| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రామభద్రుండు పౌరవాక్యంబులఁ దమ్ముల కెఱింగించుట |
| మ. | అనుజత్వోచితవృత్తిఁ బూనియును నా యర్థంబుఁ బ్రాణంబు నా యనుఁగుంజుట్టము లాప్తులున్ సఖులు మీరై రాజ్యధౌరేయుఁగా నను మీరే యొనరించి కొల్తు రటుగానన్ బూనఁ బో నెద్దియై నను మీతోనన, కిప్పు డజ్ఞులను నిందావాక్యముల్ వింటిరే? | 208 |
| కం. | అనిన నిది యేమి నిందయొ? మనుకులపతి యెన్నఁ డిట్టి మాటాడఁడు తెం పున నని యొండొరు మొగములు గనుచుం దిగులొంది వినఁగఁ గాకుత్‌స్థుఁ డనున్ | 209 |
| చం. | చెఱఁగొని పోయి యాత్మపురిఁ జేర్చి దశాననుఁ డాసరేఁగి కీ డ్పఱిచిన సీతఁ దెచ్చుకొని భావజు త్రిక్కుల కొగ్గి, యెగ్గు సి గ్గెఱుఁగక కూడినాఁ డినకులేశ్వరుఁ డక్కట! క్షత్త్ర ధర్మముల్ మఱచెనొ? యంచు నన్నుఁ బ్రజ మాటికి దూఱెడి నేమిదెల్పుదున్ | 210 |
| చం. | పరుఁ డిపు డే వధూటిఁ జెఱఁబట్టిన వాని వధించి సాధ్వి యీ తరుణి యటంచుఁ జేకొనఁగ ధర్మువుగా వగనెంచె రాఘవే శ్వరుఁ డిక నేల శంక? యని క్ష్మాజను లాడెడిమాట లమ్ము లై యురువడి గుండెలో మెఱయుచున్నవి సోదరులార! యియ్యెడన్ | 211 |
| వ. | అని తన్నునుద్దేశించి బుద్దిలేని జనులాడుకొను సుద్దులు గొన్ని తద్దము వగపుతో నొద్దనున్న తమ్ముల కెఱింగించి, యద్దశరథుని పెద్దకొడుకు తుందుడుకు మెండుకొన, వెండియు లక్ష్మణుంగనుంగొని యిట్లనియె. | 212 |
| మ. | అవుఁగా! లక్ష్మణ! మున్నెఱుంగవె? సమస్తాదిత్యులున్ రుద్రులున్ భవనీరేజభవాదులున్ మునులు దిక్పాలు ర్విలోకింపఁగా నవనీకన్యక నేను నొల్లక మహోగ్రాగ్నిం బ్రవేశింపు మ న్న విధంబున్ సతి వహ్నిఁ జొచ్చుట రహిం ద్రైలోక్యమున్ మెచ్చుటల్ | 213 |
| ఉ. | అప్పుడు వచ్చి వహ్ని తన యాకృతితో ధరణీజఁదెచ్చి యీ యొప్పులకుప్ప సాధ్వి సుగుణోన్నత నే సకలాంతరాత్మ నై యెప్పుడుఁగాంతు నొచ్చె మొక యింతయు లేదని యప్పగింపఁడే? యప్పలుకుల్ నిజంబులని యాడరె? యచ్చటి వేల్పు లందఱున్ | 214 |
| చం. | అని మొనఁ బంక్తికంఠుఁ దునుమాడిన మేలు దలంచి యిచ్చకం బునకు ధరాజ మంచిదని బొంకిరొ వేల్పులు? సీత భావ మేఁ గనియును మూఢులిట్టు లనఁగాఁ గల రంచుఁ దలంచికాదె? య య్యనలము మండఁజేసి చొరుమంటిని దానిని నెంచరైరిగా! | 215 |
| ఉ. | పామరు లాడుమాట లొకపాటిగఁ బట్టి వితాకుఁజెందఁగా నేమిటి? కంచు మీరు వచియించిన నే జనులైనఁ దిట్టఁగా భూమిని నిందఁజెంది మృతిఁ బొందిన నయ్యపకీర్తిభాజనుం డామిహిరేందుతారముగ నాపదఁ బొందును రౌరవాదులన్ | 216 |
| కం. | వివృతస్వర్గద్వారం బవరజమణులార! పుణ్యయశ మందులకై సువివేకు లుత్సహింపుదు రవివేకులు గాంక్ష సేతు రపయశమునకున్ | 217 |
| కం. | క్షితిమీఁద బ్రతికియుండియు మృతిఁ బొందినవారు నింద లెనసినవారల్ మృతిఁ బొందియు బ్రతికిన ఘను లతినిర్మలకీర్తిదేహు లవరజులారా! | 218 |
| కం. | కాన సడికోడి ప్రాణము లైనను బ్రాణముల కెల్లఁ బ్రాణములను మి మ్మైనను ద్యజింతు ననఁగా జానకి నెడఁబాయు టెంత చర్చింపంగన్ | 219 |
| ఉ. | దీనతపాయ నెల్లసడి దీఱఁగ నేనిఁక జానకీసతిన్ గానలఁద్రోయఁ బంచుట సుఖం బని యెంచితి, మంచిదైనఁ గీ డైనను మంచి దంచు వినుఁ డడ్డము లాడి రేని మీకు నా యాన సుఁడీ! యటంచు విభుఁ డాడినఁ గొందల మందిరందఱున్ | 220 |
| కం. | జనవిభుఁ డంతట లక్ష్మణుఁ గనుఁగొని మీ వదినె నన్ను గాంగతటతపో వనులు గన వేడ్కపుట్టెడి నని వేఁడిన దట్టుగాన నదియె నెపమునన్ | 221 |
| శా. | పల్మాటల్ దలపెట్ట కర్కుఁ డుదయింపన్ రేపె యీ లోకనిం దల్మానంగ సుమంత్రచోదిత రథాధ్యాసీనఁ గావించి వ న్యల్ మోదంబునఁ జూడ రమ్మనుచుఁ గాన్తన్ నీవు గొంపోయి యా వాల్మీకుల్ వసియించు నాశ్రమము చేర్వన్ డించి రమ్మా! వెసన్ | 222 |
| తే.గీ. | ఇంతిపై నింత మూర్ఖత్వమేల? యనకు మవనిజకు నాకుఁ దీఱె ఋణానుబంధ మదియ కాదేని జనులిట్టు లాడుకొందు రయ్య? యిఁక నేల పలుమాట లాడుకొనఁగ? | 223 |
| కం. | అని యానతిచ్చి భరతా ద్యనుజుల గృహములకుఁ బనుప నానతముఖులై కనుఁగవల నశ్రు లొలుకఁగఁ జని రధిపుఁడు విన్ననగుచు సదనముఁ జేరెన్ | 224 |
| తే.గీ. | చేరి యవ్వారి యగు బాష్పవారిధార లరుణరుచి కన్నుఁదామర లాని నిదుర మాన్ప రేయెల్ల వెతఁజెందె మనుజనాథుఁ డలఁత నటులనె వేగించి రనుజు లెల్ల | 225 |
| కం. | లోకాపవాదమున నా క్ష్మాకన్యఁద్యజింప నెంచఁగానో యేమో? యాకొంత చనిన రాతిరి కాకుత్‌స్థున కొక్క బ్రహ్మకల్పం బయ్యెన్ | 226 |
| ఉ. | శ్రీరఘువంశవారినిధి శీతలధాముఁడు రాముఁ డంపఁగాఁ గోరిక గాంగతీరవనకోటులు జానకి చూడఁబోయెడిన్ దేరు సుమంత్ర! శీఘ్రమునఁ దెమ్మని పల్క రథం బతండు సిం గారము చేసి యశ్వములఁ గట్టి రయంబునఁ దెచ్చి నిల్పినన్ | 227 |
| ఉ. | జానకి నిందఁ జేసిన ప్రజన్ బలుకాఁకల ముంప రోషర క్తాననుఁడై వెలింగె నన నబ్జసఖుం డరుణారుణాంశుసం తానముతోఁ గనంబడినఁ దత్సమయోచిత కృత్యముల్ వెసం దా నొనరించి లక్ష్మణుఁడు ధైర్యముఁ బూని సుమంత్రుతో ననున్ | 228 |
| శా. | ఆ సౌమిత్రి దృఢాత్ముఁడౌట వగ దైన్యంబున్ ముఖాబ్జంబునన్ వీసం బంతయుఁ దోఁప నీక తెగువన్ వే వచ్చి సద్భక్తి సీ తాసీమంతినికిన్ వినమ్రుఁడయి మాతా! గాంగతీరాశ్రమే క్షా సక్తిన్ నిను నందుఁ దోడుకొని పొమ్మంచున్ విభుం డంపె నన్ | 229 |
| కం. | వచ్చితి రథంబు దెచ్చితి విచ్చేయు మటన్న సీత వేడుకపడుచున్ బొచ్చెంబు లేని కృప సెల విచ్చెనె పతి? యనఘ! పోదమే వనములకున్? | 230 |
| ఆ.వె. | అనిన నేమి యెఱుఁగ దక్కట! యీ ముగ్ధ యనదఁ జేసి యొంటి నడవిఁ ద్రోచి యెటులవత్తు ననుచు నెడఁదఁ దల్లడపడె లలన యెఱుఁగకుండ లక్ష్మణుండు | 231 |