| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | నిమిచక్రవర్తి శాపము నొందిన విధముఁ దెల్పుకథ |
| ఉ. | ఆ కథ యెట్టులన్న, విను మాదియుగంబున సూర్యవంశజుం డై కొమరొందుచుండు నిమి యన్ జనాథవరుండు, శత్రు శి క్షాకుశలుం డతండు రహి గౌతమమౌనివనంబు చెంత లో కైకమనోహరం బగు మహాపురి యొండొనరించి దానికిన్ | 370 |
| ఆ.వె. | వల్గు సౌధ విజితవైజయంతము గాన వైజయంత మనెడి వర సమాఖ్య యమరఁ జేసి యచట నమరనాధునిఁ బోలి యవని నేలుచుండి యా ఘనుండు | 371 |
| కం. | గురునిభుఁడనఁ దగు తన కుల గురునిం గని యొక్కనాఁడు గురుమతి నే న ధ్వర మొకటి సేయఁ బూనితిఁ గరుణన్ మీరది వహించి కడతేర్చుఁడనన్ | 372 |
| ఉ. | ఆర్యశిఖావతంస మతఁ డాతని కిట్లను నన్ను మున్నె య ధ్వర్యుతకున్ వరించె మఘవంతుఁడు తన్మఖమైన భూమిభృ ద్వర్య! భవన్మఖంబునకు వచ్చెదఁ దాళుమటంచుఁ బోయినన్ గ్రౌర్యముతో నృపాలకుఁడు గౌతమమౌని వరించెఁ జెచ్చెరన్ | 373 |
| శా. | భృగ్వత్రి చ్యవనాదులైన ఋషులం బిల్పించి, ప్రార్థించి, ఋ త్విగ్వర్గంబుగ వారిఁ జేకొని తదాదేశాప్తి శీతాచల ప్రాగ్విశ్వంభర యజ్ఞశాలఁదగ శుంభత్సంపదన్ దద్ధరా భుగ్వంశాగ్రణి దీర్ఘసత్రము జగంబుల్ మెచ్చఁ జేసెన్ రహిన్ | 374 |
| ఆ.వె. | అయిదువేల యేఁడు లడిగినవారికి లేదునాక వరమణీదుకూల భూషణాన్నదానములఁ దృప్తిఁ గావించె నతని కలిమిఁ బొగడ నలవి యగునె? | 375 |
| ఉ. | అంతకుమున్నె యింద్రుమఖమైనఁ దదర్చితుఁడై యరుంధతీ కాంతుఁడు వచ్చి యంతయును గన్గొని నన్ను గురున్ త్యజించి దు శ్చింత మఱొక్కనిన్ గురునిఁ జేసికొనెన్ నిమి వీని కండ క్రొ వ్వంతయు నేఁ డడంతు నని యల్కను వాకిటఁ గాచి యున్నెడన్ | 376 |
| ఆ.వె. | బడలి పగలు నాక పవళించి నిమి యంతి పురమునందు నిదురవోవుచునికి నెఱుఁగఁ డవ్వసిష్ఠుఁ డేతెంచి గాచుట యిలఁ బ్రమత్త జనులకెఱుక గలదె? | 377 |
| చం. | ఇటుల ముహూర్తమాత్ర మవనీంద్రుని వాకిటఁగాచి రాకయుం డుటకు సహింప కా యజతనూజుఁడు కాయజుమే నడంచు ధూ ర్జటివలెనుండి నన్ విడిచి జన్నము సేసియుఁ జెంతఁజేరఁ డీ కుటిలుఁడు వీఁ డనంగుఁడయి గ్రుమ్మరుఁగాకని శాపమిచ్చినన్ | 378 |
| ఉ. | ఆయన శాపమెట్టిదొ! నృపాగ్రణి కాయము వీడినప్పుడే కాయముకంటె ముందు కడగాఁ జనె నిద్రయు నవ్విధంబు భూ నాయకుఁ డాత్మలోఁ దెలిసి నన్ను వృథా శపియించినాతఁడున్ గాయముఁ బాసి గాసిపడుఁగాకని క్రమ్మఱ శాపమిచ్చినన్ | 379 |
| కం. | ఇతరేతర శాపోక్తుల యతియును నృపతియు విదేహులై రప్పుడు దుః ఖితుఁ డయి వసిష్ఠమునిశత ధృతి కడకుం బోయి తన్నుఁ దెలిపికొని యనున్ | 380 |
| మ. | నిమిశాపంబున స్థూలదేహ మడఁగెన్ నే సూక్ష్మదేహంబుతో నమరారాధ్య! భవత్పదాబ్జములు డాయన్ వచ్చితిన్ స్థూలదే హము ప్రాపించు నుపాయమేమి? యిఁక నెందావిర్భవింతున్ దయా సుముఖత్వంబున నానతీయఁదగు నంచున్ దీనుఁడై వేఁడినన్ | 381 |
| కం. | పరమేష్ఠి పలికె మిత్రా వరుణల తేజంబు సొచ్చి, వారలవలనన్ ధర నీ వయోనిజుఁడ వై భరియింపుము దేహ మనుచుఁ బంచిన నతఁడున్ | 382 |
| ఉ. | ఆ విధి యానతిచ్చిన క్రియన్ వరుణాలయ మొందె నంత మి త్రావరుణుల్ పయోధితటధారుణిఁ గ్రుమ్మరుచుండి యొక్క లీ లావనవీథి నూర్వశి మెలంగుటఁ గన్గొని రందు మిత్రుపై నా వగలాఁడి చూపు లొలయన్ దమి నాతఁడు మన్మధార్తుఁడై | 383 |
| ఆ.వె. | చానఁ గదిసినంతఁ జరమధాతువు జాఱ నది గ్రహించి ఘటమునందు నుంచి, వరుణుచెంత మెలఁగ వరుణుండు కామించి సంభ్రమించి కదియ సకియ పలికె | 384 |
| కం. | మిత్రుఁడు వరించెఁ దొలుతఁ గ ళత్రముగా నింక మీరు లక్షించుటకున్ బాత్రమగునేని మామక గాత్రముఁ దిలకించి సుఖము గైకొనుఁడనిన్ | 385 |
| తే.గీ. | దాని తిన్నని నునుఁ బల్కు దానికుల్కు దాని యొయ్యారమును మెచ్చి తాల్మి నిలుప లేక వరుణుండు గూడ స్థలించెఁ దేజ మదియు మునుపటి ఘటమందె యతివయుంచె | 386 |
| ఉ. | అందుల కల్గి మిత్రుఁ డతివా! నను ముందర సెందియుండియున్ నిందకుఁదాళి యవ్వరుణునిం గదియం జన నీకు ధర్మమే? యిందున భూమియందె వసియించి, పురూరవు భార్యవై సడిం బొందు మటంచుఁదిట్టె ఘటిఁ బుట్టి రగస్త్యవసిష్ఠు లిర్వురున్ | 387 |
| కం. | చనియె నగస్త్యుడు తపమున కినవంశాంభోధిచంద్రుఁ డిక్ష్వాకుఁడు దో కొనివచ్చె నవ్వసిష్ఠునిఁ దన కెప్పటివలెఁ బురోహితత్వ మొనర్పన్ | 388 |
| వ. | ఇది వసిష్ఠు జన్మప్రకారం బింక నిమిరాజవృత్తాంతంబుఁ దెల్పెద వినుమని రామభూకాంతుం డూర్మిళాకాంతునకిట్లనియె | 389 |
| మ. | నిమిదేహంబు మణీమయాభరణపంక్తిన్ వస్త్రమాల్యానులే పములన్ మౌను లలంకరించి దయతో నయ్యాగశేషంబు పూ ర్ణము గావింప నిజాంశముల్ గొనుట నానందించి బృందారకుల్ గుమియై పల్కిరి ముక్తదేహుఁడగు నా క్షోణీశమూర్ధన్యుతోన్ | 390 |
| మ. | నిమిరాజేంద్ర! నిరంతరాయదశఁ జెందన్ నీ మఖం బాత్మభా గములం దృప్తుల మైతి మందఱము నింకం గోరు మే కోర్కియై న, ముదం బొందఁగ నీ కొసంగెద మటన్నన్, బ్రాణిసంఘంబు నే త్రములన్ నిచ్చలు నిల్వ నిండనియె నాతం డిచ్చి రద్దేవతల్ | 391 |
| కం. | నిమి నిల్చుటఁ గనుఱెప్పలు నిమిషము లను ఖ్యాతిఁ జెందె నిమిదేహము సం యములు సురల్ మథియింపఁగ నమితగుణాకరుఁడు జనకుఁ డచ్చటఁ బొడమెన్ | 392 |
| ఆ.వె. | వీతదేహ ముద్భవించిన నెలవౌట నతఁడు దగె విదేహుఁ డనెడు పేర మథన జాతుఁ డగుట మిథియన వర్తిల్లె నతనిప్రోలు మిథిల యనఁగఁదనరె | 393 |
| మ. | అనినన్ లక్ష్మణుఁ డద్భుతం బొదువ రామాధీశు నీక్షించి దే వ! నిమిక్ష్మాపతి సత్యధర్మ కరుణా వర్ధిష్ణుఁడయ్యున్ వసి ష్ఠునకున్ గ్రమ్మఱశాపమిచ్చె, క్షమ యచ్చోఁ గన్నఁ బెంపొందఁడే? తనకున్ గోపము చెల్లునే? యనిన సీతానాయకుం డిట్లనున్ | 394 |