ఇతిహాసములు ఉత్తరరామాయణము వాల్మీకి సీతనూఱడించి తన యాశ్రమంబునకుఁదోడ్కొని పోవుట
వాల్మీకి సీతనూఱడించి తన యాశ్రమంబునకుఁదోడ్కొని పోవుట
ఆ.వె.అనునయించి యర్ఘ్య మాయమ కిప్పించి
మౌనిమణి నిజాశ్రమంబునకును
గూర్మితోడఁ దోడుకొని పోయె నిర్వ్యాజ
బంధుజనులుగారె బ్రహ్మమునులు
317
కం.సీతాసతితో నిటులఁ బ్ర
చేతసుని సుతుండు వనముఁ జేరి తనకు సం
ప్రీతిమెయి నతులొనర్చు మ
హాతాపససతులఁ జూచి యతులమతి ననున్‌
318
ఉ.రాజకులాభిరాముఁడగు రాముని దేవి, విదేహధారుణీ
రాజకుమారి పంక్తిరథరాజబిడౌజుని పెద్ద కోడ లీ
రాజముఖీలలామ, యల రాజసహోదరిఁబోలు నీమెకున్‌
బూజలు సేయఁగాఁ దగుఁ దపోధనకాంతలు! మీరలందఱున్‌
319
చం.చెడుగులు రావణాసురునిచే జెఱవోయినకాంతఁ దెచ్చి యే
లెడు నని తన్నుఁ బల్కినఁ జలించి రఘూద్వహుఁడీమె సద్గుణం
బెడఁద నెఱింగియున్‌ సడి వహించక కానల కంపినాఁడు మీ
రెడపక యీమెఁబ్రోవుఁడని యింతిని వారల కప్పగించినన్‌
320
ఉ.వారు మహాప్రసాదమని వామవిలోచన గారవించి యెం
తోరహిఁ బర్ణశాలలకుఁ దోడ్కొనిపోయి యథోచితంబుగా
సారెకువంతు లూని, యుపచారము సేయుచునుండి రంత న
క్కారుణికుండు చెందె నతికౌతుక మూఱడిలెన్‌ వధూటియున్‌
321
సీ.రంగారు బంగారు చెంగావులు ధరించు - శృంగారవతి నార చీర లూనె!
భూజనంబులు మెచ్చు భోజనంబు లొనర్చు - కమలాక్షి కందమూలములు నమలెఁ
జంద్రకాంత విశాలచంద్రశాలలనుండు - జవ్వని వనిఁ బర్ణశాల నుండె!
మరులుతో శ్రీరాము నురముపైఁ బవళించు - బాలికామణి యొంటిఁ బవ్వళించెఁ
 
గీ.గన్నుసన్నల శుద్ధాంతకాంత లాచ
రించుసేవలు మెచ్చని కాంచనాంగి
యొగ్గె మునిముగ్ధకాంతాకృతోపచార
విధికి నెంచ నసాధ్యంబు విధికిఁ గలదె?
322
ఉ.అక్కడ లక్ష్మణుండు నటులాతురుఁడై చనుచుండి త్రోవలో
స్రుక్కుచు సద్వినీతుఁడగు సూతునిఁజూచి, సుమంత్ర! చూచితే?
యక్కట నిర్నిమిత్తము ధరాత్మజకెంత యుపాధి వచ్చెఁ దా
నెక్కటి నైతి నంచు వెత నెక్కడఁ బ్రాణము వీడునోకదే?
323
చం.అడవులఁ బెక్కు నాళ్ళిడిములంది విభుం బెడఁబాసి దైత్యుచేఁ
బడి, యిల నెవ్వరుం బడనిపాట్లకు లోనయి. ప్రత్యయార్థమై
యడరెడు చిచ్చుఁ జొచ్చి యతియత్నమునన్‌ సుఖమింత చెందినన్‌
గడపట జానకీసతికిఁ గాఁపురముం గడతేఱ దాయెఁగా
324
మ.శివు కోదండము ద్రుంచె, వాలి నడచెన్‌, జేపట్టె సుగ్రీవునిన్‌
బ్లవగశ్రేణులనేలె క్షారజలధిన్‌ బంధించెఁ బౌలస్త్యు నా
హవభూమిన్‌ దెగటార్చె, నీ వనితకై యర్కాన్వయస్వామి య
ట్టి వధూటిన్‌ బెడబాసి నిల్వఁగఁగలాఁడే తాల్మిచిత్తంబునన్‌?
325
కం.జనులంద ఱాడుకొనియెద
రనికద పతి సీత విడిచె నవనిజ తాపం
బున నగు పాపము జనులదొ?
జననాథునిదో? గణింపు సారథి! యనుచున్‌
326
చం.వగచుచుఁ బల్కు లక్ష్మణుని వాక్కులు సారథి యాలకించి కేల్‌
మొగిచి వచించె నేల వెత? మోదము ఖేదముఁ గాలపద్ధతిన్‌
దగులుచునుండు నెవ్వరికి దైవముముందరఁ బౌరుషంబు పెం
పగునె? మహాత్మ! తొల్లి బుధులాడిన మాటలు విన్ము తెల్పెదన్‌
327
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju