| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | భద్రుండు పౌరులాడు నిందావాక్యముల రామభద్రునకుఁ దెలుపుట |
| శా. | ఆ భద్రుండు వినమ్రుఁడై పలికె దేవా! నీవు పల్మాఱు న న్నీ భంగిన్ నిజమేమి దెల్పు మనినన్ హీనాత్మకుల్ పల్కుప ల్కే భావ్యం బని విన్నవింతు నది మీ కేలా వినన్? మూర్ఖులై యే భూపాలుర మెచ్చి రీ నరులు? వీ రేపాటి పాటింపఁగన్ | 197 |
| సీ. | కరుణగల్గిన రాజకంఠీరవునిఁ గన్న - మెత్తని వాఁడంచు మెచ్చ రతని దురుసుదండనలతో ధర యేలుదొరఁ గన్న - హింసాపరుండని యెంచ రతని ధైర్యసంపన్నుఁడౌ ధరణీశ్వరునిఁ గన్నఁ - గఠినచిత్తుండని కదియ రతని సుజనులఁబ్రోచు భూభుజునిఁ గన్నను బక్ష - పాతియం చలతిగాఁ జూతు రతని | |
| ఆ.వె. | నే వివేకవంతు లే మెఱుంగుదు? రట్టి యెఱుక లేని జనుల సరకు సేసి మొఱకుపలుకు వినెడికొఱకు మేకొనఁగ దే వరకుఁ దగునె? యాజివరకుమార? | 198 |
| కం. | ఐన, జనులాడుకొనియెడి నానోక్తులు వినఁదలంచి నన్నడిగిన మీ యానకు ‘వెఱచి గణించెద భానుకులాధీశ! వినుము పౌరులపలుకుల్ | 199 |
| సీ. | ఏ కళంకములేని యిక్ష్వాకుకులమున - సంభవించియు రామచంద్రుఁ డకట! తొడమీఁద నిడుకొని దోషాచరాగ్రణి - యెత్తుక చని లంక నేఁడుగాల ముంచిన యిల్లాలి నించుక కొంచక - మరలఁ దాఁగొని వచ్చి మరులు హెచ్చి యెబ్బెఱికము లేక యేలుచు నున్నాఁడు - చెఱుకువిల్కానికిఁ జిక్కినాఁడు | |
| గీ. | పగతు రే కాంతలను జెఱఁబట్టికొన్న బలిమి విడిపించుకొని తెచ్చి కలియవచ్చు ప్రజకు రాజానుమతము ధర్మంబు గాదె యనుచు గుమిగూడి పలికెద రవని జనులు | 200 |
| చం. | విని విని నేను వేసరితి వీథుల వీథుల నిట్టిమాటలే యనుకొనువార లూరఁ దఱ చజ్ఞుల నోరులు మూయవచ్చునే? యినకులనాథ! వారి నిఁక నేమనఁగూడు? నటంచుఁ దెల్పినన్ విని శితశూలముల్ చెవుల వ్రేసినలాగయి జాలిఁ జెందుచున్ | 201 |
| ఆ.వె. | అధిపుఁడొద్ద నున్న యాప్తులఁగనుఁగొని యీ విధంబు మీర లెఱిఁగియుండు దురె? యటన్న వారు శిరములు వంచుచు స్వామి! యేమి దెలుపువార మనిరి | 202 |
| చం. | ఎడఁద గలంగ రాముఁడొక యించుకసేపు మఱేమి మాటయున్ నుడువక మౌనమూని వెత నూల్కొన నివ్వెఱఁ గంది యంత న క్కడఁగల యాప్తులం బనిచి కంచుకి నొక్కనిఁ జేరఁ బిల్చి యి క్కడకు మదీయసోదరుల గ్రక్కునఁదోడ్కొని రమ్ము పొమ్మనన్ | 203 |
| తే.గీ. | వాఁడు నతిశీఘ్రచారియై వారి వారి గృహములకుఁ బోయి రామభూమీశ్వరాజ్ఞ యెఱుకచేసిన భరతాదు లిపుడు పిల్చు టేమొ? యని యాక్షణంబున నేఁగుదెంచి | 204 |
| సీ. | ఉస్సని నిగిడించు నూర్పుల బలువేఁడి - నించి కెమ్మోవి వాడించువాని నడఁగక యడరెడు నశ్రుధారల నడ్డ - గించి ఱెప్పల నప్పళించువాని నాశ్చర్యరసమగ్న మగు మానసంబుతో - నుఱక చేష్టలు దక్కియున్నవాని వెలవెలనై చాల వెడనవ్వు వహియించి - మురిపెంబు తఱిఁగిన మోమువాని | |
| గీ. | దైన్య మాకారమయిన చందమున నున్న వానిఁ దమయన్నఁ గనుగొని వారు వెఱఁగు పడి భయంపడి, తొక్కట పడి, కటకటఁ బడి, దిగుల్పడి, వఁడఁకుచు భక్తిఁ జేరి | 205 |
| ఉ. | ఏమిటి కింత వంత వహియించినవాఁడొ నృపాలుఁ డీ విధం బేమియొ? యెవ్వరేమి గణియించిరొ? యీ వెత లెట్లు దీఱునో? స్వామి కటంచుఁ జింతిలుచు సాఁగిలి మ్రొక్కిన కూర్మి తమ్ములన్ రాముఁడు ప్రేమ మీఱఁగఁ గరంబులఁ గ్రుచ్చి కవుంగిలించుచున్ | 206 |
| తే.గీ. | చెంత నందఱ నిడుకొని చేరెఁడేసి కన్నులను గ్రమ్ము కన్నీరు కరతలమున నప్పళించుచు గాద్గద్య మడఁచి యెప్ప టెలుఁగు నూల్కొల్పి వారల కిట్టు లనియె | 207 |