| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | లక్ష్మణుఁడు గంగ దాఁటి రామాజ్ఞను సీతాదేవికిఁదెల్పుట |
| ఉ. | ఇంతకుఁ బూని వచ్చి వచియింపక పోదునె? విన్ము తల్లి! దు శ్చింతులు దైత్యుచేఁ బడిన సీతను గ్రమ్మఱ నేలుచున్నవాఁ డెంత విమోహి రాముఁడని యెగ్గులు వల్కిన నాలకించి భూ కాంతుఁడు నిందఁ జెంది నినుఁ గానలలోపల డించిరమ్మనెన్ | 267 |
| కం. | క్షుల్లక జన దుష్టవచో భల్ల కదంబముల హృదయపద్మ మగల భూ వల్లభుఁ డోరిచె భవదా యల్లకభర మేమి వినియె? దమ్మరొ! యింకన్ | 268 |
| చం. | మునులు మహాతపోనిధు లమోఘదయాంబుధు లాశ్రయించు కా ననములు చేరి నీ విఁక దినమ్ములు త్రోయఁ గదమ్మ యంచు నీ యునికి కనర్హమైన యెడ లొప్ప గణింపఁగ నొగ్గె నాల్క నీ యనదతనంబు సైఁచె మది యమ్మరొ! యెంతటి కైతిఁ జూడుమా? | 269 |
| చం. | జనపతి లోకనిందఁ బడఁ జాలక నిన్ వనిఁద్రోయు మన్నచో విని సహియించి కానలకు వేగమునన్ గొని తెచ్చి నిల్వఁగాఁ జనునెడ లుగ్గడించి ధృతిసంపదఁ బొంపిరివోవుచున్నవాఁ డను ననువంటి మూర్ఖునకటా! విధి యే గతి సృష్టిసేసెనో? | 270 |
| ఉ. | అంచితవామలూరుజ వనాంతరభూముల నిన్ను డించి ర మ్మంచు రఘూద్వహుండనిచె నక్కట! యెక్కడ నిల్చి యెట్లు వే గించెదవమ్మ! యెవ్వరు సభీజనులయ్యెద? రమ్మ! యేమి యూ హించి దినంబులింకఁ గ్రమియించెద? వమ్మ పతివ్రతామణీ! | 271 |
| ఉ. | నీ విమల ప్రభావమును నీ వినయాదిక సద్గుణంబులు న్దేవుఁ డెఱింగియుండియును నిందలకుం బుయిలోడి యో జగ త్పావని! నీవు గోరిన నెపంబున నిచ్చటి కంపినాఁడుగా కీ విరహాబ్ధి నే కరణి నీఁదఁగలాఁ డతఁ డింకమీఁదటన్ | 272 |
| ఉ. | దాయలకైన నిట్టివెత దార్కొన నే గతిఁ జూడవచ్చు? ని న్నీ యటవీస్థలిన్ విడిచి యే నెటు లేఁగుదు? నన్ను నేల భూ నాయకుఁ డిట్టి బెడ్డిద మొనర్పఁగఁ బొమ్మనె? నెద్దియైననుం జేయఁగ నోడఁ డీ కఠిన చిత్తుఁ డటంచు నెఱింగి పంచెనో? | 273 |
| సీ. | మితిలేని యీ మిడిమేలంపు మెకములు - సకియల బలఁగమే? జనని! నీకుఁ బరికింపరాని యీ బలుమలల్ నవరత్న - మయచంద్రశాలలే? మాత! నీకుఁ గడు భీతి ముంచు నీ గహనముల్ విహరింపఁ - దగిన పూఁదోటలే? తల్లి! నీకు ఘోరనక్రభుజంగకోటితో మలయు నీ - హ్రదములు కొలఁకులే యంబ! నీకు | |
| గీ. | బంధురములైన యీ మహాప్రస్తరంబు లిందుమణివేదికలె? జనయిత్రి! నీకుఁ గటకటా! యొంటి నిచ్చోట నెటుల నిలిచె? దమ్మ! నీ యున్కి కే మందు నమ్మ! నేను | 274 |
| మ. | జననీ! నీవు మహాపతివ్రతవు, నీ సౌశీల్య మిల్లాండ్ర కె ల్లను మేల్బంతి, రఘూద్వహాంఘ్రియుగళీలగ్నాత్మ వై యుండు మీ యని నేనెవ్వఁడ విన్నవింపఁ బతిఁబాయం జేసి నిన్నొంటి డిం చిన పాపాత్ముఁడ నూరికేఁగు మనుచున్ సెల్విచ్చెదే నావుడున్ | 275 |
| కం. | అల్లల్ల యతని వచనము లెల్లన్ విని మొదలునఱుక నించుక వడిలోఁ ద్రెళ్ళెడి కదళిక వలె హా తల్లీ! యని బిట్టు సొరిగి ధరపైఁబడియెన్ | 276 |
| వ. | పడి చేడ్పడి బడిబడిన్ బొడముబడలిక నొడ లెఱుంగక రెండుగడియ లుండి, గొండొక దెలిసి, వెండియు నలసి యవశ యై దీనదశన్ బొరసి, యాకృశాంగి మరలఁ గన్నుఁదామరలు విచ్చి, విచ్చలవిడి వెడలెడియశ్రుజలధారా ప్రవాహంబులు చెక్కుటద్దంబులపై జాలువాఱి, జాళువామెఱుంగుపయ్యెద చెఱంగు మీఁదికి దిగజాఱి, యుత్తుంగతర స్తనకనకకలశంబులు నిండుకొనమెండుకొను నిట్టూర్పుసెగలన్ దగిలి, చిగురువాతెఱ తుకతుక నుడుక, నుడుగణంబుల బెడంగు నడంగఁద్రొక్కు చేర్చుక్క దెరలఁ దరళతరచికురనికరంబు లలికఫలకంబునఁ జెరలాడఁదు ఱిమిన విరులసరులతో నొఱవినకొప్పుపెన్నెఱు లంసభాగంబులం బొరలి పడ, జడుపుచెమ్మటలన్ గ్రమ్ముకొని నెమ్మేను గడగడ వడంకఁ, గడంక దక్కి చిన్ని మొగంబు విన్నఁదనంబున కిమ్ము జూపఁ బరితాపదవానలంబునఁ, బడి పురపురఁ బొక్కుచుఁ, దాల్మిదూలి స్రుక్కుచు లేచి కూర్చుండి, శోకరసం బాకారంబు దాల్చినచందంబునఁ, జిత్రంబు గాత్రంబుగైకొన్న చెన్నున, సాధ్వసంబు సాధ్వియైన కరణిన్, గరుణంబు కరణంబు లొందిన తెఱంగున, నూరక వెక్కి వెక్కి యేడ్చుచు, నేడుపు విడిచి మౌనంబుపూనుచు, మౌనంబు మాని తనలోఁ దానగుచు, నగ వుడిగి తల యూఁచుచుఁ, దల యూఁచుట విడిచి ముక్కుపై వ్రేలు గీలుగొలుపుచు, జాలిగొని హాహాకారంబు సలుపుచుఁ దలఁపనితలఁపు లివిగో! చూచితే? లక్ష్మణా! యని యతని దిక్కు చూడ్కులు నిగిడించి యిట్లనియె. | 277 |
| చం. | అడలకు మన్న! నీకు వసుధాధిపునానతి దాఁట వచ్చునే? యిడుమలఁ జెందు మంచు విధి యీ ధర నన్ను సృజించి యుండఁగాఁ గడవఁగ నెవ్వరోపుదురు? కానల కేఁగిన నాఁడె యాపదల్ గడచితి నంచునుంటి నెఱుఁగన్ దుది నిట్లగునంచు నా మదిన్ | 278 |
| కం. | ఆ దుర్నిమిత్తముల ఫల మీ దుఃఖము సేయకున్నె? యీ దుఃఖము లా పాదింప విధి తలంచియ కాదే? యీ కోర్కి నాకుఁ గలిగించుటయున్ | 279 |
| చం. | ఎడపక పూర్వజన్మముల నే మిథునంబులఁ బాయఁజేసి వా రడలఁగ నవ్వుచుండితినొ? యా యఘ మూరకపోనె? నాఁడు కా ఱడవుల రామపాదజలజాప్తి వసించితి నేఁడు నాథు పొం దెడసి యనాథనై యిచట నే గతి మేన భరింతుఁ బ్రాణముల్? | 280 |
| ఆ.వె. | ఏను సాధ్విననుచు నెల్లవారలు నన్ను సన్నుతింతు రనుచు సంతసింతుఁ గాని నడుమ నిట్టి కటిక నిందలు పుట్టి యడవిఁ ద్రోఁచు రాముఁ డనుచు నెఱుఁగ | 281 |
| చం. | కటకట! లక్ష్మణా! పిడుగుకంటెను బెట్టిదమైన మాట నేఁ డిటు విని యుండియున్ బగుల దింతలు నింతలుఁగాదు గుండె యె ప్పటివలె నున్న దీ కటిక భావముతో నసువుల్ భరించి యి య్యటవినె యింక నే వలన నాపద లొందఁగ నున్నదాననో? | 282 |
| చం. | కలవళ మంది తెల్పితివొ? కాక పరాకునఁ దప్ప వింటివో? కలనయినన్ రఘూద్వహుఁడు కానలలో ననుఁద్రోయఁబంచునే? తెలిసి గణింపు లక్ష్మణ! మతిభ్రమయైనదొ? హా! సహింపు మి ప్పలుకు లెఱుంగ కంటి వెతఁ బాటిలె నీ కొక భ్రాంతి యున్నదే? | 283 |
| ఉ. | ఎన్నటికన్ రఘూద్వహుని నేనును నన్నిఁక రామచంద్రుఁడున్ గన్నులఁ జూడఁగల్గ దొకొ? కల్గక యుండినఁ బ్రాణ మేలపో? దన్న! రఘుప్రవీరు చెవులారఁగ నింతయుఁదెల్పు-నాదు మే నున్నది చెంత గంగమడుఁ గున్నది యైనటులయ్యెడున్ దుదిన్ | 284 |
| చం. | పతిమది నెంచెనేమొ? తనుఁబాసి యశోకవనంబులోపలన్ బ్రతుకదె పెక్కు నాళ్ళనుచుఁ గ్రమ్మఱఁ దాఁ జనుదెంచు శత్రునిన్ హతునిఁగ జేయు నేలు ననునాసగదా బ్రతికించె నాఁటి కా గతి నిఁక నేమి యాసఁగొని కాయము నిల్పుదు? దెల్పు మిన్నియున్ | 285 |
| చం. | ఎఱుఁగని మూఢు లాడుకొను నెల్గులకున్ భయమంది యప్పుడే కఱకు మనంబుతో విభుఁడు కాననసీమకుఁ బంచెఁగాక య త్తెఱఁ గొకసారి నన్ బిలిచి తెల్పి మనోవ్యధ తీర్చి నిన్ను నే మఱనని పంపఁడయ్యె నభిమానముఁ గూర్మియు నెందుఁబోయెనో! | 286 |
| కం. | ఆ కరుణ యా ప్రసన్నత యా కూరిమి యా ప్రియోక్తి యా గౌరవమున్ గాకుత్‌స్థుఁడు మఱచెఁగదా! యాకస్మికముగ జనించు నపవాదమునన్ | 287 |
| శా. | ఆ కర్ణాయతనేత్రమై మణిమయోద్యత్కుండలద్వంద్వశో భాకీర్ణాంచితగల్లమై సురదనంబై సుందరభ్రూయుతం బై కమ్రస్మిత చంద్రికా విలసితంబై యొప్పు శ్రీరాము మో మీ కాయంబునఁ జూచు భాగ్యమిఁక లేదేమో? సుమిత్త్రాత్మజా! | 288 |
| సీ. | అవని నయోనిజ నయిపుట్టి మిథిలేంద్రు - వీట నేఁ బెరిఁగిన విధము వినరొ? యంగరాగము లిచ్చి యనసూయ మొదలైన - సతులెంచుకొన్నది చాల వినరొ? యా లంకలోఁదొల్లి త్రైలోక్యము నుతింప - వహ్నినేఁ జొచ్చినవార్త వినరొ? యీ సీత నిర్దోష యేలుకొమ్మని రాము - బ్రహ్మాదు లపుడన్న పలుకు వినరొ? | |
| ఆ.వె. | వినియుఁగనియుఁ బ్రజలు నను నింద సేయుట యంత మాత్రమునకె యధిపుఁ డులికి యింత తెగువ సేయ నిచ్చగించుట నాయ భాగ్యమింతె యొకరిఁ బల్క నేల? | 289 |
| చం. | వనముల కేల వచ్చితివి? వల్లభునిం బెడఁబాసి యొంటిగా నని మునిపత్నులెల్ల గుమియై యడుగన్ ధృతిమాలివారి కే మని వివరింతు? నింత విపదంబుధి నే కరణిన్ దరింతు నే యనువున నీ ప్రతిక్షణమహాయుగముల్ గ్రమియింతు? లక్ష్మణా! | 290 |
| వ. | అని పెక్కు వగల నమ్మగువ వగలంబొగిలి మగని తెగువకుఁ బరితపించియు నించుక తగవుఁ దలంచి, తెగువ వహించి బహిర్లిఖిత చిత్రంబు కొమరొంది యున్న యమ్మఱఁదితో మఱియు నిట్లనియె. | 291 |
| చం. | వగపునఁ దోఁచి నన్నియు నవారణఁ బల్కితిఁగాక భర్తకున్ జగదపవాదమున్ గడువ శక్యమె? నేను వియోగమగ్నతన్ తెగువకుఁ జొచ్చి రాము జననిందితుఁజేయుదునే? తదాజ్ఞ యె ల్ల గతులఁబూని కానల మెలంగుదు మేను గలంతకాలమున్ | 292 |
| సీ. | అన్న! లక్ష్మణ! యింక నాలస్య మేటికిఁ? - జను మయోధ్యాపురంబునకు నీవు మువ్వురత్తలకును మ్రొక్కితి నని తెల్పు - మచటి బంధులనెల్ల నడిగితి నను మతికృపాళునకు రామావనీంద్రునకు నా - మ్రొక్కుగా నతిభక్తి మ్రొక్కు మీవు తన యాజ్ఞఁ దలఁదాల్చి జననింద తనుఁజెంద - నీక, కానలఁ జరియింతు ననుము | |
| గీ. | భూజనుల బాంధవుల లెస్స ప్రోవు మనుము తలఁప నా కేడుగడయును దానె యనుము భావమెప్పుడు దన మూర్తిఁ బాయదనుము నెమ్మి యొకకొంత నామీఁద నిల్పు మనుము | 293 |
| తే.గీ. | పోయిరమ్ము, శుభంబులు పొందు నిన్ను నన్ను మఱవక యుండు మా యన్న! యనుచుఁ గన్నుఁగవ నశ్రుధారలు గ్రమ్ముకొనఁగ నన్నెలంతుక దీనయై యడలుచున్న | 294 |
| కం. | చనఁ గాళ్ళు రాక చన కిఁక జన దని ధేనువును బాయఁజాలని వత్సం బును బోలి జాలిగొని యో జననీ! జననాథుఁ గొలువఁ జనుదునె? యనుచున్ | 295 |
| ఉ. | అల్లనమ్రొక్కి కాళ్ళు వడఁకాడఁ బ్రదక్షిణ మాచరించి మే నెల్లఁజలింప హోరుమని యేడ్చుచుఁ బెద్దయెలుంగుతోడ మా తల్లిని డించి పోయెదను దాపసకామినులార! కూర్మి సం ధిల్లగఁ బ్రోవరే యనుచు దీనత లక్ష్మణుఁడేఁగె నయ్యెడన్ | 296 |
| ఆ.వె. | ఏఁగి నావ యెక్కి యెడఁద దల్లడపడఁ దిరిగి తిరిగి సీత దిక్కుఁగనుచు దిక్కు కలిగి నీకు దిక్కులే దాయెఁగా? తల్లి! యనుచు నవలి తటముఁ జేరి | 297 |
| కం. | తీఱని వగ నందుండెడి తేరెక్కి సుమంత్ర! యెంత దీనత వచ్చెన్? శ్రీరామ లీల మీఱెడి శ్రీరామవధూటి కనుచుఁ జింతిలు కొనుచున్ | 298 |
| కం. | చనుచుండె నిచట సీతా వనజాక్షియు నతఁడు మరలి వచ్చునొ యని యా యన చనినత్రోవఁ బలుమఱుఁ గనుచున్ విధి దూరికొనుచుఁ గటకట! యనుచున్ | 299 |
| తే.గీ. | రమణి మఱికొంతవడిదాకఁ రథముఁ జూచుఁ దరుణి మఱికొంతసేపు కేతనముఁజూచుఁ గాంత మఱిమీఁద రథపరాగంబుఁ జూచుఁ బడఁతి మఱియంతటను వట్టి బయలు సూచు | 300 |
| ఆ.వె. | చూచి చూచి చొక్కి స్రుక్కి తాలిమి దక్కి వగలఁ బొగిలి యూర్పు సెగల నొగిలి దిగులు దగులఁ గుంది వగఁజెంది బెగడొంది యలసి సొలసి మూర్ఛ లొలసి తెలిసి | 301 |