ఇతిహాసములు ఉత్తరరామాయణము రామాజ్ఞచే లక్ష్మణుఁడు సీతను వాల్మీక్యాశ్రమంబునకుఁ దోడ్కొనిపోవుట
రామాజ్ఞచే లక్ష్మణుఁడు సీతను వాల్మీక్యాశ్రమంబునకుఁ దోడ్కొనిపోవుట
ఉ.అంబుజగంధి! యయ్యెడ మహర్షుల పత్నులకంచుఁగొన్ని హే
మాంబర రత్నభూషణ చయంబులు గైకొని యమ్మఱందియున్‌
వెంబడి నెక్కఁగా రథము వేడుకనెక్కి చిరత్నరత్నపీ
ఠంబున నుండె వాజుల హుటాహుటిఁ దోలె సుమంత్రుఁ డంతటన్‌
232
కం.రామాజ్ఞకు వెఱఁగందుచు
సౌమిత్రి భయార్తి దైన్య సంవృతమతియై
యేమియు ననకేఁగఁగఁ దో
డ్తో మహిజకుఁద్రోవనయ్యె దుశ్శకునంబుల్‌
233
కం.ఆ దుర్నిమిత్తములు గని
భూదేవికుమారి భీతిఁ బొంది మనస్స
మ్మోదంబు డింద నుడి నెం
తోదైన్యము మించ లక్ష్మణునితో ననియెన్‌
234
సీ.నరియఁడు దెరు వాఁగె గరుడియుఁ బాలయు - నెడమనుండియు వచ్చి కుడికి నిలిచెఁ
జెవుల పో తెదురయ్యెఁ జెమరుఁడా దెసఁ జూపెఁ - బలుమాఱు నిదె వించెఁ బైఁడికంటి
సుడిగాడ్పు తేరి నల్చుట్టుఁ జుట్టలు వెట్టెఁ - గడిదిమంటలు వెళ్ళఁ గ్రక్కె నక్క
యడ్డమై కాలాహి యదే పుట్టతుది కెక్కెఁ - గనుఁగొంటె ధ్వజముపై గ్రద్దలాడెఁ
 
గీ.గావిరి దిగంతముల నెల్లఁ గ్రమ్ముకొనియె
ధరణి దిరదిరఁ దిరుగుచందమునఁ దోఁచె
గగనమణి మాసెఁ బగలె ఘూకములు మ్రోసె
నన్న! లక్ష్మణ! యిది యేమి యాగడంబొ?
235
చం.మునుకొని యిట్లు దుశ్శకునముల్‌ గనిపించుటకున్‌ మెఱుంగు పె
ట్టినగతి నామనంబునఁ గడింది భయంబు జనించె దక్షిణాం
గనికరముల్‌ చలించె ధృతి గాసిలె మే నవశత్వమొందె నే
మని వివరించుదాన? జగమంతయుఁ బాడయి తోఁచెఁ జూడ్కికిన్‌
236
ఉ.నా సఖు నా మనోహరుని నా ప్రభు నా రఘురామదేవునిన్‌
బాసి వనాళి నున్న మునిపత్నులఁ జూచెదనంచు నేలపే
రాస గణించి వచ్చితి? హితాహితచింతలు లేనివారుగా
రే సతు? లంచు మాన్ప కతఁ డేమిటికిన్‌ వరమిచ్చె? లక్ష్మణా!
237
చం.నను మదికోర్కి దెల్పుమని నాధుఁడనన్‌ బదునాలుగేండ్లు చూ
చిన వనులింతెకా! యని విశేషము వేఱొకఁ డిచ్చగింప కే
మని వనిఁ జూడఁ గోరి తహహా యిటులన్‌ విపరీతకాంక్ష పొ
త్తునఁ జను పాపజాతికిని దుశ్శకునంబులు గాక యుండునే?
238
చం.కుమతి వినాశకాలమునకున్‌ విపరీతపుబుద్ధిఁ బూని య
క్రమములె కాంక్షఁ జేసి చెడుఁగావున నేనును గోరరాని ది
ష్టమని తలంచి దుర్దశఁ బడం బఱతెంచితి మీఁది దుర్దశా
సమితికి నీ నిమిత్తములె సాకిరిగావె? నృపాలనందనా!
239
చం.ధవు నెడఁబాసివచ్చు తెగుదారికి నాకిఁక వంతయేల? ని
య్యవశకునంబులం బొడము నాపదలన్నియు మాన్చి, రామభూ
ధవునకు నీకు నత్తలకుఁ దక్కిన బాంధవ పౌరకోటికిన్‌
వివిధ శుభంబు లీవలయు వేల్పు లటంచు నమస్కరించినన్‌
240
ఉ.ఆయమ చిత్తశుద్ధికి నయంబునకున్‌ వెఱఁగంది లక్ష్మణుం
డీ యఖిలైకమాత పతి నెప్పుడుఁ గూడి సుఖించునట్లుగాఁ
జేయక పాయఁజేసె విధి చేష్టగదా! యని నిందసేయు నే
మోయనఁ బోవు మాను వగ నుస్సురనున్‌ దలవంచు నయ్యెడన్‌
241
కం.అన్నవలా మిన్నయు నతఁ
డున్న తెఱఁగు దుశ్శకునము లుడుగక కన నౌ
చున్న తెఱంగును గనియును
మిన్నక చనె దైవగతిఁ గ్రమింపఁగఁ దరమే?
242
వ.ఇవ్విధంబున సీతాలక్ష్మణు లడవుల గడిచి, యేఱులు దాఁటి పర్వతంబులు క్రమించి, పక్కణాదు లతిక్రమించి చనిన ముందట243
కం.గోమతి నమృతరసోపమ
గోమతిఁ దరుపుంజమంజుకుంజోరుతటీ
గోమతి నుతికలితప్రతి
గోమతిఁ బ్రాపించి ప్రొద్దు గ్రుంకిన యంతన్‌
244
కం.సరిదంతికాశ్రమంబునఁ
దిరముగ నాఁడుండి వేగఁ దేరెక్కి మహో
ద్ధురగతి మధ్యాహ్నములో
నరిగిరి భాగీరధీతటాంతరమునకున్‌
245
వ.అప్పుడు246
ఉత్సాహచెంగటన్‌ గనెన్‌ లతాంగి శీతలానిలాహతో
త్తుంగభంగతీర సంగతుంగ నాగరంగ నా
రంగ రంగదంబుజాతరంగ నృత్త చంగ సా
రంగరంగ గంగ నంతరంగ మంతఁ బొంగఁగాన్‌
247
శా.ఈ చందంబున గంగఁ జూచి తనలో నింపొంది కీర్తించు సీ
తాచంద్రాస్యను లక్ష్మణుండు గని, యాత్మస్వామియాజ్ఞాపనం
బాచింతాభర మాయపప్రథము నింతైనన్‌ వినన్‌లేమి నెం
తే చెల్వొందెడి నీమె కా విసపుఁ బల్కేలా గిఁకన్‌ దెల్పుదున్‌
248
కం.అని నిలుపరాని వగపునఁ
గనుఁగవఁ గన్నీరు నించి కస్తిఁ బడెడియా
యనఁ గని వెతయు దిగులుఁ బెనఁ
గొనఁగా నజ్జనకరాజు కూఁతురు వల్కెన్‌
249
ఉ.విన్నఁదనంబు మించి పురి వెల్వడినప్పటినుంచి నీ మొగం
బున్న తెఱంగుఁగాంచి దిగు లొందుచు నుందు నిదేమి? యంచు మీ
యన్నకుఁ దత్సహోదరుల కాప్తులకున్‌ శుభమే కదన్న! నీ
కన్నుల నేల నశ్రువులు గ్రమ్మెడి? దెల్పఁగదన్న! లక్ష్మణా!
250
చం.అడవికిఁ దొల్లి శ్రీ దొఱఁగి యన్నను గొల్చుచు వచ్చునప్పుడున్‌
గడుసరి యింద్రజిత్తుని ముఖాముఖిఁ గయ్యము సేయునప్పుడున్‌
జడుఁడగు రావణాసురుని శక్తి యురంబున నాటినప్పుడున్‌
బొడమదు కంట నీ రిపుడు పుట్టిన దేటికొ? తండ్రి! తెల్పవే?
251
ఉ.మానసికవ్యధల్‌ రుజలు మాన్పఁగ నోపిన పుణ్యరాశి గం
గానదిఁ జేరియుండియును గస్తిపడం దగునయ్య! వేడ్కతో
నీ నది దాఁటి తాపసుల యింతులఁగన్గొని భూషణావళుల్‌
కానుక లిచ్చి దీవనలు గైకొని వత్తము రమ్ము చెచ్చెరన్‌
252
వ.అని పలికి లక్ష్మణుని దైన్యంబు గని తలంకి యక్కలికి మరల నిట్లనియె253
కం.కనరాని దుశ్శకునములు
గనినప్పటినుండి మనసు గలఁగెడు నాకున్‌
వనులేల? మరలిపోదమె?
