| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | శ్రీరాముఁడు లక్ష్మణునకు నృగు వృత్తాంతము వచించుట |
| చం. | నృగుఁ డను రాజు తొల్లి యతినిర్మలకీర్తియు బ్రాహ్మణ ప్రియుం డగణితవిక్రమోన్నతుఁ డహంకృతి శూన్యుఁడు సత్యవాది నాఁ బొగడిత కెక్కి రత్నమయ భూషణ భూషితలై సవత్సలై తగు బహుధేనులన్ దినము దానము సేయు మహీసురాళికిన్ | 357 |
| చం. | అతఁడొక పుణ్యకాలమున నర్బుదసంఖ్యల మించు నైచికీ ప్రతతి సదక్షిణాకముగ బ్రాహ్మణకోటుల కిచ్చుచోట సు వ్రతుఁడగు నొక్క విప్రుని సవత్సక ధేను వనేకధేనుసం గతి నటురా నెఱుంగ కొక క్ష్మాసురుఁ బిల్చి నృపాలుఁడిచ్చినన్ | 358 |
| కం. | దానముఁగొని యతఁ డేఁగిన ధేనువుఁగల విప్రుఁ డాత్మ ధేనువు నెందుం గానక, బహుదివసంబులు దీనుండై వెదకె నెల్లదేశములందున్ | 359 |
| తే.గీ. | గోత్రఁ గల గోత్రలం దెల్ల గోవు వెదకి గాత్ర మలయంగ నతఁ డంతఁ గనఖలాఖ్య దేశమున కేఁగి యందొక్క ద్విజునియింట దూడతోనున్న తన ద్రోణదుఘను గాంచె | 360 |
| కం. | కాంచి యరుసించి శబలీ! యంచున్ బిలుచుటయు నొడయఁ డరుదెంచిన వాఁ డంచు నది దూడతోఁజను దెంచి తనువు మూర్కొనంగ ద్విజుఁడింపొందెన్ | 361 |
| కం. | తన ధేనువు తనుఁజేరెను బనియే మెవ్వరికి ననుచుఁ బనివడి వెంటం జనుదెంచునావుఁ దోకొని చన దానము పట్టినట్టి క్ష్మాసురుఁ డలుకన్ | 362 |
| మ. | తగునే నా యిలు సొచ్చి నా మొదవు నుద్దండముతోఁ గొంచుఁ బా ఱఁగఁ జోరత్వము గాక యిత్తెఱఁగు ధీరత్వంబె? యం చుద్ధతిన్ సిగ వీడన్ వెనుచక్కి పింజ వదలన్ జేపట్లకున్ వచ్చినన్ నగి, యా విప్రుఁడు వెఱ్ఱి! యన్యధనమైనన్ నేను గైకొందునే? | 363 |
| కం. | నా మొద విది నిక్కువముగ నే మందలఁగలసి తప్పి యిటఁజేరినదో? యీ మొదవుఁగానకయె యీ సీమంతయుఁ దిరిగి యలతఁ జెందితి ననినన్ | 364 |
| ఉ. | ఇచ్చినయట్టిదాత నృగుఁ డీ మొదవున్ గయికొన్నవాఁడ నే నిచ్చటనే వచించెదవె యీ యనృతోక్తులు? రాజుచెంతకున్ జెచ్చెరరమ్ము చూత మని చేకొనినాతఁడు వల్కఁగాదనన్ వచ్చునె యట్టులైన? నని వచ్చె నతండును గోసమేతుఁడై | 365 |
| ఆ.వె. | వచ్చి పెక్కునాళ్ళు వసుధేశు వాకిలిఁ గాఁచి యతని సమ్ముఖంబు లేమి రోసి, ద్విజులు నృగుని నూసరవెల్లివై పుట్టుమనుచుఁ దిట్టి పోయి రనఘ! | 366 |
| శా. | ఆ శాపంబు నృగావనీశునకు బాహ్యద్వారగుల్ దెల్ప నెం తే శోకించి, నిజాశ్రితాప్త హితమంత్రి శ్రేణి కవ్వజ్ర సం కాశం బౌ ద్విజశాపమున్ నొడివి వేగన్ బుత్త్రు సర్వక్షమా ధీశుం జేసి, నయానయంబులు హితోక్తిన్ దెల్పి ధైర్యంబునన్ | 367 |
| చం. | వలియును మంచు నెండయును వానయు గాలియుఁ జేర నీని బ ల్కలుగులు చేయఁ బంచి యది గన్పడ కుండఁగఁ బుట్టలుం బొదల్ బలువుగ సంఘటింపుఁడని పల్కి నిజాకృతి డించి చొచ్చి యం దలయుచునున్నవాఁ డిపుడు నా నృగుఁ డూసరవెల్లి రూపునన్ | 368 |
| కం. | కావున మత్తుండగు నృపుఁ డా విధమున హానిఁ జెందు ననఘా! నిమియన్ భూవరుఁడును గురుశాపము చే వనరుట మత్తవృత్తిఁ జెందియ కాదే? | 369 |