| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | సుమంత్రుఁడు లక్ష్మణునకు దుర్వాసు వాక్యంబులు దెలిపి యూఱడించుట |
| తే.గీ. | ధర్మనిధియైన మీ తండ్రి దశరథావ నీశుఁ డొకనాఁడు నిజపురోహితునిఁ జూడఁ దలఁచి రథమెక్కి సూతకృత్యంబు నేను బూనఁగ వసిష్ఠమునివనంబునకుఁ బోయి | 328 |
| శా. | ఆ సత్రంబున కేకవార్షికమఖ వ్యాసక్తిమై వచ్చి దు ర్వాసుండున్ గురుచెంత నున్కిఁగని దీవ్యద్వహ్నిభానుద్యుతుల్ భాసిల్లం దగువారిఁ జేరఁజని సద్భక్తిన్ నతుల్ సేసి త త్ప్రాసన్న్యంబున కుబ్బుచున్ గొలిచి భూపాలుండు వర్తిల్లఁగన్ | 329 |
| తే.గీ. | అతిథివైతివె మాయింటి కధిప! యనుచుఁ గందమూలాదికములు వేడ్కల నొసంగి తామును భుజించి యమ్మునుల్ తగినమాట లాడుచు వసింప నవసరంబరసి విభుఁడు | 330 |
| కం. | అల దుర్వాసోముని కం జలిఁజేసి మహాత్మ! రామచంద్రుం డెన్నా ళ్ళిల యేలుఁ? గొడుకు లెందఱు గలిగెద రాయుఃప్రమాణగతి యెయ్యదియో? | 331 |
| తే.గీ. | అతని తమ్ముల బ్రతుకెట్టి దర్కవంశ మవని నెందాఁక వర్తించు? ననఘచరిత! యానతీఁదగు నంతయుననినఁ గరుణ పొడమి మీ తండ్రి కయ్యత్రిపుత్త్రుఁ డనియె | 332 |
| కం. | అనఘా! నీ తనయాగ్రణి విను మీ ధరఁ బదునొకండు వేలేండ్లేలున్ మును లెంచఁ బెక్కుయాగము లొనరించును బిదపఁ బుత్త్రయుగ్మముఁ గాంచున్ | 333 |
| కం. | అం దగ్రసుతు నయోధ్యకుఁ బొందుగఁ బతిఁ జేయు నాప్తబుధమంత్రి సుహృ ద్బృందముతో నానందముఁ బొందుచుఁ దుది బ్రహ్మలోకమునకుం బోవున్ | 334 |
| ఆ.వె. | కొదువ ముగురు పుత్త్రకుల కిర్వు రిరువురు పుత్త్రు లొదవి యన్యభూము లేలఁ గలరు, పెద్దకాల మిల నిల్చు నిక్ష్వాకు వంశ మింక నొక్క వార్త వినుము | 335 |
| మ. | ధరణీజం బెడఁబాసి రామవసుధాధ్యక్షుండు పెక్కేండ్లు త ద్విరహం బొందెడి కారణంబుగల దావృత్తాంత మే మంటివా? పరిపాటిన్ వినిపింతు విన్ము, దివిజుల్ భంగించినన్ దైత్యులా తురులై మున్ భృగుపత్ని మర్వు సొర, నెంతో కూర్మి నక్కాంతయున్ | 336 |
| ఆ.వె. | వారి కభయ మిచ్చి వైరుల వారింప నసురవైరి చేరి యప్పురంధ్రి శిరము చక్రధార ఛేదించి దైత్యుల సంహరింప భృగువు చాలఁగినిసి | 337 |
| ఉ. | దేవుడవంచు మిమ్మును నుతింపుదు రందఱు నింత క్రూరతన్ స్త్రీవధ యెట్లు చేసితివి? శ్రీధర! యీ కొల చెందకుండఁగాఁ బోవునె? మానవత్వమున భూమిని నీ విఁకఁబుట్టి యాత్మప త్నీవిరహాప్తి వందురు మనేకదినంబు లటంచుఁ దిట్టినన్ | 338 |
| కం. | హరి కిచ్చిన యా శాపమె పొరసె నతని, మరల ఋషుల బోధల నతఁ డా హరిఁ బొగడి మాన్చె శాపము హరికథ లెట్లైన మేలె! యది యేల? నృపా! | 339 |
| కం. | ఆ భృగుశాపము వారిజ నాభుఁడు వహియించి నీకు నందనుఁ డయ్యెన్ నీ భాగ్య మెంచఁ దగునెక దా భూవర! రాముఁడొందుఁ దత్ఫల మింకన్ | 340 |
| కం. | హరికైన హరున కైనన్ బరమేష్ఠికినైన విప్రభాషలు ద్రోయన్ దరమగునే? యని లీలా హరుఁ డమ్ముని దెలుప నృపతి యద్భుతమందెన్ | 341 |
| తే.గీ. | ఈ రహస్యంబు పురిఁ జేరునెడ, నృపాలుఁ డానతిచ్చిన నే వింటి నంతెకాని యెవ్వరు నెఱుంగ రీ వార్త నిపుడు బొగుల ననఘ! తెల్పితి నిది నిల్పు మాత్మయందు | 342 |
| చం. | కతిపయవర్షముల్ చనినఁ గార్యము లన్నియుఁ దీర్చి రామభూ పతి మిము మున్నుగాఁ బనిచి బ్రహ్మపదంబున కేఁగు సీతకై వెత పని లేదనన్ ధృతియు వేడుకయున్ వహియించి లక్ష్మణుం డతని నుతించుచున్ జని రయంబున గోమతిఁ జేరె నాఁటికిన్ | 343 |
| కం. | మఱునాఁ డరుణోదయమున నరదము సూతుండు వన్న నతఁ డెక్కి మహా త్వర మధ్యాహ్నములోపల నురువిమతాయోధ్య యగునయోధ్యకుఁ జనియెన్ | 344 |
| వ. | చని దీనాననుం డై పురద్వారంబు సొచ్చి, యచ్చట నెవ్వరిం జూడక తలవంచికొని రాజమార్గంబునం జనుచున్న తన దైన్యంబును జానకీశూన్యంబైన రథంబునుం గనుంగొని, పురజనులు గుంపులు గూడుకొని, సవసవలుగా నిన్న మనము విన్నది నిజంబై తోఁచుచున్నది చూడుఁడు చూడుండని గుసగుసలం బోవువారును, ఇంతలేసి సంసారచ్ఛేదంబులు మన యూరిపుణ్యాత్ముల వలననే కదా యయ్యె నింక నేనోరు పెట్టుకొని మాటలాడుద మనువారు, నింతమాత్రంబునకే రామభూకాంతుండు నింతసాహసంబు సేయ వచ్చునే? యనువారును, నిట్టిసాహసంబు చేయకున్న నిమ్మహాపవాదంబు భూపాలుం డేపగిదిన్ బాపుకొన నోపు? ననువారును, నట్టిరట్టు వినినప్పుడె చెట్టుపడి పుట్టినకోపంబుఁ బట్టఁజాలక పాపపుణ్యంబులు కట్టిఁడి ప్రజమీఁదఁ బెట్టి పట్టభద్రుం డిట్టిబెట్టిదంపుఁబని సేసెనే నతని నట్టిట్టనఁ గూడునే? యనువారును, నెఱుక మాలి మొఱకుతనంబుతో నట్టి పరమపతివ్రతం బలికినవారిఁకఁ జల్లఁగా బ్రతికెద రనువారును, వీరి బ్రతుకు బంగారమయ్యె నిప్పుడు బంగారువంటి కాఁపురంబు విడిచి యా శృంగారవతి కాఱడవుల బడి బడలికతో నడలుచున్నదిగదా! యనువారును, నిందు నేవురు గలిగి దిక్కులేనిదానివలెఁ గానలంబడి తల్లీ! యెంత సంతాపించెద వోయని సీతాకాంతం దలంచుకొని దుఃఖించువారును, దైవమా! యిటువంటి యగచాట్లు పగవారికైనం దగవుసుమీయని కన్నీరు నించువారును, పూచినతంగెడువలె సింగారించిన రథంబువలెఁ గన్నులపండు వగునిండుచూలాలిఁ గారడవులపాలు సేసి తాళవచ్చునే? మన జనపాలుం డేలాగునఁ దాల్మి దాల్చి నిల్చినవాఁడో? యనువారునునై, ధరణిజ లేని శూన్యస్యందనంబుఁ జూచి హాహాకారంబులతో నొక రొకళ్ళగృహంబులు గానక పరితపించువారును నై, పలు చందంబులం బలుక నాలకించుచు, నేనుంగు మొగసాలకడ రథంబు డిగ్గి, సుమంత్రుని సగౌరవంబుగా నింటికిం బనిచి, నట్టడవులలో మీ పట్టంపుదేవిని విడిచివెట్టి వచ్చితినని యీ గొట్టుమాట దిట్టతనంబుతో నధిపతింజేరి యింక నెట్టు విన్నపంబు సేయుదు? దైన్యరసంబునకు సదనంబగు శ్రీరామదేవుని వదనంబుఁ జూచి యే చందంబునఁ దాళుదునని తహతహపడుచు, విన్ననై కొన్ని కక్ష్యాంతరంబులు గడచి రాయంచలేని కొలంకువలె, రత్నంబులేని పెట్టియవలెఁ బద్మలేని పద్మంబునవలె; జంద్రకళ లేనిగగనంబువలె, సరస్వతి లేని ముఖంబువలె, శ్రీరామభక్తి లేని చిత్తంబువలె నుపకృతిలేని సంపదవలె, కీర్తిలేని బ్రదుకువలె, వార్తలేని కవిత్వంబువలెఁ గాంతిలేని యద్దంబువలె, శాంతిలేని తపంబు వలె, శాఖలేని చెట్టువలె రేఖ లేని బొందివలె, సకలవైభవంబులు గల్గించు జనక కన్యక లేనందునఁజెన్నుదఱిఁగి, నిన్న నై యున్న యన్నగరుఁ బ్రవేశించి తదీయగృహాభ్యంతరంబున. | 345 |
| సీ. | ఏకతంబునఁ దొల్లి యింతి పల్కిన కూర్మి - పల్కులు వాక్రుచ్చి పనవి పనవి ప్రజల మిథ్యానిందఁ బాటించి వడినెంత - తెగువ సేసితి నంచుఁబొగిలి పొగిలి యీ మాట సౌమిత్త్రి యెఱిఁగింప సతియేమి - యయ్యెనో వని నంచు నడలి యడలి ప్రాణీశ్వరిని బాసి ప్రాణంబులిఁక మేనఁ - నిలుచునే యని భీతిఁ గలఁగి కలఁగి | |
| గీ. | యే సుఖము నింక నేలని యెంచి యెంచి నేత్రముల శోకబాష్పముల్ నించి నించి సొరిగి పలుమాఱుఁ బాన్పుపై నొఱగి యొఱగి యలయు విభుఁ జూచి లక్ష్మణుఁ డార్తుఁడగుచు | 346 |
| కం. | చేరి తమ యన్న పాదాం భోరుహముల వ్రాలి, యశ్రుపూరము లే ఱై పాఱ, నడలంగ ధృతిసెడి, యా రఘువరుఁ డతనిమస్త మశ్రుల ముంచెన్ | 347 |
| ఉ. | ఆ యెడ లక్ష్మణుండు హృదయంబున ధైర్యము పెంచి, లేచి, భూ నాయక చంద్రు దీనవదనంబున సాశ్రు నిరీక్షణావళుల్ డాయఁగఁ జేసి దేవరయలంఘ్యతరాజ్ఞ వహించి, సీతఁగొం పోయి, సురాపగాతటతపోవనభూములు డించి వచ్చితిన్ | 348 |
| ఉ. | ఆ వెతలెన్నియైనఁ గల వర్కకులాధిప! దాఁట వచ్చునే దైవగతుల్? శరీరికి సదా కలదే సుఖ? మార్తిఁజెందినన్ బోవునె వచ్చు నాపదలు? పుట్టి లయించుట కూడి పాయుటల్ జీవులకున్ స్వభావములు చిన్మయమూర్తివి! నీ వెఱుంగవే? | 349 |
| చం. | వగచుట పాడి గాదు మిమువంటి మహాత్ముల కాత్మతత్త్వమున్ దగిలి తలంచి చూచినఁ బృధగ్విధ మెయ్యది? సచ్చిదాత్మకం బగుపరమాత్మ నీవు జగమంతయు నీవు దలంప నయ్యె? నా దిగురుఁడ వైన నీకు నుపదేశము నే నొనరించువాఁడనే? | 350 |
| చం. | అవనిజలాగ్నివాయు గగనాత్మకమైన ప్రపంచమంతయు న్వివిధ చరాచరావళులు నీవయి నిండి వెలుంగుచుండఁగా నవనిజ యెందుఁ బోయినది? యయ్య! భవద్వ్యతిరిక్త మైనవ స్తు వొకటి యున్నదే? మఱపుచూపునఁ జూచి తలంకనేటికిన్ | 351 |
| చం. | అమలత మిమ్మెఱింగిన మహాత్ములె పుత్త్రకళత్ర మిత్త్రవ ర్గముపయి మోహ ముంచక విరక్తి వహింపఁగ, మీకుఁజెల్లునే భ్రమగొని వందురన్? దరుణిఁబాసి ధరాపరిపాలనంబు సే య మఱచె రాముఁడంచు ననరా ప్రజ? లాశ్రితరక్షకోత్సుకా! | 352 |
| మ. | అని బోధింపఁ గలంక దేఱి రఘువంశాంభోధి చంద్రుండు త మ్ముని నెమ్మోముఁ బ్రసన్నదృష్టిఁగని సమ్మోదంబు వాటిల్లె నీ యనవద్యోక్తి - హజారముం దొరసి యన్నా! నాల్గునాళ్ళయ్యె భూ జనసంరక్షణ మెల్లికైన ఘటియించం బోఁదగున్ వేడుకన్ | 353 |
| వ. | అని యాన తిచ్చి యచ్చండాంశువంశమండనుండు వెండియు ననుంగుఁ దమ్మునిం గనుంగొని యిట్లనియె | 354 |
| మ. | సుజనానీకముఁబ్రోచుచున్ గుజనులన్ శోధించి దండించుచున్ బ్రజలాయాయెడఁ దెల్పు విన్నపము లొప్పన్ వించు, భూపాలనం బు జనాధీశుఁడొనర్చి కీర్తి వడయున్, భోగప్రమత్తాత్ముఁడై న జనుల్ దిట్టుదు రిచ్చటన్ నిరయసంతప్తాంగుఁడౌ నచ్చటన్ | 355 |
| కం. | ఇల ఱేఁడు సుకృతి ననుచును బలుమఱు లోపలనెయుండి ప్రజ విన్నపముల్ దెలియ వినఁడేనిఁ గీడగుఁ గల దీ యర్థమున నొక్కకథ విను మనఘా! | 356 |