యవతులైన లలనలపొందు,
నన్నలుఁదమ్ములు నభివృద్ధిఁబొంది
మన్ననతోఁగూడి మలసియుండుటయు,
సతతంబు దేవతాసంతర్పణంబుఁ
బితృగణతృప్తియుఁబెంపొందుచుండు;
నిది మోక్షసాధనం; బిది పాపహరము;
నిది దివ్య; మిది భవ్య;మిదియు శ్రీకరము
రమణీయలీల నీ రామాయణంబుఁ
గ్రమమొప్పఁబూజింపఁగల్గుఁబుణ్యములు;
వ్రాసినవారికి వరశుభోన్నతులు
వాసవలోకనివాసంబుఁగలుగు.
నెందాఁకఁగులగిరు లెందాఁక జలధు
లెందాఁక రవిచంద్రు లెందాఁకఁదార
లెందాఁక వేదంబు లెందాఁక దిశలు
నెందాఁక భువనంబు లేపు దీపించు
నందాఁక నీ కథ యక్షరానంద
సందోహదోహళాచారమై పరగు.
|