ఇతిహాసములు ఉత్తరరామాయణము సీత శోకించుట
సీత శోకించుట
వ.అచ్చెలువ తన్ను మున్ను ముచ్చట లడుగునప్పు డప్పుడమిఱేఁడు చేసిన చెయ్వులఁ దలంచుకొని302
సీ.ఒడిమీఁద నిడుకొని యురముపైఁ జేర్చుట - చేరిక కది కడసారి యేమొ?
చెక్కుఁజెమ్మటలను చెఱఁగునఁ దుడుచుట - చెలిమికి నది తుది చీటియేమొ?
పుక్కిటితావి కప్పుర వీడె మిచ్చుట - యనురాగమున కది యవధియేమొ?
కోరినపని కియ్యకొనుటది కరుణా ప్ర - బంధమ్మునకు ఫలగ్రంథమేమొ?
 
గీ.మోము మోమునఁగదియించి ముద్దుగొనుట
యదియె మోహంపుఁబనికి దీఱుదల యేమొ?
యెల నగవుదేరఁజూచి లోపలి కనుచుట
మేలు చిన్నెల కది పొలిమేరయేమొ?
303
మ.అని దుఃఖించు నపప్రథం దెలుప కాహా! భూవిభుం డింత వం
చనఁగావించునె? యంచు విన్ననగు, నే చందంబునం దెల్పి పొ
మ్మను మోమోడక? యంచునెంచుఁ బతిఁ బాయంజేసితే! దైవమా?
యను నింకెవ్వరు దిక్కనున్‌ దొలఁగ వీ ప్రాణంబు లేలా! యనున్‌
304
కం.అమ్మా! యనఁ బలుకవు నా
యమ్మా! యనుఁ, జాహ్నవీ! దయానిధీ! ననుఁజే
కొమ్మా యనుఁ గలశాంబుధి
కొమ్మా యను ఖగమృగములు గుమిగొని యడలన్‌
305
వ.ఇవ్విధంబున306
సీ.వనవిహారమున భూవరుఁ డాడు నర్మముల్‌ - మమతఁ దలంచి కంపము వహించు
జలకేళిఁ దేలుచోఁ జెలువుఁడు గావించు - పరిహాసకము లెంచి పరితపించు
భోజనాదులవేళ రాజేంద్రుఁ డొనరించు - బహుమాన మూహించి భ్రాంతి మించు
ద్యూతాదికములందు దొర యెఱంగని యట్ల - కళ లంటుట గణించి కళవళించు
 
గీ.నేకశయ్యా విహారంబు లెంచి యెంచి
ప్రణయకలహాంతరముల వగల్‌ పలికి పలికి
వలపు ముచ్చట లెదఁ జేర్చి వనరి వనరి
యింతి విలపించెఁ గలకంఠులెల్లఁ గదియ
307
కం.కాంతారత్నంబిటు ల
క్కాంతారమునందు వగవఁగా ఫలముల క
చ్చెంతఁ జరియించుముని సుతు
లంతయు విని వచ్చి చూచి యరుదంది వెసన్‌
308
శా.ఆ వాల్మీకుల చెంతకేఁగి నతులై యయ్యా! విముక్తాబ్జ యౌ
శ్రీవామాక్షియొ? ధాత్రికిం దిగిన జేజేరాజు దేవేరియో?
నా వెల్గొందు లతాంగి యోర్తు వనిలోనం దీనయై బెట్టు వా
పోవం గన్గొని తెల్ప వచ్చితిమి యప్పూఁబోఁడిఁగావం దగున్‌
309
చం.అని మునిబాలకుల్‌ దెలుప నమ్ముని యాంతరదృష్టి నంతయున్‌
గని రఘురాముదేవి! జనకక్షితిపాత్మజ! యంచుఁబల్కి, గ్ర
క్కున వటులర్ఘ్య పాత్రగొని కొల్చుచు వెంబడి నేఁగుదేరఁ బా
యనిదయ నెమ్మనంబు మొనయన్‌ జని గాంగతటంబు చెంగటన్‌
310
చం.ఉడుగక తేరు చన్న దెస నూనిన చూడ్కులుఁ గన్గొలంకులన్‌
విడువక పాఱునశ్రువుల వెల్లువ, లూఱటలేని యూర్పులున్‌
గడ యిడరాని చింత యెడఁగాంచని చెక్కిలికేలు, ధూళిబ్రుం
గుడువడు మేనునున్‌ గలిగి కుందెడిజానకిఁ గాంచి కూరిమిన్‌
311
శా.చేరన్‌ బోయినఁ జప్పు డింత విని యా సీతాంబుజాతాక్షి య
క్కారుణ్యాంబుధి నత్తపోధనమణిం గన్నీరు లేఁజెక్కులన్‌
జాఱన్‌ ఱెప్పలొకింత యెత్తి కని విశ్వాసమ్ము నిశ్శ్వాసమున్‌
మీఱన్‌ బెట్టుగ నేడ్చుచున్‌ జరణసామీప్యంబునన్‌ వ్రాలినన్‌
312
మ.యతిమూర్ధన్యుఁడు బుజ్జగించి వగపేలా? పుత్త్రి! నీ సద్గుణో
న్నతి నీ భర్త యెఱింగియున్‌, బ్రజల నిన్దల్‌ దాల్మిఁ గుందింపఁగా
ధృతి నీ తెం పొనరించె నింతయు మనోదృష్టిన్‌ విచారించి వ
చ్చితి నన్నున్‌ మిథిలాధినాధువలె నీ చిత్తంబులో నెంచుమా
313
చం.అఱమఱయేల? నే నిలుచు నాశ్రమదేశము నీది కాదె? నీ
కెఱబఱికంబు లేక ఇఁక నిచ్చట నున్న తపస్వికాంత లం
దఱు నుచితోపచారము లొనర్పఁగలారు వివేకశాలినుల్‌
మఱతురె తెల్వి? దైవగతి మాన్పఁగ నెవ్వరి కైన శక్యమే
314
చం.జనకుఁడు తండ్రి, సద్గుణ విశాలుఁడు పంక్తిరథుండు మామ, దు
ర్జన భుజగర్వవైభవ విరాముఁడు రాముఁడు భర్త నీకు నీ
వనుపమధర్మమర్మనిధి వజ్ఞతఁజెందకు నాదునాజ్ఞఁజే
కొని చరియింపు మేల వెతఁ గుందెద వర్ఘ్యముఁ గొమ్ము మానినీ!
315
కం.అమ్మా! యూరక వగవక
లెమ్మా! నా వనము నీకు లీలావన మౌ
రమ్మా! యివె జలములు చే
కొమ్మా! నీ ముఖము గడిగి కొమ్మా! యనుచున్‌
316
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju