ఇతిహాసములు ఉత్తరరామాయణము రావణుండు బలిచక్రవర్తిని జయింప సుతలంబున కరుగుట
రావణుండు బలిచక్రవర్తిని జయింప సుతలంబున కరుగుట
తే.గీ.అవధరింపుము! కుంభ సంభవమహర్షి
చంద్రుఁడిట్లను శ్రీరామచంద్రుఁజూచి
రఘుకులాధీశ! యీ రీతి రావణుఁడు జ
యమ్ము సేకొని వరుణాలయమ్ము వెడలి
2
కం.అతులనుతుల్‌ సలుపుచు దితి
సుతులు గొలువ నవల నరిగి సురుచిరవిభవో
న్నతుల సురధానిఁబోలిన
సుతలముఁగని మెచ్చి చొచ్చి సొంపున నచటన్‌
3
సీ.కలకంఠ శుక శారికారవంబులచేత - వల నొప్పు నుద్యానవనులచేతఁ
బద్మకైరవచారు పరిఖాంబువులచేత - భాసిల్లు కనకవప్రములచేత
మంజులోజ్జ్వలసాలభంజికావళిచేత - రాణించు మణిగోపురములచేత
గారుడోపల బద్ధ తోరణంబులచేతఁ - గనుపట్టు విపణిమార్గములచేత
 
గీ.నవ్యమౌక్తికమయ వితానములచేత
ధవళమగు తుంగసౌధయూధంబుచేత
భవ్యశశికాంత సోపానపంక్తిచేతఁ
బొలుపు మీఱెడు నొక దివ్యపురముఁ గాంచె
4
తే.గీ.కాంచి యచ్చోట బహుశిల్ప కల్పనలకు
నద్భుతం బంది నగరుబాహ్యమున నిలిచి
దనుజవిభుఁ డీ నివాస మెవ్వనిదొ? వేగ
నరసిరమ్మని సేనాని సంపుటయును
5
చం.అతఁడు మహాప్రసాదమని యత్తొలివాకిలి సొచ్చి యచ్చటన్‌
వెతకి మఱెవ్వరింగనక, వేఱొక వాకిఁట కేఁగి నిర్జన
స్థితి నదియుం గనంబడినఁ జెచ్చెర నవ్వలి కొన్ని వాకిళుల్‌
జతనము మీఱి దాఁటి చని, సప్తమసంఖ్యవహించు వాకిటన్‌
6
మ.అరుణుం బోలిన కాంతితో నవపయోదానీలగాత్రంబుతో
నరవిందంబులఁ గేరు నేత్రములతో నాజానులంబోన్నతో
ద్ధురబాహాద్వయితోఁగటీతట లసద్రుక్మాంబరస్ఫూర్తితో
నరుదై చూడ్కికి నొక్క దివ్య పురుషు డచ్చోటఁగాన్పించినన్‌
7
ఉ.ఆసురమంత్రి సేరఁజని యంతటిలో నతఁడట్టహాసముం
జేసిన గాసిఁ జెంది వెఱచేఁ బరువెత్తి దశాస్యు డాసినన్‌
“ద్రాసముఁ బొంది వచ్చిన విధంబిది యేమి? ప్రహస్త!” యన్నచో
నా సురవైరిశేఖరున కక్కడిచోద్యము వాఁడు దెల్పినన్‌
8
ఉ.ఔర! విచిత్రమైనది మహాపురుషుం డతఁ డెవ్వఁ డొక్కొ? క
న్నారఁగ నేను జూచెద నటంచు విమానము డిగ్గి నిల్వక
వ్వీరుఁడు ద్వారషట్కమతివేగమునన్‌ గ్రమియించి సప్తమ
ద్వారము సేరఁగాఁజని ప్రధానుఁడు దెల్పినయట్ల యచ్చటన్‌
9
సీ.కీలికీలారుణాఖీల జిహ్వికవాని - దంష్ట్రాకరాళవక్త్రంబువాని
బభ్రుబర్బర కేశపాశంబు గలవాని - సముదీర్ణ శంఖకర్ణముల వానిఁ
గుప్పగా నిప్పుకల్‌ గురియు కన్నులవానిఁ - జటుల బింబారుణోష్ఠంబువాని
సంరక్త కర్కశశ్మశ్రుజాలమువాని - మసృణారుణోర్ధ్వరోమములవాని
 
గీ.భూరిరోషాభిసూచక భ్రుకుటివాని
నున్నతోన్నత ఘనబాహుయుగళివాని
నుక్కుగదయూనుకొని నిలుచున్నవాని
నొక్క పురుషునిఁజూచె దైత్యోత్తముండు
10
తే.గీ.చూచి యా దివ్యపురుషుండు సూచు వేఁడి
చూపులకు జంకెలకుఁ జెంత సుడియ వెఱచి
వెఱఁగుపడి యట్టె నిలుచున్న వింశతిభుజుఁ
బలికె నమ్మేటి గంభీరభాషణముల
11
చం.కదనము సేయవచ్చి భయకంపితగాత్రుఁడవై వితా వసిం
చెద విదియేమి? రాత్రిచరశేఖర! ధీరులు ధీరవృత్తిఁద
ప్పుదురె? బలీంద్రునిం దొడరి పోరఁగ వచ్చితొ? నన్ను మార్కొనం
గఁదలఁచి వచ్చితో? సమరకాంక్షితశూరునిఁ దెల్పు నావుడున్‌
12
కం.తలఁగిన ధైర్యము గ్రమ్మఱ
నిలుపుకొని దశాననుండు నిర్భయుఁ డగుచున్‌
బలిఁదొడరఁగ వచ్చితి నని
పలికిన నప్పురుషవరుఁడు పకపకనగుచున్‌
13
సీ.త్రైలోక్య వర్ణితౌదార్య శౌర్యోదితో - జ్జ్వలకీర్తి బలిదైత్య చక్రవర్తి
ఖలజనానీక నిగ్రహ విగ్రహాత్యుగ్ర - సమవర్తి బలిదైత్య చక్రవర్తి
యవలోకమాత్ర నేత్రానందకర నిరం - జనమూర్తి బలిదైత్య చక్రవర్తి
జగదీశ్వరార్పణేచ్ఛాప్రకల్పితయజ్ఞ - శతపూర్తి బలిదైత్య చక్రవర్తి
 
గీ.స్వవశచక్ర పరిచ్ఛిన్న సకలశత్రు
చక్రవిస్ఫూర్తి బలిదైత్య చక్రవర్తి
యమ్మహాత్మునిఁదొడర నీ కలవియగునె?
యైనఁ బోవలతేనిఁ బొ మ్మసురనాథ!
14
కం.అని యవరోధము మానినఁ
జని యవరోధమున నసురచంద్రుఁడు గనియెన్‌
వినయాదిక గుణసాంద్రున్‌
బనిత విభోగామరేంద్రు బలిదైత్యేంద్రున్‌
15
చం.కనుఁగొని యట్టహాస మెసఁగం జని బాహువు లప్పళించి ని
ల్చిన దశకంఠునిం గని బలిత్రిదశారి పులస్త్యవంశ వ
ర్ధన! యిటు రమ్ము రమ్మని కరమ్మునఁ జెంతకుఁ జేరఁదీసి చ
య్యనఁ దొడమీఁద నుంచుకొని యాదరపూర్వముగాఁగ నిట్లనున్‌
16
ఉ.సేమమె? నీకు? బంధులకు శ్రేయమె? పుత్రులకున్‌ శుభంబె? నీ
వేమిటి కిందు వచ్చి? తసురేశ్వర! కోరిన కార్యమంతయుం
బ్రేముడి నే నొనర్తు వినిపింపుము నాఁగఁ దదంకవర్తియై
యా మనుజాశియుం బలికె నక్కడిమాట మఱుంగు వెట్టుచున్‌
17
చం.హరి నినుఁగట్టివేసె నని యందఱుఁ దెల్పఁగ నాలకించి నే
హరి నెదిరించి నొంచి భువనైకవదాన్యు హతాన్యసైన్యు నిన్‌
స్థిరమతి బంధముక్తునిఁగఁ జేసెదనంచుఁ దలంచి వచ్చితిన్‌
హరి యిపుడేడనుండు నన నల్లన నవ్వి బలీంద్రుఁ డిట్లనున్‌
18
AndhraBharati AMdhra bhArati - UttaraRamayanamu Uttara Ramayanamu - UttaraRamayan - Kankanti Paparaju - Kamkanti Paparaju