| ఇతిహాసములు | ఉత్తరరామాయణము | రాముఁడు లక్ష్మణునకు యయాతివృత్తాంతము చెప్పుట |
| ఉ. | ఆంతరవైరి గాదె యనఘా! పెనుఁగోపము? తద్విముక్తుఁడై క్షాంతి వహింప నొక్కనికి శక్యమె? తొల్లి యయాతిధారుణీ కాంతున కింత చెల్లినది! ఖ్యాతివహించిన యమ్మహాత్ము వృ త్తాంతముఁగొంత దెల్పెదఁ బ్రియం బెనయన్ వినుమంచు నిట్లనున్ | 395 |
| ఉ. | ఆతతనీతి మించు నహుషాధిపసూతి ప్రభాకరప్రతి జ్యోతి కృతాధ్వరత్రిదశహూతి నిరీతి గుణాతిమానిత ఖ్యాతి ధరాభిరక్షణచణాంచితహేతి మహావిభూతిస ద్వ్రాతవినీతి బంధుశివతాతి యయాతి జితాభియాతి యై | 396 |
| కం. | వృషపర్వాభిధ దివిష ద్ద్విషదగ్రణి పుత్త్రి దైత్యదేశిక పుత్త్రిన్ వృషభార్వతులితుఁడతులిత వృషపర్వుఁడతండు దాఁబరియణమయ్యెన్ | 397 |
| తే.గీ. | మేదినీ భర్త తొలుత శర్మిష్ఠవలనఁ బూరు సితకీర్తిగంగాంబుపూరుఁ గనియె యానకలహంసి యగు దేవయానివలన నవ్వెనుక శత్రుభయదుని యదునిఁ గనియె | 398 |
| చం. | దయ వృషపర్వుపుత్త్రి యెడఁ దద్దయు నుంచి, యయాతి భార్గవ ప్రియసుత నాదరింపక చరింప యదుండది చూచి తల్లి కెం తయు నెగబోసె రోస మెదఁ దార్కొన, నందున నామె మందబు ద్ధియయి గురుం దలంప నరుదెంచె భృగూద్వహుఁ డుజ్జ్వలద్యుతిన్ | 399 |
| కం. | అరుదెంచి యతఁడు సుత తన చరణాంబురుహంబు లశ్రుజలములఁ గడుగన్ వెఱఁగంది యేల తల్లీ! పరితాపముఁజెందె? దనుచు బలుమఱు నడుగన్ | 400 |
| ఉ. | కన్నులనీరు చెక్కులను గాల్వలు గట్టఁగఁ బుత్త్రి వల్కె నో యన్న! మఱేమి తెల్పెద! యయాతి సదా వృషపర్వు పుత్త్రిక న్మన్నన సేయుఁ గాని యొకనాఁడును నన్నుఁ దలంపఁ డింతయున్ విన్నప మాచరించి నిను వీడ్కొని మేనుఁ ద్యజింప నెంచితిన్ | 401 |
| కం. | పతి సవతిఁ గూడుకొని యవ మతి సేసిన బ్రతుకుకంటె మగువకు మేలౌ మతిఁ దలఁప జలవిషానల గతులన్ మృతిఁజెందు నుపమఁ గాంచుట లనినన్ | 402 |
| మ. | తన పుత్రిన్ గరుణించి, మాను మిఁక సంతాపంబు నా తల్లి! యౌ వనగర్వంబున నిన్నుఁగైకొనని భూవజ్రాయుధుం డింతటన్ గనుఁగా కెంతయు వృద్ధభావ మనుచున్ గావ్యుండు శాపించి పో యిన జీర్ణించియు మామపై నలుగఁ డయ్యెన్ రాజు సామాన్యుఁడే | 403 |
| మ. | జరఠత్వం బటులన్ వహించి శశివంశస్వామి భోగస్పృహా పరుఁడై జవ్వన మగ్రపుత్త్రుఁ డొసఁగం బ్రాపించి, పెక్కేఁడు లి ద్దఱు దేవేరులతో సుఖించి, ప్రజలన్ ధర్మస్థితిం బ్రోచి, య ధ్వరముల్ సేసి, ధనార్థులన్ మనిచి, యంతన్ దృప్తి వాటిల్లినన్ | 404 |
| కం. | తన ముదిమిఁ దాను గొని జ వ్వనము కుమారున కొసంగి వానిన్ జనపా లనభేలనలోలునిఁ గాఁ బొనరించి యా సుకృతి సనెఁ దపోవనమునకున్ | 405 |
| ఆ.వె. | యదుఁడు తండ్రిమాట కెదురాడి యతని శా పమున రాజ్యభరణ విముఖుఁడయ్యెఁ గ్రూరసంతతులకు గురుఁడయ్యెఁ బితృనింద చేయువాఁడు కీడుఁ జెందుటరుదె? | 406 |
| కం. | పూరుఁడు గురూక్తిఁ జేకొని ధీరుండై కీర్తిఁగని ప్రతిష్ఠానపురా ధారుండై యిందుకులో ద్ధారుండై భూమినేలెఁ దండ్రి తెఱఁగునన్ | 407 |
| ఉ. | గాత్రముఁ బాయుమంచు గురుఁ గ్రమ్మఱ దిట్టి, తదుద్భవవ్యధా పాత్ర మనస్కుఁ డయ్యె నిమి, భార్గవుఁ గ్రమ్మఱఁ దిట్ట నోపియున్ క్షత్రియధర్మ మూని గుణశాలి యయాతి శమించెఁ గ్రమ్మఱన్ ధాత్రియు నేలె, సౌఖ్యమయతన్ విలసిల్లె నుతింపఁ జెల్లదే? | 408 |