నినుఁజూచిన నినుమడించె నెవ్వగ యనినన్‌
254
ఉ.కన్నుల నీరు గ్రుక్కుకొని గ్రక్కున లక్ష్మణదేవుఁ డన్న ము
న్నన్నది నెమ్మదిం దలఁచి యార్తి యొకించుక డించి తల్లిరో!
నిన్నటి దుర్నిమిత్తములె నెవ్వగఁ గూర్చె నయోధ్యకేల? మీ
రెన్నిన లీల నవ్వలికి నేఁగుద మంచు వచించి ధీరతన్‌
255
చం.అరదముడిగ్గి, యచ్చతురుఁ డచ్చట సారథినుంచి, యోడపై
ధరణిజ నెక్కఁ బంచి వెత దార్కొనఁదానును నెక్కి తత్సరి
త్తరణ మొనర్చి వేగఁ దటధారుణిఁ జేరియు శోకవార్ధిలోఁ
దరళమనస్కుఁడై మునిఁగి ధారగఁ గన్నుల నశ్రు లొల్కఁగన్‌
256
చం.జనకజమోము దీనత యెసంగఁ గనుంగొని యీరెలుంగుతో
జననిరొ! పాయదీ హృదయశల్యము శోకదవాగ్నిఁ గ్రాఁగుకం
టెను మరణంబె మేలు జననిందిత కృత్యముఁ బూని వచ్చితిన్‌
నను శపియించు మంచుఁ జరణంబుల చెంగట వ్రాలి యేడ్వఁగన్‌
257
కం.ఎదవడి పెదవులు దడుపుచు
నదవద నెద తాల్మి వదల నంగము గదలన్‌
దుదమొదలు లేనిదీనత
గదురఁగ జనకసుత యతనిఁ గనుఁగొని యనియెన్‌
258
ఉ.అన్న! యనేకదీనదశ లానినవేళలనైన మున్ను నీ
వెన్నఁడు నింతవంత వహియింపవు, ధైర్యము డింప వేల నేఁ
డిన్నెగు లొంది కుందెద? వహీన గుణాంబుధి వంచు నీ గుణం
బెన్నుదు రంద ఱెవ్వరికి నెగ్గు దలంచితి? వుగ్గడింపవే!
259
చం.పరసతులెల్లఁ దల్లులుగ భావనసేయుదు వెల్లవేళలన్‌
బరధన మన్న హాలహలభంగిగఁ జూతువు బొంకవెన్నఁడున్‌
బరుషము లాడ వెవ్వరిని బ్రాహ్మణభక్తియు రామసేవయు
న్దిరమగు నీకుఁ దండ్రి! జననిందిత కృత్యము లెవ్వి? యియ్యెడన్‌
260
కం.మన్నన దొలంగ నిను మీ
యన్న నిరాకరణ చేసి యాడెనొ? నీ కా
యన్నపయి భక్తి దొలఁగెనొ?
కన్నాయమ నేమియైనఁ గాఱించితివో!
261
కం.గురునింద నాచరించితొ
పరదూషణ చేసితివొ! కృపారహితుఁడవై
శరణన్నవారిఁ ద్రోచితొ
యరులకు వెన్నిచ్చి వేగ నరుదెంచితివో!
262
కం.రామాజ్ఞ లేకయే నను
దీమసమున నిందుఁ దోడి తెచ్చితొ నాపై
స్వామిమతి యెడసి యున్నదొ?
యేమిటి కడలెదవు? తండ్రి! యెఱిగింపగదే!
263
శా.సౌమిత్రీ! భయ మయ్యెడిన్‌ నుడువుమా క్ష్మాదేవి జామాత యా
శ్రీమత్పద్మదళాక్షుఁ డా రఘుకుల క్షీరాబ్ధి పూర్ణేందుఁ డా
హేమక్ష్మాధరధీరుఁ డా యసురమత్తేభేంద్రహర్యక్షుఁ డా
శ్యామాంగ ప్రభుఁ డా మహాప్రభుఁడు లెస్సైయున్నవాఁడే పురిన్‌
264
కం.మనుమార్గ నిరతుఁ డనఁగా
మను మానవపతి దయాభిమానచ్యుతుఁడై
నిను మానెనొ? నను మానెనొ?
యనుమానము మాని తెల్పు మను మానినితోన్‌
265
కం.తెలుపుటకుఁ గొంత చింతిలి
తెలుపక పోరాదటంచు దృఢనిశ్చయతన్‌
దలఁచుచు వడి లేచి కృతాం
జలియై యతఁ డశ్రు లొలుక జనకజ కనియెన్‌
266
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju